రేషన్‌కు వేలిముద్రలు
రాష్ట్రంలోనే తొలిసారిగా జవహర్‌నగర్‌లో అమలు
- నేటినుంచి బయోమెట్రిక్ విధానం ప్రారంభం
- ఇంటింటికీ తిరిగి వేలిముద్రల సేకరణ
- పది రోజుల్లో పూర్తికానున్న ప్రక్రియ
జవహర్‌నగర్: పౌరసరఫరాల పంపిణీలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు బయోమెట్రిక్ విధానం అమలుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలోనే మొదటిసారిగా ప్రయోగాత్మకంగా జవహర్‌నగర్‌లో దీన్ని ప్రవేశపెడుతున్నారు. 50వేల జనాభా కలిగి 16 రేషన్ దుకాణాలతో ఉన్న జవహర్‌నగర్ గ్రామాన్ని బయోమెట్రిక్ విధానం అమలు కోసం ఎంచుకున్నారు. గ్రామంలో గురువారం నుంచి 16 రేషన్ దుకాణాల పరిధిలోని 15,869 రేషన్‌కార్డుదారుల నుంచి వేలిముద్రలు తీసుకోనున్నారు. 34 బయోమెట్రిక్ మిషన్లను ఉపయోగించి 10 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తారు. కుటుంబంలోని ప్రతి సభ్యుడి వేలిముద్రలను తీసుకుంటారు.
దీని కోసం దాదాపు 60 మంది సిబ్బంది పనిచేయనున్నారు. ఈ విషయమై తహసీల్దార్ దేవుజా మాట్లాడుతూ.. రేషన్‌కార్డు లబ్ధిదారులంతా తమ కుటుంబ సభ్యులతో కలిసి తప్పకుండా బయోమెట్రిక్‌లో వేలిముద్రలు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ విధానం ద్వారా రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలను కళ్లెం వేయవచ్చని చెప్పారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా ఈ బయోమెట్రిక్ ఆన్‌లైన్ విధానాన్ని జవహర్‌నగర్‌లో అమలు చేయనున్నామని, ఇక్కడ విజయవంతమైతే జిల్లాతోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఈ విధానం అమలులోకి వస్తుందన్నారు.