మావోయిస్టుల కట్టడిపై కేంద్రం నజర్
భద్రాచలం: మావోయిస్టుల కట్టడిపై కేంద్ర హోంశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు అటవీ ప్రాంతాలను స్థావరాలుగా చేసుకుని.. కార్యకలాపాలు సాగిస్తున్న మావోయిస్టులను నియంత్రించేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా మూడు రాష్ట్రాల సరిహద్దులో ప్రస్తుతం 20 సెల్‌టవర్లను ఏర్పాటు చేస్తోంది. ఏకకాలంలో పెద్ద మొత్తంలో బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ల నిర్మా ణం జరగటం ఇదే ప్రథమం. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి పథకంలో భాగంగా మంజూరైన నిధులతో ప్రస్తుతం బీఎస్‌ఎన్ ఎల్ సెల్‌టవర్ల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. భద్రాచలం టెలికాం డివిజన్ పరిధిని విస్తరించి ఉన్న జిల్లాలోని గోదావరి నదికి ఇరువైపులా ఉన్న మండలాలతో ఏపీలో విలీనమైన మండలాల్లో కూడా టవర్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రస్తు తం ఈ ప్రాంతంలో 50 బీఎస్‌ఎన్‌ఎల్ టవర్లు అందుబాటులో ఉన్నాయి.
సోలార్ సిస్టమ్‌తో సిగ్నల్ వ్యవస్థ
ఇప్పటివరకు అందుబాటులో ఉన్న టవర్ల ద్వారా విద్యుత్ సరఫరా ఉంటేనే సిగ్నల్ వ్యవస్థ పనిచేస్తుంది. కానీ.. నూతన టవర్లు సోలార్ సిస్టమ్‌తో పనిచేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో తరచూ తలెత్తే విద్యుత్ అవాంతరాలతో కమ్యూనికేషన్ వ్యవస్థకు ఆటంకం లేకుండా వీటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక టవర్ 4 నుంచి 5 కిలోమీటర్ల విస్తీర్ణంలో సిగ్నల్ పనిచేస్తుంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని అటవీ ప్రాంతంలో కూడా ఇదే రీతిన టవర్ల నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇవన్నీ అందుబాటులోకి వచ్చినట్లయితే అటవీ ప్రాంతాల్లో ఉన్న గిరిజన గ్రామాల్లో సెల్ హల్‌చల్ చేయనుంది.
అడ్డుకట్ట వేయడమే లక్ష్యం
కూంబింగ్ కోసం అటవీ ప్రాంతాల్లోకి వెళ్తున్న పోలీసు, సీఆర్‌పీ ఎఫ్, ప్రత్యేక బలగాలు సమాచారం కోసం వైర్‌లెస్ సిస్టమ్‌తో పనిచేసే వాకీటాకీలను ఉపయోగిస్తున్నారు. అలాగే గ్లోబల్ పొజిషన్ సిస్టం(జీపీఎస్) ద్వారా ముందుకు సాగుతూ.. అత్యవసర సమయంలో సంఘటనా స్థలం నుంచి సమాచారం చేరవేసేందుకు శాటిలైట్ ఫోన్లను ఇటీవల వినియోగిస్తున్నారు. వివిధ పోలీసు బలగాల జాయింట్ ఆపరేషన్లతో ఇటీవల కాలంలో మావోయిస్టులకు తీవ్ర నష్టమే వాటిల్లింది. గ్రామాల్లో బలంగా ఉన్న కొరియర్ వ్యవస్థ ద్వారా మావోయిస్టులకు సంబంధించిన సమాచారాన్ని మరింతగా రాబట్టి, వారికి అడ్డుకట్ట వేసేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఎదురుదాడి తప్పదా?
సమాచారాన్ని సత్వరమే రాబట్టుకునేందుకు ఒకేసారి పెద్ద ఎత్తున సెల్‌టవర్ల నిర్మాణాలు చేపడుతున్నప్పటికీ మావోయిస్టుల ఎదురుదాడి నుంచి వాటిని కాపాడుకోవటం సాధ్యమేనా అనే ప్రశ్నలు సైతం ఉత్పన్నమవుతున్నాయి. అటవీ ప్రాంతాల్లో నిర్మించే సెల్‌టవర్ల ద్వారా జరిగే నష్టాన్ని ముందుగానే ఊహించిన మావోయిస్టులు గతంలో దుమ్ముగూడెం మండలం చినబండిరేవు, ఆర్లగూడెం, కొత్తపల్లి, ఏపీలో విలీనమైన ఎటపాక మండలం లక్ష్మీపురం, గన్నవరం టవర్లు పనిచేయకుండా నిప్పంటించారు. భవిష్యత్‌లో కూడా ఇటువంటి ఘటనలు జరిగే అవకాశం లేకపోలేదని గిరిజనులు అంటున్నారు.