గుట్కా@ బీదర్‌ టు హుజూరాబాద్‌  | Tobbaco Transoprting Illegally From Bidar To Huzurabad | Sakshi
Sakshi News home page

గుట్కా@ బీదర్‌ టు హుజూరాబాద్‌ 

Published Wed, Jul 24 2019 12:03 PM | Last Updated on Wed, Jul 24 2019 12:03 PM

Tobbaco Transoprting Illegally From Bidar To Huzurabad - Sakshi

పట్టుబడిన గుట్కాలను దహనం చేస్తున్న పోలీసులు

సాక్షి, హుజూరాబాద్‌ : గుట్కా ప్రాణాంతకమైంది.. ప్రాణాలను హరించే గుట్కా అమ్మకాలను ప్రభుత్వం నిషేధించింది. అయితే కొందరు అక్రమార్కులు ఇదే అదునుగా భావించి నిషేధిక గుట్కా దందాను హుజూరాబాద్‌ కేంద్రంగా కొనసాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నిషేధిక గుట్కాలను కొందరు అక్రమార్కులు మహారాష్ట్రలోని బీదర్‌ నుంచి కొనుగోలు చేసి హుజూరాబాద్‌కు తెచ్చి ఇక్కడి నుంచి పరిసర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ముచేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

అయితే ప్రాణాంతకమైన గుట్కా అమ్మకాలపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించడంతో పోలీసులు గుట్కా అమ్మకాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. హుజూరాబాద్‌ కేంద్రంగా సాగుతున్న గుట్కా దందాను అడ్డుకునేందుకు పోలీసులు తరచూ దాడులు నిర్వహిస్తుండగా, రూ.లక్షల్లో గుట్కాలు పట్టుబడుతున్నాయి. తాజాగా హుజూరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో గుట్టు చప్పుడు కాకుండా గుట్కా రవాణా చేస్తున్న ముగ్గురిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.2 లక్షల గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు.  

ఆగని గుట్కా అమ్మకాలు.. 
గత కొన్నేళ్లుగా గుట్కా అమ్మకాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అయినా కొందరు అక్రమార్కులు పోలీసుల కళ్లుగప్పి గుట్టుగా గుట్కా దందాను కొనసాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల దాడుల్లో తరచూ పట్టుబడుతున్నా.. అక్రమార్కులు మాత్రం గుట్కా అమ్మకాలను దర్జాగా కొనసాగిస్తున్నట్లు సమాచారం.

అయితే  గుట్కాలు తినడానికి అలవాటు పడి ఎంతో మంది యువకులు, వృద్ధులు క్యాన్సర్‌ వ్యాధి బారిన పడి విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఏడాది క్రితం కూడా గుట్కా ప్యాకెట్లను భారీ మొత్తంలో జీపులో తరలిస్తుండగా ఓ వ్యక్తి పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించగా రూ.లక్ష విలువ గల గుట్కా ప్యాకెట్లు దొరికాయి.  

నివాస గృహాల్లో నిల్వలు..  
హుజూరాబాద్‌ కేంద్రంగా గుట్కా అమ్మకాల విక్రయాలు కొనసాగుతుండగా, నివాస గృహాలనే కేంద్రాలుగా ఏర్పరుచుకొని కొందరు అక్రమార్కులు భారీగా నిల్వలను ఉంచుతున్నట్లు సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లో మరింత విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  నియోజకవర్గానికి హుజూరాబాద్‌ పట్టణం కేంద్రం కావడంతో ఆయా మండలాలకు చెందిన గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఇక్కడకు వస్తుంటారు.

అయితే ఇదే అదునుగా భావిస్తున్న గుట్కా విక్రయదారులు గ్రామాల నుంచి వచ్చే కిరాణ కొట్టు దుకాణాదారులకు అంటగడుతూ జేబులు నింపుకుంటూ సొమ్ము చేసుకొంటుకున్నారు. ఆయా గ్రామాల నుంచి వచ్చే వారు కొన్ని పాన్‌ షాపుల్లో, కిరాణ దుకాణాల్లో గుట్టుగా విక్రయిస్తున్న గుట్కాలను కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం.   

సరదాగా మొదలై.. వ్యసనంగా మారి  
ప్రాణాంతకమైన గుట్కాకు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే వ్యసనంగా మారుతున్నట్లు తెలుస్తోంది. పని ఒత్తిడిని తట్టుకునేందుకు వారు సరదాగా గుట్కా, అంబర్‌కు అలవాటు పడుతూ వ్యసనంగా మారి  వ్యాధులను కొనితెచ్చుకుంటున్నారు. అయితే నిరక్షరాస్యులతో పాటుగా, పలువురు విద్యావంతులు కూడా అంబర్, గుట్కా వ్యసనంగా మారి వ్యాధుల బారినపడుతున్నారంటే అతిశయోక్తి కాదు. వీరి అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న కొందరు అక్రమార్కులు ధనార్జనే ద్వేయంగా గుట్కా అమ్మకాలను నిర్వహిస్తూ సొమ్ముచేసుకుంటున్నట్లు సమాచారం.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement