సాక్షి, హైదరాబాద్: తాను బీజేపీని వీడి ఎక్కడికి వెళ్లడం లేదని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి స్పష్టత ఇచ్చారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. దేశంలో బీజేపీని మించిన సెక్యులర్ పార్టీ మరొకటి లేదన్నారు. బీజేపీపై ప్రజలకు నమ్మకం ఉందని, అదే సమయంలో తెలంగాణలో ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందని పేర్కొన్నారాయన.
‘‘కొంతమంది మా మీద ఆరోపణలు చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌తో పొత్తు లేదని నిరూపించుకునేందుకు కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయాలని అంటున్నారు. కానీ, ఇది పార్టీకి సంబంధించిన విషయం కాదు. అది దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాల పని. వాటి పని అవి చేసుకుపోతాయి. కేసు విచారణ త్వరగా పూర్తి చేయాలని మాత్రమే పార్టీ కోరగలదు.
మోస్ట్ కన్ఫ్యూజ్డ్‌పార్టీ అదే..
బీజేపీలో కన్ఫ్యూజన్ నెలకొందని కొందరు అంటున్నారు. కానీ, అలాంటిదేం లేదు. దేశంలో బీజేపీ అంత సెక్యులర్ పార్టీ మరొకటి లేదు. అందుకే కామన్ సివిల్ కోడ్ తేవాలని బీజేపీ తీవ్రంగా కృషి చేస్తోందని చెప్పారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. అయితే కొందరు మాత్రం పనిగట్టుకుని మతానికో కోడ్ ఉండాలని కోరుతున్నారని ఆయన మండిపడ్డారు. ఓ నాయకుడు భారత్ జోడో యాత్ర చేసి.. కశ్మీర్ కు వేరే కోడ్ ఉండాలని అంటాడు. ఇది అసలైన కన్ఫూజన్. పార్టీల్లో మోస్ట్ కన్ఫ్యూజ్డ్ పార్టీ కాంగ్రెస్. రాజకీయ అవసరాల కోసం సిద్ధాంతాలు లేకుండా వ్యవహరించే కాంగ్రెస్సే మోస్ట్ కన్‌ఫ్యూజ్డ్ అని అంటారు. అలాగే బీఆర్‌ఎస్‌లో ఉన్నోళ్లంతా.. ఒకప్పటి తెలంగాణవ్యతిరేకులేనని, ఆంధ్రను అడ్డగోలుగా విమర్శించారని గుర్తుచేశారాయన. వీటిల్లో ఏ పార్టీ కూడా సవ్యంగా లేదని.. అవి రియల్ కన్ఫ్యూజ్డ్ పార్టీలనీ అన్నారు.
రేవంత్‌కు ఆహ్వానం..
రేవంత్‌రెడ్డి లక్ష్యం మా లక్ష్యం ఒక్కటే. కానీ, కేసీఆర్‌ను కొట్టగల ఆయుధాలు మా దగ్గరే ఉన్నాయి. అందుకే రేవంత్ రెడ్డి బీజేపీలోకి రావాలని ఆహ్వానిస్తున్నా.
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మార్చాలనేది మా ప్రధాన డిమాండ్ కాదు. ఢిల్లీ పర్యటనలో వేరే వేరే ఇష్యూలను అమిత్ షాకు వివరించాం. నా మనసులో మాటల్ని ఒక టీవీ ఛానల్ ఇంటర్వూలో చెప్పాను. కానీ, కొన్ని మీడియా ఛానెల్స్ వాళ్లు నేను చెప్పింది మరోలా రాశారు. నేను పార్టీ మారడం లేదు. బీజేపీ నేతలను కొనడం అంత ఈజీ కాదు.. అందుకే ప్రజలకు బీజేపీ పై నమ్మకం ఉంటుంది. పార్టీ కోసం ప్రచారం చేసుకోకపోవడమే మా మైనస్ అని కొండా విశ్వేశ్వరరెడ్డి తన పేరిట ప్రచారం అవుతున్న వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment