చేవెళ్ల సీటు మోదీదే రాసిపెట్టుకోండి: బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి చాలాచోట్ల అభ్యర్థులే దొరకడంలేదని, అందుకే ఇతర పార్టీల్లో టికెట్ రాని నేతల కోసం ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేత, చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి చెందినవారు ముఖ్యమంత్రిని కూడా బయటనుంచి తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. గురువారం బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి తనకు మంచి మిత్రుడని, ఆయనకు టికెట్ రాకపోవడం బాధాకరమన్నారు.
డీకే అరుణ, జితేందర్‌రెడ్డి ఇద్దరూ పెద్ద లీడర్లేనని, జితేందర్‌రెడ్డి పార్టీ మారతారని తాను భావించడం లేదని చెప్పారు. చేవెళ్ల సీటు మోదీదేనని రాసి పెట్టు కోవచ్చని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ తెలంగాణలోని 12, 13 సీట్లు గెలిచినా ఆశ్చర్యపోనవసరంలేదని చెప్పారు. బీజేపీలోకి బీఆర్‌ఎస్ ఎంపీ రంజిత్‌రెడ్డి వస్తానన్నా తమకు అభ్యంతరం లేదన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటేననే తమ పార్టీపై దుష్ప్రచారం సాగుతోందని, మద్యం కుంభకోణం కేసులో చర్యలు తీసుకోకపోవడం వల్ల అలా అనుకుని ఉండొచ్చునని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా కాంగ్రెస్ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment