బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములమవుతాం
మహేశ్వరం : అరవై ఏళ్ల ఉద్యమం, అమరవీరుల త్యాగాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు. రాష్ట్రసాధన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న విద్యార్థులు... బంగారు తెలంగాణ నిర్మాణంలోనూ భాగస్వాములవుతారని పేర్కొంటున్నారు.
పోలీసు తూటాలను ఎదిరించి, లాఠీదెబ్బలకోర్చి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆసక్తి ఉన్న వారికి రాజకీయావకాశాలు కల్పిస్తే నవ తెలంగాణ సాధ్యమవుతుందని స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు పలువురు విద్యార్థి సంఘాల నేతలు ‘న్యూస్‌లైన్’తో తమ అభిప్రాయాలు పంచుకున్నారు.
కేసులు ఎత్తివేయాలి
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి. భవిష్యత్తును ఏమాత్రం లెక్కచేయకుండా విద్యార్థులు తెలంగాణ కోసం ర్యాలీలు, నిరాహార దీక్షలు చేపట్టారు. సీమాంధ్రుల పాలనలో సరైన ఉద్యోగాలు లభించక ఇంజినీరింగ్ తదితర పట్టభద్రులు ఖాళీగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థులు, యువకుల పాత్రను గుర్తించి వారికి తక్షణం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి. అలాగే ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉచిత నిర్బంధ విద్యను పకడ్బందీగా అమలుచేయాలి.
- గోనమోని జనార్దన్, ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, రావిర్యాల
ఉద్యోగ, ఉపాధి ఆవకాశాలు కల్పించాలి
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగింది. అందుకే మలిదశ ఉద్యమంలో యువత పెద్దఎత్తున పాల్గొంది. సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్ తదితర కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేశారు. కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం యువతకు న్యాయం చేయాలి. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించాలి. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పడిన ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. యువతకు రాజకీయాల్లోనూ అవకాశం ఇవ్వాలి.
- రాఘవేందర్‌రెడ్డి, టీఎన్‌ఎస్‌ఎఫ్ మండల అధ్యక్షుడు, మన్సాన్‌పల్లి
చదువులు పణంగా పెట్టి...
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చాలామంది విద్యార్థులు చదువులను పణంగా పెట్టి పోరాడారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న సీమాంధ్ర మంత్రులను, ఇక్కడి ప్రజాప్రతినిధులను సైతం ఊళ్లల్లోకి రాకుండా అడ్డుకొని లాఠీదెబ్బలు కూడా తిన్నారు. రాజకీయపక్షాల కంటే విద్యార్థులే ఉద్యమంలో ముందుండి తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యేంతవరకూ పోరాడారు. అలాంటి వారికి ప్రభుత్వం న్యాయం చేయాలి. ఉద్యోగాలు, ఉపాధి కల్పనకు కృషి చేయాలి. ఉపాధి అవకాశాలు కల్పించే కోర్సులు ప్రవేశపెట్టి విద్యార్థులకు భరోసా కల్పించాలి.
- పల్నాటి నరేష్, టీఆర్‌ఎస్‌వీ నాయకుడు, నాగారం
సమగ్రాభివృద్ధే ధ్యేయం కావాలి
నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విద్యార్థులు, యువకులు కలసికట్టుగా ఉద్యమించారు. విద్యార్థి జేఏసీ నాయకుడిగా నా వంతుగా తెలంగాణ వెనుకబాటుతనాన్ని పాటల ద్వారా విద్యార్థులకు తెలియజేసి చైతన్యవంతులను చేశాను. అమరవీరుల త్యాగం, రాజకీయ పక్షాలు, ఉద్యోగ సంఘాలు, ప్రజాసంఘాల సమష్టి ఉద్యమం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ప్రత్యేక రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేయాలి. యువతకు ఉద్యోగ, ఉపాధి ఆవకాశాలు కల్పించాలి.
- రాజేష్ నాయక్, టీఆర్‌ఎస్‌వీ నియోజకవర్గ నాయకుడు, నాగిరెడ్డిపల్లి తండా