- పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై వచ్చిన ఫిర్యాదులపై గంటల్లో నిర్ణయం తీసుకోలేమని తెలంగాణ శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి స్పష్టం చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిరవధిక వాయిదా అనంతరం డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి టి.హరీశ్ రావు, కార్యదర్శి రాజా సదారాం, మీడియా అడ్వైజరీ కమిటీ చైర్మన్ వి.ఈశ్వర్‌రెడ్డిలతో కలిసి శనివారం విలేకరులతో మాట్లాడారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని చాలా ఫిర్యాదులు వచ్చాయని స్పీకర్ చారి తెలిపారు. వీటిపై రాజ్యాంగపరంగా, సంప్రదాయాలను పాటిస్తూనే స్పీకర్‌కు ఉన్న విశేషాధికారాలను ఉపయోగించుకుంటామని చెప్పారు. ఇది రాజ్యాంగానికి లోబడి, సంప్రదాయాలను అనుసరిస్తూ ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిన అంశమన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా శాసనసభలో నిర్మాణాత్మక చర్చలు జరిగాయన్నారు. 19 రోజుల పాటు జరిగిన చర్చల్లో 6 తీర్మానాలు, మూడు బిల్లులు ఆమోదం పొందగా, మూడు సభాసంఘాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించినట్టుగా చెప్పారు. ఆసరా పింఛన్లు, జూబ్లీహిల్స్ కాల్పుల సంఘటనపై ప్రభుత్వం రెండు ప్రకటనలను చేసిందని చారి తెలిపారు.
సభలో సహకరించిన అని పక్షాలను స్పీకర్ అభినందించారు. డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ చాలా ఏళ్ల తర్వాత భవిష్యత్ తరాలకు ఆదర్శవంతంగా, స్ఫూర్తిదాయకంగా అసెంబ్లీలో నిర్మాణాత్మక అంశాలపై అర్థరాత్రిదాకా అర్థవంతమైన చర్చలు జరిగాయని చెప్పారు.