సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర తొలి కేబినెట్‌లో స్థానం కోసం జిల్లాలో గెలుపొందిన గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు గంపెడాశలు పెట్టుకున్నారు. కొత్త ప్రభుత్వంలో అమాత్యుడి కుర్చీలో ఆసీనులవ్వాలని తహతహలాడుతున్నారు. జిల్లా నుంచి నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మంత్రివర్గంలో స్థానం కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి వారు తెరవెనుక లాబీయింగ్ చేస్తున్నారు. దీంతో చివరికి మంత్రి పదవి ఎవరిని వరించనుంది? ఎంతమందికి ఛాన్స్ దక్కునుంది? అనే దానిపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.
తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అత్యధిక అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్న రంగారెడ్డి జిల్లాకు సహజంగానే కేబినెట్‌లో సముచిత ప్రాధాన్యం దక్కే అవకాశం ఉంది.
గత ప్రభుత్వాలు కూడా జిల్లాకు రెండు మంత్రి పదవులు కేటాయిస్తూ వచ్చాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున నలుగురు ఎమ్మెల్యేలు గెలుపొందారు. వీరిలో ముగ్గురు తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. మంత్రివర్గంలో జిల్లాకు పెద్దపీట వేస్తామని కేసీఆర్ స్పష్టం చేయడంతో ఎమ్మెల్యేలు ఆశలపల్లకీలో ఊరేగుతున్నారు. సరిగ్గా ఎన్నికలకు కొద్ది రోజుల ముందు టీడీపీని వీడి కారెక్కిన మహేందర్‌రెడ్డికి అమాత్యులయ్యే ఛాన్స్‌లు మెండుగా ఉన్నాయి. పార్టీ అధినేత కేసీఆర్ సైతం ఎన్నికల ప్రచారంలో మహేందర్‌ను మంత్రిని చేస్తానని ప్రకటించారు. దీంతో చిరకాల వాంఛ నెరవేరే సమయం అసన్నమైందని ‘పట్నం’ ఆనందడోలికల్లో తేలియాడుతున్నారు. జిల్లాలో మరో సీనియర్ నేత కొప్పుల హరీశ్వర్‌రెడ్డి తాజా ఎన్నికల్లో ఓటమిపాలు కావడం మహేందర్‌రెడ్డికి కలిసొచ్చిందంటున్నారు.
అంతేగాక సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని జిల్లా నుంచి ఒక ఎస్సీకి మంత్రి పదవి ఇవ్వాలని భావించినా.. కనీసం ఇద్దరికైనా క్యాబినెట్‌లో స్థానం ఉంటుంది కాబట్టి ఆ రెండో పేరు తనదేనని మహేందర్‌రెడ్డి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కాగా, అధిష్టానం మాత్రం మంత్రి పదవి విషయంలో మాత్రం మడతపేచీలు పెడుతున్నట్లు తెలుస్తోంది. జిల్లా పరిషత్ పీఠం, మంత్రి పదవిని ఒకే కుటుంబానికి ఇస్తే తప్పుడు సంకేతాలు వెళతాయేమోనని కేసీఆర్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుండడం మహేందర్‌రెడ్డిని కాస్త ఆందోళనకు గురిచేస్తోంది.
మరోవైపు తొలిసారి ఎన్నికైన మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి కూడా మంత్రి పదవి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సీనియర్ నేత హరీశ్వర్‌రెడ్డి ఆశీస్సులు మెండుగా ఉన్న సుధీర్.. అత్యధిక మెజార్టీతో గెలిచిన తాను మంత్రి పదవికి అర్హుడనని, తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఒక వేళ ఎస్సీ సామాజికవర్గాన్ని పరిగణనలోకి తీసుకుంటే వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవరావు పేరు పరిశీలనకు రావచ్చు.
ఎమ్మెల్సీ కోటా ఎసరు పెడుతుందా?
ఉద్యోగ సంఘం మాజీ నేత, ఎమ్మెల్సీ స్వామిగౌడ్ కూడా కేసీఆర్ మంత్రివర్గంలో తనకు చోటు లభిస్తుందనే ధీమాతో ఉన్నారు. కరీంనగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైనా.. స్వామిగౌడ్‌ది రంగారెడ్డి జిల్లానే. ఈ నేపథ్యంలో జిల్లా కోటా నుంచి ఆయనకు ఛాన్స్ దక్కవచ్చనే ప్రచారం జరుగుతోంది. సీనియర్ నేత కావడం, రాజకీయ పరిజ్ఞానం మెండుగా ఉన్న స్వామిగౌడ్‌కు ప్రాధాన్యతగల శాఖ ఇచ్చే అవకాశం లేకపోలేదని గులాబీ శిబిరం అంటోంది.
స్వామిగౌడ్‌ను నెపంగా చూపి జిల్లాకు ఒక మంత్రి పదవితోనే కేసీఆర్ సరిపెడతాడేమోనని ఎమ్మెల్యేలందరిలోనూ ఆందోళన ఉంది.
ఆశలపల్లకిలో..
Published Tue, May 20 2014 12:15 AM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM
Advertisement
Advertisement