ప్రజా శ్రేయస్సు కోసం యుద్ధం చేస్తాం
కేసీఆర్ ఏడాది పాలనపై పొంగులేటి
సాక్షి,హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఏడాది పాలన నినాదాలకే పరిమితమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇకపై టీఆర్ఎస్ పాలనను ఉపేక్షించబోమని తెలిపారు. ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తామన్నారు. సోమవారం ఆయన కేసీఆర్ ఏడాది పాలనపై హైదరాబాద్‌లో ‘సాక్షి’తో మాట్లాడారు.
ప్రభుత్వం ఏ ఒక్క కార్యక్రమాన్ని పూర్తి చేయకుండా మధ్యలో వదిలేస్తోందని విమర్శించారు. ప్రభుత్వాలు మారినా రైతుల తలరాతలు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో టీడీపీ, తెలంగాణలో టీఆర్‌ఎస్ రెండూ దొందూదొందే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి ఏడాదే 4.42 శాతం విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. దీంతో ప్రజలపై రూ.816 కోట్ల భారం పడుతోందని అన్నారు. రైతు, డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిలబెట్టుకోవడం లేదన్నారు.
పోలవరంను జాతీయ ప్రాజెక్ట్‌గా గుర్తించిన కేంద్రం... ఆర్డినెన్స్ రూపంలో ఖమ్మం జిల్లాలోని 324 గ్రామాలను ఏపీలో కలిపింది. దీన్ని అడ్డుకోవటంలో సీఎం పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. లక్ష ఉద్యోగాలు, కాంట్రాక్ట్ ఉద్యోగాల క్రమద్ధీకరణ, రైతుల రుణమాఫీ, రెండు పడకల ఇళ్లు, దళితులకు మూడు ఎకరాల భూమి, ఆసరా పథకం, ఉచిత విద్య, తాగునీరు అందరికి వైద్యంలాంటి పథకాలన్నీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా మారాయన్నారు.
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా తీసుకురావటం మహానేత వైఎస్సార్ స్వప్నం. దీనిని సాధించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో నదీ జలాల వినియోగంపై ప్రభుత్వానికి స్పష్టమైన విధానం, ముందు చూపు కొరవడ్డాయన్నారు. జలయజ్ఞంలో 36 ప్రాజెక్టులు పూర్తి చేయాలని వైఎస్సార్ లక్ష్యంగా పెట్టుకొని నిర్మాణాలు ప్రారంభించారు. ఆ తర్వాత వచ్చిన సీఎంలు వాటి జోలికే పోలేదని అన్నారు. ఉత్తి మాటలు, పర్యటనలు, శంకుస్థాపనలు ఇదే కేసీఆర్ ఏడాది పాలన అని విమర్శించారు.