తిరుమల యాత్ర చాలా సులభం
తిరుమలలోని శ్రీనివాసుని దర్శనం కోసం సూదూర ప్రాంతాల నుంచి వెళ్లే లక్షలాది మంది భక్తులు అక్కడ వసతి సౌకర్యాలు లభించక తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. వసతి గృహాలు పొందాలంటే ఎవరో ఒకరి సిఫార్సు లేఖ ఉండాల్సిందే. రూ.100 అద్దె ఉన్న గదికి కూడా పై స్థాయిలో రికమండేషన్ తప్పనిసరి. ఈ నేపథ్యంలో భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎలాంటి సిఫార్సు పత్రాలు లేకుండా స్థానికేతరులకు వసతి కల్పించేందుకు
ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వసతి సౌకర్యం ఎలా పొందాలి, ఇందుకు ఎలాంటి ధృవపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది, అందే సదుపాయూలపై మీ కోసం...
వసతి సౌకర్యం పొందాలంటే..
⇒ స్థానికేతరులై ఉండాలి. (తిరుపతికి చెందిన వారు కాకూడదు)
⇒ ఎటువంటి సిఫార్సు పత్రం ఉండకూడదు.
⇒ ఓటరు ఐడీ, పాన్‌కార్డు, డ్రైవింగ్ లెసైన్స్, ఆధార్ రేషన్ కార్డు వీటిలో ఎదో ఒకటి ఒరిజినల్, నకలు కాపీలు జత చేయూలి.
వసతి ఎక్కడ..
⇒ కౌస్తుభం వసతి గృహంలో గదులు అందుబాటులో ఉంటాయి.
⇒ ఈ భవనం తిరుమల బస్టాండ్ దగ్గర పిఎసి-2 సమీపంలో ఉంది.
⇒ ఇందులో 575 గదులు ఉన్నాయి.
⇒ రూ.100 నుంచి రూ. 3000 ధర వరకు వివిధ శ్రేణుల్లో అందుబాటులో ఉంటాయి.
⇒ ఇది 24/7 పని చేస్తుంది.
ఇలా పొందవచ్చు
⇒ ముందుగా ఇక్కడి భవనంలో కౌంటర్ వద్ద ఉన్న డిస్‌ప్లేలో వసతి గదుల వివరాలు చూసుకోవాలి.
⇒ మీకు నచ్చిన గదిని ఎంపిక చేసుకుని సంబదిత ఫామ్‌పై మీ పూర్తి వివరాలు నమోదు చేసి అధికారులకు అందించాలి.
⇒ మీ దరఖాస్తుకు గుర్తింపు కార్డు నకలు జత చేయాలి.
⇒ మీరు తీసుకునే గది అద్దెకు సమానంగా కాషన్ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది.
⇒ ఫార్మాలిటీస్ పూర్తి చేసి అదే కౌంటర్‌కు ఎదురుగా ఉన్న మరొక కౌంటర్‌లో రసీదును అందజేస్తే గది తాళం చెవులు అప్పగిస్తారు.
గమనిక: గది ఖాళీ చేసే సమయంలో ఎవరి పేరున గది తీసుకున్నారో వారే కాషన్ డిపాజిట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇతరులకు ఎట్టి పరిస్ధితుల్లో ఇవ్వరు. పోలీస్, మీడియా, స్థానికులు, ఉద్యోగులకు ఇందులో గదులు కేటాయించరు.