పార్టీలో ఏమీ మాట్లాడలేనంత బలహీనుణ్ని చేశారు | MP Konda Vishweshwar Reddy Resigns TRS Party | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌కు కొండా గుడ్‌బై

Published Wed, Nov 21 2018 3:29 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

MP Konda Vishweshwar Reddy Resigns TRS Party - Sakshi

కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల వేళ టీఆర్‌ఎస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చేవెళ్ల లోక్‌సభ సభ్యుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని మంగళవారం పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపారు. తాను పార్టీని వీడేందుకు దారితీసిన కారణాలను తెలియజేస్తూ కేసీఆర్‌కు మూడు పేజీల లేఖ రాశారు. రాజకీయాల్లోకి రావడం తన కుటుంబ సభ్యులకు ఇష్టం లేనప్పటికీ అప్పటి అవసరానికి అనుగుణంగా తానుటీఆర్‌ఎస్‌లో చేరానని, క్రమంగా పార్టీలోని పరిస్థితులు తనను ఇబ్బందు లకు గురిచేశాయని, మరీ ముఖ్యంగా గత రెండేళ్లుగా జరుగుతున్న పరిణామాలు తనను మనస్తాపానికి గురిచేశాయని తెలిపారు.

తెలంగాణ వ్యతిరేకులను కేబినెట్‌లో చేర్చుకుని వారికే అన్ని అధికారాలు ఇచ్చారని, పార్టీలో తాను బలహీనుడిని అయిపోయానని, కార్యకర్తలకు అన్యాయం జరుగుతున్నా మాట్లాడలేని పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం సమ్మతి కాదని వెల్లడించారు. సమస్య పరిష్కారానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని, సంప్రదాయ రాజకీయ నాయకుడిలా కార్యాచరణ–సిద్ధాంతాలను, భావాలు–సెంటిమెంట్‌ను వేరుచేసి తాను పనిచేయలేనని, అందుకే తీవ్ర బాధాకరం అయినప్పటికీ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. క్రమంగా టీఆర్‌ఎస్‌ ప్రజలకు దూరమవుతోందని, ప్రభుత్వపరంగా ప్రజలకు అందుబాటులో లేకుండా పోతోందని కూడా ఆరోపించారు.  

రాజీనామా లేఖలోని ముఖ్యాంశాలు...  
‘తెలంగాణలోని అన్ని వర్గాలతో కలసి ప్రత్యేక రాష్ట్రం కోసం ముందుండి టీఆర్‌ఎస్‌ ఉద్యమాన్ని నడిపించింది. నన్ను టీఆర్‌ఎస్‌లో చేరాలని 2013లో మీరు (కేసీఆర్‌) కోరారు. కేటీఆర్‌ కూడా చాలాసార్లు నన్ను కలసి పార్టీ ఆశయాలు, ప్రజల ఆకాంక్షల గురించి చెప్పారు. ఆ ఆశ, ఉత్సాహంతోనే నేను పార్టీలో చేరా. మీరు నన్ను చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి పోటీచేయాలని కోరారు. ఆ సమయంలో టీఆర్‌ఎస్‌ చేవెళ్లలో ఓడిపోయే స్థితిలో ఉంది. చాలా మంది తెలంగాణ ఏర్పాటు ఇష్టం లేదు. పట్టణ జనాభా ఉండటమే ఇందుకు కారణం. అయినా, సవాల్‌గా తీసుకుని విజయం సాధించా. నా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని దాదాపు అన్ని గ్రామాలు, డివిజన్లు తిరిగా. ఎంపీగా చాలా మంచి ప్రాజెక్టులు నా నియోజకవర్గానికి తీసుకువచ్చా. పార్లమెంట్‌లో నాలుగున్నరేళ్లలో 90 సార్లు మాట్లాడా. నాలుగు పార్లమెంటరీ కమిటీల్లో సభ్యునిగా ఉన్నా. చాలా ఘటనల తర్వాత (ముఖ్యంగా రెండేళ్ల నుంచి) పార్టీ ప్రజల నుంచి దూరమవుతుందేమో అని అనిపిస్తోంది. ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండటం లేదేమో అనే భావన కలుగుతోంది. నా అసంతృప్తికి కారణమైన ఘటనలను విశ్లేషించుకున్నా. టీఆర్‌ఎస్‌ పట్ల అన్ని వర్గాల్లో మంచి అభిప్రాయమే ఉన్నప్పటికీ ఇలాంటి నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లోకి ఆ ఘటనలు నన్ను నెట్టేశాయి. నా రాజీనామాకు ఐదు కారణాలున్నాయి. అందులో రాష్ట్రం కోసం పోరాడిన కార్యకర్తలకు అన్యాయం జరగడంతో పాటు నా వ్యక్తిగత, నియోజకవర్గ, రాష్ట్ర స్థాయి, పార్టీలోని కారణాలున్నాయి. పార్టీకి 2014లో అవసరమైనప్పుడు నేను పోరాటం చేశా. కానీ, తెలంగాణ వ్యతిరేకులు, టీఆర్‌ఎస్‌ సైద్ధాంతిక విరోధులను కేబినెట్‌లో చేర్చుకుని వారికి ఎక్కువ అధికారాలు, ప్రాధాన్యత ఇచ్చారు. నాతో సహా తెలంగాణ కోసం పోరాడినవాళ్లు, పార్టీ సిద్ధాంతాలకు మేరకు పనిచేసే చాలా మంది టీఆర్‌ఎస్‌లో ఉండే అవకాశం కనిపించడం లేదు. ఎవరు ఎంత రెచ్చగొట్టినా నేను నిస్వార్థంగా, నిజాయితీతో నిలబడ్డా. పార్టీలో బలహీనుడిని అయిపోయా. కార్యకర్తలకు నష్టం జరుగుతున్నా మాట్లాడలేని పరిస్థితి. సమస్యను పరిష్కరించుకోవాలని చాలాసార్లు ప్రయత్నించి విఫలమయ్యా. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం నాకు సమ్మతి కానందున రాజీనామా చేయడమే సరైందని నిర్ణయించుకున్నా. నా లోక్‌సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తా. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి మీరు సాధించిన విజయాలను నేను ఎప్పటికీ గౌరవిస్తా. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన, సాధించిన నాయకుడిగా, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రజలు, చరిత్ర మిమ్మల్ని ఎప్పటికీ నాయకుడిగా గుర్తుంచుకుంటాయని చెప్పడానికి సంతోషిస్తున్నా. చాలా బాధాకరస్థితిలో నేను తీసుకున్న ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకుంటారని భావిస్తున్నా. సంపద్రాయ రాజకీయ నాయకుల్లాగా నేను సిద్ధాంతం–కార్యాచరణ, భావాలు–సెంటిమెంట్‌ను వేరుచేసి పనిచేయలేను. ఎప్పటికీ మీతో స్నేహపూర్వక, హృదయపూర్వక సంబంధాలు కొనసాగుతాయని ఆశిస్తున్నా.’ 

ఈనెల 23న కాంగ్రెస్‌లోకి.. 
టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఈనెల 23న సోనియాగాంధీ సమక్షంలో మేడ్చల్‌లో జరిగే బహిరంగసభలో కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. చాలా రోజులుగా కొండా టీఆర్‌ఎస్‌కు దూరమవుతున్నారని వార్తలు వచ్చాయి. అయితే కొండా సరైన సమయం కోసం వేచిచూశారని, అందులో భాగంగానే కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారని గాంధీభవన్‌ వర్గాలు వెల్లడించాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement