నేలకొరిగిన ‘పులి’
- భాయ్‌సాబ్ ఇకలేరు..
- నరేంద్ర మృతితో అన్ని పార్టీల నేతల దిగ్భ్రాంతి
- తరలివచ్చిన ఆయా పార్టీల ప్రముఖులు
అబిడ్స్,చార్మినార్,గోల్నాక,న్యూస్‌లైన్: పులి నేలకొరిగింది. ఆయన పేరు చెబితే ప్రత్యర్థుల గుండెల్లో దడపుట్టించే టైగర్ నరేంద్ర కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం నాంపల్లిలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆలే నరేంద్రకు భార్య లలితతోపాటు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
పెద్ద కుమారుడు ఆలె భాస్కర్‌రాజ్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు. చిన్న కుమారుడు జితేంద్ర బీజే వైఎం గ్రేటర్ అధ్యక్షుడు, గౌలిపురా కార్పొరేటర్‌గా ఉన్నారు. కుమార్తె సబితకు వివాహమైంది. నరేంద్రకు నలుగురు సోదరులు, నలుగురు అక్కాచెల్లెలున్నారు. ఆయన మరణవార్త తెలుసుకొని అన్ని పార్టీల నేతలు ఆస్పత్రికి తరలివచి భౌతికకాయానికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు.
పాతబస్తీలో విషాదచాయలు : నరేంద్రమృతితో ప్రధానంగా పాతబస్తీలో విషాదచాయలు అలుముకున్నాయి. నాంపల్లి కేర్ ఆస్పత్రి నుంచి అంబులెన్స్‌లో ఆయన పార్ధివదేహాన్ని మదీనా, చార్మినార్, శాలిబండల మీదుగా గౌలిపురాలోని ఆయన నివాసానికి ర్యాలీగా తీసుకొచ్చారు. పాతబస్తీలోని ప్రధాన కూడళ్లలో ఆయన చిత్రపటాలు, నల్లజెండాలు ఉంచి సంతాపం తెలిపారు.
అంబర్‌పేటతో విడదీయరాని బంధం : అప్పటి హిమాయత్‌నగర్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆలె నరేంద్రకు అంబర్‌పేటతో విడదీయరాని అనుబంధం ఉంది. పేదల పెన్నిధిగా పేరొందిన ఆయన ఇకలేరని తెలిసి పలువురు నాయకులు దిగ్భాంతికి గురయ్యారు. తొలిసారి 1983లో హిమాయత్‌నగర్ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు.
కార్మిక నాయకుడిగా కూడా ఉన్న నరేంద్ర నియోజకవర్గానికి చెందిన పలువురికి వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు పెట్టించారు. 1989లో జరిగిన సాధారణ ఎన్నికల్లో వి.హనుమంతరావు చేతిలో పరాజయం పాలయ్యారు. 1994లో బీజేపీ నుంచి పోటీచేయగా 67 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి కృష్ణాయాదవ్ చేతిలో ఓడిపోయారు. నాటినుంచి నియోజకవర్గానికి దూరంగా ఉంటూ వచ్చారు.
నరేంద్రనగర్ : అంబర్‌పేట డివిజన్‌లో ఆలె నరేంద్ర పేరు మీద ఒక బస్తీ ఏర్పాటైంది. ప్రస్తుతం దాన్ని నరేంద్రనగర్‌గా పిలుస్తున్నారు. ఈ బస్తీలోనే నరేంద్రనగర్ కమ్యూనిటీహాల్ కూడా ఉంది.