సాక్షి, వికారాబాద్ : కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అప్పుడప్పుడూ మీడియా ముందుకు వస్తున్నా ఏ పార్టీలో చేరుతారనే విషయం దాటవేస్తున్నారు. అయితే టీఆర్‌ఎస్ విధానాలను గట్టిగా వ్యతిరేకిçస్తూ వస్తున్న ఆయన కాంగ్రెస్, బీజేపీల విషయంలో సమాన దూరాన్ని పాటిస్తున్నారు. ఇటీవల బీజేపీలో చేరతారనే ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరో రెండు నెలల్లో ఏ పార్టీలో చేరతాననే విషయం చెబుతానని ఇటీవల ‘సాక్షి’ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొనడంతో ఆయన ప్రాబల్యం, అనుచరగణం ఎక్కువగా ఉన్న జిల్లాలో మరోసారి చర్చకు దారి తీసింది..
2021 మార్చిలో అకస్మాత్తుగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మూడునెలల పాటు నిరీక్షిస్తానని చెప్పిన విషయం తెలిసిందే. ఆ తరువాత అనేకసార్లు ఆయన మీడియా ముందుకు వచ్చినప్పటికీ ఎలాంటి పొలిటికల్ స్పష్టత ఇవ్వకుండానే ముగించడం ఆయన క్యాడర్‌ను నిరాశా నిస్పృహలకు గురిచేస్తూ వస్తోంది.
టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే పార్టీతోనే..
జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేయగానే ఆయన బీజేపీలో చేరుతారనే చర్చ జరిగింది. అనంతరం పలు మార్లు ఆయన టీఆర్‌ఎస్‌ను బీజేపీ గట్టిగా ఎదుర్కోనుందా అనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్‌లో కొందరు నాయకులు అమ్ముడు బోయిండ్రు అంటూ విమర్శిస్తూనే.. కేసీఆర్‌తో గట్టిగా ఫైట్ చేసే పీసీసీ నాయకుడొస్తే కాంగ్రెస్‌లో చేరాలా? లేక తటస్తులు పార్టీ పెడితే వారితో కలవాలా అంటూ గతంలో అస్పష్ట ప్రకటనలు చేశారు. దీంతో కొండా దారెటు అనే విషయం ఆయన క్యాడర్‌తో పాటు జిల్లా రాజకీయాల్లో నానుతోంది. కొండా మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారీ ఎలాంటి రాజకీయ దుమారం చేస్తారా? అని రాజకీయ వర్గాలతో పాటు సాధారణ ప్రజల్లోనూ ఉత్కంఠ రేపుతుండగా ఆయన మాత్రం చర్చకు ఇంకా తెరదించటంలేదు. కొండా ఇచ్చే స్పష్టత కోసం ఆయన అనుచరగణంతో పాటు రాజకీయ వర్గాలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి.
బీజేపీలో చేరుతారంటూ ప్రచారం
ఇటీవల కొండా.. బీజేపీలో చేరుతారనే ప్రచారం ఎక్కువగా సాగుతోంది. అయితే టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఆ విషయంలో అధికారపార్టీతో పోరాడుతానని చెప్పారే తప్ప ఆయన స్పష్టత నివ్వలేదు. ఇటీవల జిల్లాలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, రగులుతున్న రాజకీయ వేడితో ప్రజలు, కేడర్ కంటే ఆయా పార్టీల నేతల్లోనే కొండా పయనంపై ఉత్కంఠ ఎక్కువగా కనిపిస్తుండటం గమనార్హం. ఒకవేళ బీజేపీలో చేరితే ఎవరికి పోటీగా మారతారని చర్చసాగుతోంది. పరిగి నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగితే తమ పరిస్థితి ఏమిటని అక్కడి నేతలు భావిస్తుండగా చేవెళ్ల ఎంపీగా పోటీ చేస్తే మరోసారి కాంగ్రెస్, టీఆర్‌ఎస్ అభ్యర్థులకు గట్టిపోటీ ఇవ్వనున్నారనే ఊహాగానాలు ఇటీవల ఊపందుకున్నాయి.
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి జెండా, ఎజెండాపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. డోలాయమాన వ్యూహాన్ని వీడటంలేదు. ఏడాది కాలంగా తటస్తంగా ఉంటూ వస్తున్న ఆయన ఏ పార్టీలోచేరుతారనే విషయంలో స్పష్టతనివ్వడంలేదు. ఏడాది క్రితం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం విదితమే. కొండా దారెటో అనే విషయం జిల్లాలో చర్చ సాగుతోంది. ప్రజలు, కేడర్ మరిచిపోకుండా ఉండేందుకు అప్పుడప్పుడు ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మీడియాలో తళుక్కుమంటూ మళ్లీ తెరచాటుకు వెళ్తుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment