కేసీఆర్ దిమ్మతిరిగేలా తీర్పు
♦ హన్మకొండ ఎన్నికల ప్రచార సభలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు
♦ లక్షలోపు రుణాలు మాఫీ చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారు
♦ ఆ రుణాలపై రైతులు 14 శాతం అపరాధ వడ్డీ కడుతున్నారు
♦ ముఖ్యమంత్రి ఇచ్చేదాంట్లో మూడొంతులు వడ్డీకే పోతోంది
♦ కేసీఆర్ మాట తప్పడం వల్లే రైతు ఆత్మహత్యలు
♦ కందిపప్పు, టమోటా ఈ రోజు పేదలు కొనగలరా?
♦ వైఎస్సార్ పాలనలో క్వింటాల్ పత్తి రూ 6,700 పలికింది
♦ వైఎస్ ఏడాదికి 10 లక్షల ఇళ్లు కడితే కేసీఆర్ ఏడాదిన్నరలో 396 ఇళ్లు కట్టారు
♦ ఆ నాలుగు పార్టీలకు ఓటడిగే హక్కు లేదు
♦ టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో చేతగాని ప్రభుత్వం
♦ కాంగ్రెస్ కన్నా నీచమైన పార్టీ మరొకటి లేదు
♦ పక్క రాష్ర్టంలో దారుణంగా పాలిస్తున్న టీడీపీ
♦ కేంద్రంలో గద్దెనెక్కినా ఒక్క హామీ నెరవేర్చని బీజేపీ
♦ విలువలు, విశ్వసనీయత ఉన్న పార్టీ మాదే
♦ వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు ఓటేస్తే రాజన్న రాజ్యం
వరంగల్ నుంచి సాక్షి ప్రతినిధి : ‘ఎన్నికలకు ముందు కేసీఆర్ బ్యాంకు రుణాలు కట్టొద్దు అన్నారు. అధికారంలోకి వస్తే లక్షలోపు పంట రుణాలన్నీ మాఫీ చెస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చాక నాలుగు దఫాలుగా రుణ మాఫీ చేస్తామంటున్నారు. ఇవాళ రైతుల మీద 14 శాతం అపరాధ వడ్డీ పడుతోంది. విడతల వారీగా కేసీఆర్ ఇచ్చే మొత్తంలో మూడొంతులు వడ్డీకే పోతోంది. ఇంకో వైపు రుణాలు రెన్యూవల్ కాకపోవడంతో క్రాప్ ఇన్సూరెన్స్ కూడా అందక రైతన్న పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దాంతో ఒక్క వరంగల్ జిల్లాలోనే 150 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలాంటి చేతగాని పాలన మనకొద్దు. టీఆర్‌ఎస్‌ను ఓడించి కేసీఆర్ దిమ్మ తిరిగేలా తీర్పునివ్వాలి’ అని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వరంగల్ ప్రజలకు పిలుపునిచ్చారు.
‘నాన్న చనిపోయినపుడు చాలా బాధపడ్డా. అయితే ఆయన వెళ్లిపోతూ ఇంతపెద్ద కుటుంబాన్ని నాకు ఇచ్చారు. మీ అందరి గుండెల్లో ఆయన కొలువై ఉన్నారని తెలుసుకున్న తర్వాత నేను బాధపడడం మానేశా. అందుకే నా ముఖంలో చిరునవ్వు చెదరదు. అదే స్ఫూర్తితో..అదే ధైర్యంతో మిమ్మల్ని ఓట్లు అడుగుతున్నా. మీ అందరి చల్లని దీవెనలు, అశీస్సులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పైన ఉండాలి. మీ అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలి’ అని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. గీసుకొండలో వెల్లువెత్తిన జన ప్రవాహం రాష్ట్రం అంతటా విస్తరించి 2019 నాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయం అని జగన్ చెప్పారు.
వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి బుధవారం వైఎస్ జగన్ ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హన్మకొండలోని హయగ్రీవా చారి మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలోనూ, అంతకు ముందు గీసుకొండ మండల కేంద్రంలోనూఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
వివరాలు ఆయన మాటల్లోనే....
ఇదేనా ప్రభుత్వాన్ని నడిపే తీరు
ఆశా వర్కర్లు 78 రోజుల నుంచి సమ్మెలు, నిరాహార దీక్షలు చేస్తున్నారు. వాళ్లు సంపాదించేది నెలకు రూ 500 నుంచి రూ1000. ఇవాళ కేజీ టమోట రూ 50, కంది పప్పు 230. ఎలా బతకాలని వాళ్లు ఆందోళన చేస్తుంటే కనీసం వాళ్ల గురించి ఆలోచన కూడా చేయలేని అధ్వాన పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. ఇటువంటి పాలకులకు మనం బుద్ది చెప్పాలి. పత్తి పొలాల్లోకి ఒక్కసారి అడుగుపెట్టి రైతులు పడుతున్న కష్టాలు చూడమని కేసీఆర్‌ను అడగండి. క్వింటాల్ పత్తి ధర రు.3,500 కూడా పలకడం లేదు. దివంగత వైఎస్‌ఆర్ పరిపాలనలో క్వింటాల్ పత్తి రూ 6,700లకు పలికిన విషయం ఆయనకు గుర్తు చేయండి. రైతన్నల కన్నీళ్లు పట్టని పెద్ద మనిషి ముఖ్యమంత్రి కుర్చీలో ఎలా కూర్చుంటున్నావయ్యా అని నిలదీయండి. ఎన్నడైనా మార్కెట్‌కు వెళ్లారా, సరుకులు కొన్నారా అని కేసీఆర్‌ను అడగండి. ఇవాళ మార్కెట్‌కు వెళ్లి కంది పప్పు కొనాలంటే కిలో రూ 230 ఉంది.గత ఏడాది ఇదే కందిపప్పు రూ 90లకే దొరికేది. మినప్పప్పు రూ 170 నుంచి 200 పలుకుతోంది. గత ఏడాది రూ 85గా ఉంది. కేజీ టమోట రూ 45నుంచి రూ 50. గత ఏడాది రూ 14లకే టమోటా దొరికేది. ఇలా నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే ఎక్కడి నుంచి తెచ్చి కొనాలి కేసీఆర్.. ఇదేనా రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు నడిపే తీరు అని నిలదీయండి.
ఆ నాలుగు పార్టీలకు ఓటడిగే హక్కు లేదు
కాంగ్రెస్ ఒక నీచమైన పార్టీ. అవసరం ఉంటే ఓ నేతకు దండలు వేస్తారు, అవసరం తీరాక అదే నేత మీద బండలు వేస్తారు. ఎర్రటి ఎండలో పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన వైఎస్‌ఆర్‌పై ఎలాంటి అభాండాలు వేశారో, ఆయన కుటుంబాన్ని కేసులు మోపి ఎన్ని ఇబ్బందులు పెట్టారో మీరు చూశారు. కాంగ్రెస్‌లో ఉన్నంతకాలం వైఎస్ మంచి వారే... ఆయన కొడుకు కాంగ్రెస్‌లో ఉన్నంత కాలం కూడా వైఎస్ మంచివారే. కానీ వైఎస్ కొడుకు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టారో అప్పుడే వైఎస్ చెడ్డవారు అయిపోయారు. ఆయన కొడుకు కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టాడు అనే ఒకే ఒక్క కారణంతో వైఎస్ కుటుంబాన్ని జైలుకు పంపించడానికి కూడా వెనుకాడని పార్టీ అది.
వైఎస్ వంటి నాయకుడినే ఇంత దారుణంగా ఇబ్బంది పెట్టిన పార్టీకి ఇక ప్రజలు ఒక లెక్కా? ఈరోజు ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్లు మీటింగులు పెట్టాలంటే ఎవరెవరిని పిలుచుకుంటున్నారో తెలుసా? ఎవరో సచిన్ పెలైట్ అట. మీరంతా అడగండి ఆ సచిన్ పెలైట్‌కు తెలుగు వస్తుందా అని. ఇలాంటి తెలుగు మాట్లాడలేని వాళ్లు, తెలుగు భాష అర్ధం చేసుకోలేని వాళ్లు మన దగ్గరకు వచ్చి మీటింగులు పెడతారటా..వాళ్ల మీటింగులు చూసి మనం ఓటెయ్యాలట. చంద్రబాబు వచ్చి బీజేపీకి ఓటేయమని అడిగితే చెప్పండి. 18 నెలలుగా మీరు సాగిస్తున్న దారుణమైన పాలన చూస్తున్నాం. మీ కంటే అంతో ఇంతో కేసీఆర్ మేలు అని చెప్పండి.
మీరు చెప్పినవాళ్లకు ఎందుకు ఓటేయాలని అడగండి.. బీజేపీ వాళ్లను కూడా మీకు ఎందుకు ఓటెయ్యాలని అడగండి. ఎన్నికలప్పుడు రెండు రాష్ట్రాలకు సంబంధించి అనేక హామీలు ఇచ్చారు. వాటిలో కనీసం ఒక్కటైనా నెరవేర్చారా? అని గట్టిగా నిలదీయండి. ఇక టీఆర్‌ఎస్‌ది చేతగాని ప్రభుత్వం. కేసీఆర్ చేతగాని పాలన సాగిస్తున్నారు. టీఆర్‌ఎస్‌కి ఓటేస్తే కేసీఆర్ తన పాలన బాగుందని భావించే ప్రమాదముంది. అపుడు పరిస్థితి ఇంతకన్నా దిగజారిపోతుంది. అందుకే ఈ నాలుగు పార్టీలకు ఓటడిగే నైతిక హక్కు లేదు.
రాజకీయాలలో నిజాయితీ రావాలి
ఇపుడు పరిపాలన ఒక మాదిరిగా ఉండగా చెబుతున్న మాటలు మరో విధంగా ఉంటున్నాయి. వీళ్లందరికీ బుద్ధిరావాలి. రాజకీయాలలో నిజాయితీ రావాలి. మాట ఇస్తే దానిపై నిలబడాలన్న ఆలోచన పెరగాలి. జవాబుదారీతనం రావాలి. అపుడే విశ్వసనీయత వస్తుంది. ఇవన్నీ జరగాలంటే అందుకు ఉన్న ఏకైక మార్గం మన ఓటు మాత్రమే. మన ఓటు ద్వారా రాజన్న రాజ్యం తెచ్చుకున్నపుడే ఇవన్నీ సాధ్యమౌతాయి. విలువలు, విశ్వసనీయత ఉన్న పార్టీ ఏదైనా ఉన్నదంటే అది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. వైఎస్ ఎక్కడ ఉన్నారని అడిగితే ప్రజలు తమ గుండెలు చూపించి ఇక్కడున్నారని చెబుతున్నారు.
అందుకే ఓటు అడిగే హక్కు మాకు మాత్రమే ఉంది. ఆ అధికారం, హక్కుతో అడుగుతున్నా మాకు ఓటేయండి. రాజన్న రాజ్యం తెచ్చుకుందాం.’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ శాసనసభ పక్ష నాయకుడు పాయం వెంకటేశ్వర్లు, ప్రోగాం సమన్వయకర్త తలశిల రఘురాం, వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్ రాష్ట్ర నాయకులు ఎడ్మకిష్టారెడ్డి, రెహ్మాన్, గాదె నిరంజన్‌రెడ్డి, శివకుమార్, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, గున్నం నాగిరెడ్డి, మతిన్‌మజాదాది, కొండా రాఘవరెడ్డి, ఇరుగు సునీల్‌కుమార్, ముస్తాఫా ముజతబా, డాక్టర్ పి. ప్రపుల్లారెడ్డి, నర్రాభిక్షపతి, గౌరెడ్డి శ్రీధర్‌రెడ్డి, బీ. రఘురాంరెడ్డి, జి. రాంభూపాల్‌రెడ్డి,ఎం విలియమ్, ఏ.కుమార్, భీమయ్యగౌడ్, సంపత్, సలీం సంతోశ్‌రెడ్డి, సుమిత్‌గుప్తా, బీష్వరవీందర్, అమర్‌నాథ్‌రెడ్డి, సంజీవరావు, బొడ్డు సాయినాథ్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జి సురేశ్‌రెడ్డి, నేతలు ఉపేందర్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, బీ శ్రీనివాసరావు, కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నేతలు బోయినపల్లి శ్రీనివాసరావు, అజయ్‌వర్మ, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షులు సిద్దార్థరెడ్డి, ఏ శ్యాంసుందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఏ హామీ నెరవేర్చారు..?
ప్రతి దళితునికి 3 ఎకరాల చొప్పున భూమి ఇస్తానని ఎన్నికల ముందు కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ 18 నెలల పాలనలో ఎన్ని ఎకరాలు దళితులకు పంచారు? దళితులకు కనీసం 1,600 ఎకరాలు కూడా ఇవ్వని అధ్వాన స్థితిలో కేసీఆర్ పాలన సాగుతోంది. వైఎస్సార్ హయాంలో 20.60 లక్షల ఎకరాలు పేదలకు పంపిణీ చేశారని కేసీఆర్‌కు అర్ధం అయ్యేలా చెప్పండి. పేదలకు పెద్ద చదువులు అందుబాటులోకి తేవడం కోసం వైఎస్సార్ ఫీజురీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ సంవత్సరం సంగతి దేవుడెరుగు 2014-15 సంవత్సరానికి సంబంధించి అంటే గత ఏడాదికి సంబంధించి రూ.2,452 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంటుకు కావాల్సి ఉంటే వాటిలో రూ 1,530 కోట్లు ఇంకా బకాయిలు ఉన్నాయి. అధికారంలోకి వస్తే రెండు బెడ్‌రూంల ఇళ్లు కట్టిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. 18నెలల కాలంలో ఆయన కట్టించింది కేవలం 396 ఇళ్లు మాత్రమే. అదే వైఎస్సార్ పేదలకు ఏడాదికి 10 లక్షల చొప్పున ఐదేళ్లలో 48 లక్షల ఇళ్లు కట్టించారు. ఆ ఐదేళ్ల కాలంలో దేశం మొత్తమ్మీద మిగిలిన రాష్ట్రాల్లో కట్టించిన ఇళ్లు 48 లక్షలు.