పదవులు రాకుంటే అలిగి కూర్చోను.. | i am not intrested on nominated positions replacement | Sakshi
Sakshi News home page

పదవులు రాకుంటే అలిగి కూర్చోను..

Published Sat, Aug 16 2014 11:58 PM | Last Updated on Wed, Oct 17 2018 6:27 PM

పదవులు రాకుంటే అలిగి కూర్చోను.. - Sakshi

పదవులు రాకుంటే అలిగి కూర్చోను..

తాండూరు: జిల్లాలో నామినేటెడ్ పదవుల భర్తీలో తన ముద్ర ఉంటుందని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. తాండూరుకు ఎంపీడీఓ అతిథిగృహంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో కీలకపాత్ర పోషించిన టీఆర్‌ఎస్ నాయకులతోపాటు ఉద్యమకారులకు నామినేటెడ్ పదవుల పంపకంలో తెలంగాణ సర్కారు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. జిల్లాలో నామినేటెడ్ పదువుల పంపకంలో ఉద్యమంలో పనిచేసిన నాయకులు అవకాశాలు దక్కేలా తన వంతు కృషిచేస్తానన్నారు.
 
ఈ విషయమై సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌లతో కూడా మాట్లాడతానన్నారు.  జిల్లాలో నామినేటెడ్ ‘పదవుల భర్తీలో నా ముద్ర లేకపోతే.. అలిగి కూర్చోను’ అని ఆయన స్పష్టం చేశారు. జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డికి ఎంపీగా తన పూర్తి సహకారం ఉంటుందన్నారు. తనకూ మంత్రి సహకారం ఉండాలన్నారు. మంత్రి, తాను కలిసి జిల్లాలో ఇప్పటివరకు అభివృద్ధి కార్యక్రమాలను మొదలుపెట్టలేదని చెప్పారు. కొంతవరకు సమన్వయ ఇబ్బందులు ఉన్నాయన్నారు. ఎంపీగా గెలిచిన తరువాత పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున జిల్లాలో ఎక్కువగా పర్యటించలేదన్నారు.
 
పార్లమెంట్ లో టీఆర్‌ఎస్ ఎంపీలకు సమస్యలపై ప్రస్తావించేందుకు బీజేపీ ప్రభుత్వం అవకాశం బాగానే ఇస్తుందన్నారు. టీడీపీతో సన్నిహితంగా ఉన్నప్పటికీ మోడీ సర్కారు టీఆర్‌ఎస్ ఎంపీలనుపక్షపాత ధోరణితో చూడటం లేదన్నారు. పార్లమెంటరీ వ్యవహారాలు, నిధుల మంజూరు తదితర పాలసీ రీసెర్చ్ కోసం 546 మంది ఎంపీల్లో కేవలం 49 మంది ఎంపీలకు పీఆర్‌ఎస్ (పార్లమెంట్ రీసెర్చ్ స్టడీస్) ప్రత్యేకంగా స్టూడెంట్లను కేంద్ర సర్కారు అటాచ్ చేసిందన్నారు.
   
కోట్‌పల్లి ప్రాజెక్టు నుంచి తాండూరు పట్టణానికి సు మారు రూ.80 కోట్ల నిధుల మంజూరు, కాగ్నాలో చెక్‌డ్యాం నిర్మాణం, పాత తాండూరులో రైల్వే ఓవర్/అండర్ బ్రిడ్జి నిర్మాణం తదితర అభివృద్ధి పనుల పూర్తి చేయించడానికి పార్లమెంట్‌లో కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తానన్నారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ నేతలు నాగేందర్, కనకయ్య, బైండ్ల విజయ్, పుల్లా బిచ్చిరెడ్డి, రాంలింగారెడ్డి, సిరిగిరిపేట్ శేఖర్, వీరమణి, మహేందర్, దత్తు, నబీ, చావూస్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీని పలువురు నాయకులు సన్మానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement