ప్రేమకు ఆసిడ్‌ టెస్ట్‌ | Acid Test for Love... | Sakshi
Sakshi News home page

ప్రేమకు ఆసిడ్‌ టెస్ట్‌

Published Mon, Jun 5 2017 11:50 PM | Last Updated on Fri, Aug 17 2018 2:10 PM

ప్రేమకు ఆసిడ్‌ టెస్ట్‌ - Sakshi

ప్రేమకు ఆసిడ్‌ టెస్ట్‌

రాంగ్‌ నెంబర్‌

మూడు నెలల క్రితం.లలిత ఓ నెంబర్‌కి కాల్‌ చేసింది. అది రాంగ్‌ నంబర్‌.అయితే అది రాంగ్‌ నెంబర్‌ కాదనీ..తను కాల్‌ చేసిన వ్యక్తే తన జీవిత భాగస్వామి అవుతాడనిలలిత అప్పుడు ఊహించలేదు!

ఆ రోజు.. ‘‘సారీ.. రాంగ్‌ నెంబర్‌’ అని ఫోన్‌ పెట్టేశాక.. రెండు వారాల తర్వాత అదే నెంబర్‌ నుంచి లలితకు ఫోన్‌ వచ్చింది. అటువైపు ఉన్నది రవిశంకర్‌ సింగ్‌. సీసీటీవీ ఆపరేటర్‌. ముంబై శివార్లలోని మలాడ్‌ నుంచి వచ్చింది ఆ కాల్‌. లలిత ఉండేది ముంబైలో. ‘‘మీ గొంతు బాగుంది’’అన్నాడు రవి. లలితకు కోపం వచ్చింది. ‘‘మీరెవరు?’’ అని అడిగింది. చెప్పాడు. ‘‘ఎందుకు చేశారు?’’ అని అడిగింది. ‘‘మీ గొంతు వినడం కోసం’’ అన్నాడు రవి. అప్పట్నుంచీ.. ఆమె గొంతు వినడం కోసం రవి ఫోన్‌ చేస్తుండేవాడు. అతడిని నిరుత్సాహపరచడం ఇష్టం లేక లలిత అతడితో మాట్లాడుతుండేది.

ఓరోజు సడెన్‌గా ‘‘ఐ లవ్యూ’’ చెప్పాడు రవి! లలిత బిత్తరపోయింది. కొన్ని నిముషాలు నిశ్శబ్దం! ఆమె గొంతు మూగబోవడంతో.. ‘‘ఏమైందీ..!’’అని కంగారుగా అడిగాడు రవి. ‘‘మీకు నా గొంతు మాత్రమే బాగుంటుంది. ముఖం బాగుండదు’’ అంది లలిత. ‘‘మిమ్మల్ని చూసి కాదు కదా, మీకు ఫోన్‌ చేసింది’’ అన్నాడు రవి. ఆ క్షణంలో.. లలితకు రవి మీద రెస్పెక్ట్‌ మొదలైంది. లలిత నిజమే చెప్పింది తన ముఖం బాగుండదని. నిజానికి ఆమె అందంగా ఉండేది. చూడచక్కని ముఖం. కానీ 2012లో ఓ రోజు... ఉత్తరప్రదేశ్‌లోని అజామ్‌ఘర్‌కు లలిత కుటుంబ సభ్యులంతా బంధువుల పెళ్లికి వెళ్లినప్పుడు.. ఆ పెళ్లిలో లలిత చిన్న తమ్ముడికి, తమ్ముడి వరసయ్యే ఇంకొకతనికీ మధ్య గొడవ జరిగింది. ఎక్కడినుంచి వచ్చిందో.. ఓ ఆసిడ్‌ బాటిల్‌ పైకి లేచింది. అడ్డుకోడానికి పరుగున వాళ్ల మధ్యలోకి వెళ్లిపోయింది లలిత. అంతే.. ఆసిడ్‌ ఆమె ముఖంపై పడింది. ముఖం కాలిపోయింది.

ఇప్పటికి లలిత ముఖానికి 17 సర్జరీలు జరిగాయి. ఈ ఏడాది ఇంకో 12 సర్జరీలు జరగబోతున్నాయి. ఈ కథంతా రవికి చెప్పింది లలిత. ‘‘కొంచెం ముందు చెప్పాలింది’’ అన్నాడు రవి నవ్వుతూ... ఫోన్‌లోనే. ‘‘ఎందుకు?’’ అంది లలిత.‘‘ఆల్రెడీ నేను మీ ప్రేమలో పడిపోయాను. వెనక్కి పోలేను’’ అన్నాడు మళ్లీ నవ్వుతూ. ‘‘జాలి చూపుతున్నారా?’’ అంది లలిత.‘‘కాదు, జాలి కాదు. మీ వాయిస్‌ నచ్చింది. ఇప్పుడు.. మీ ముఖం నచ్చింది. మీ అందమైన మనసు... మీ ముఖంలో ప్రతిఫలించడాన్ని నా హృదయం చూడగలుగుతోంది లలిత గారూ’’అన్నాడు రవి!

లలిత ఆశ్చర్యపోయింది. ‘‘మనం పెళ్లి చేసుకుందాం’’ అన్నాడు రవి. ఇంకా ఆశ్చర్యపోయింది. గత నెలలో దాదర్‌లోని డిసిల్వా టెక్నికల్‌ కాలేజీలో వీళ్ల పెళ్లి జరిగింది. ‘యాసిడ్‌ సర్వైవర్స్‌ సాహస్‌ ఫౌండేషన్‌’ వీళ్ల పెళ్లిని జరిపించింది. లలిత ఆ ఫౌండేషన్‌లో మెంబర్‌. పెళ్లి అరేంజ్‌మెంట్‌లన్నీ బాగా జరిగాయి. ఫుడ్డు, డెకరేషన్, భోజనాలగది, హనీమూన్‌ ప్యాకేజీ.. ఇలాంటివన్నీ పెళ్లికి వచ్చిన వాళ్లు ముందే సమకూర్చిపెట్టారు. లలితకైతే లెక్కలేనని పైథానీ చీరలు గిఫ్టుగా వచ్చాయి. అబుజైనీ, సందీప్‌ ఖోస్లాలు వధూవరులకు స్పెషల్‌గా బట్టల్ని డిజైన్‌ చేసి బçహూకరించారు. జీవితం అందమైనది. ప్రేమ ఇంకా అందమైనది. ఆసిడ్‌లు, ఆసిడ్‌లాంటి మనుషుల వల్ల జీవితం గానీ, జీవితంలోని ప్రేమ గానీ చెక్కు చెదరదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement