
మహమ్మారి వెనుకడుగు
ఎయిడ్స్.. ఒక్కప్పుడు జిల్లాను వణికించిన మహమ్మారి. చాపకింద నీరులా వ్యాప్తిచెందినా..
ఎయిడ్స్.. ఒక్కప్పుడు జిల్లాను వణికించిన మహమ్మారి. చాపకింద నీరులా వ్యాప్తిచెందినా.. గత కొంతకాలంగా తగ్గుముఖం పడుతోంది. ప్రజల్లో అవగాహన పెరగడమే ఇందుకు కారణం. గతంలో గల్ఫ్‌దేశాలకు వలస వెళ్లే వారినుంచి ఎక్కువగా జిల్లాలో వ్యాప్తి చెందింది. ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు చేపట్టడం, స్వచ్ఛంద సంస్థల ప్రచారంతో ప్రస్తుతం తగ్గుముఖం పడుతోంది. పల్లెలో మరింత ప్రచారం కల్పించాల్సిన అవసరముంది.
అవగాహన పెరగడం వల్లే
ఉపాధి కోసం జిల్లావాసులు గతంలో ముంబయి మీదుగా గల్ఫ్ వెళ్లేవారు. అక్క డ వీసా కోసం 10 నుంచి 15 రోజుల పాటు వేచి చూసేవారు. అక్కడి సెక్స్‌వర్కర్లకు అలవాటుపడటం వల్ల ఎయిడ్స్ బారిన పడేవాళ్లు. అలాగే జిల్లాకు వచ్చిన తర్వాత లైంగిక సంబంధాలు కొనసాగించడం వల్ల ఎయిడ్స్ బాధితుల సంఖ్య పెరిగింది. జిల్లాలో ఎనిమిదేళ్లక్రితం 35,400 మందిని పరీక్షించగా 1,857 మందికి ఎయిడ్స్ ఉన్నట్లు తేలింది. 2014 అక్టోబర్ వరకు 68,162 మంది పరీక్షించగా 659 మందికి ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీన్ని బట్టి చూస్తే ఎయిడ్స్‌పై ప్రజల్లో అవగాహన పెరుగుతోందని తెలుస్తోంది. లైంగిక సంబంధాల్లో కండోమ్‌ల వినియోగం కూడా ఏడాదికేడాది పెరుగుతుండటానికి ఎయిడ్స్‌పై అవగాహనే కారణం.
అందుబాటులో వైద్యపరీక్షలు
ప్రస్తుతం వైద్యం కోసం వెళితే కొద్దిపాటి అనుమానం ఉన్నా తప్పనిసరిగా హెచ్‌ఐవీ టెస్టు చేస్తున్నారు. దీని వల్ల వ్యాధి ముందుగానే తెలుసుకుంటున్నారు. వ్యాధి నిర్ధారణ అయిన వారిని జాగ్రత్తలు పాటించడం, ఇతరులకు సోకకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతోంది. దీని వల్ల వ్యాధి ప్రభావం తగ్గిపోయింది. జిల్లాలో ఎయిడ్స్ నివారణ కేంద్రాలు, కౌన్సిలింగ్ సెంటర్లు కూడా కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. జిల్లాలో 8 ఐసీటీసీ(ఇంట్రిగేటెడ్ కౌన్సిలింగ్ టెస్టింగ్‌సెంటర్లు), నాలుగు పీపీటీసీటీ(ప్రివెన్షన్ పేరెంట్ చైల్డ్ ట్రాన్స్‌మిషిన్ సెంటర్లు) ఉన్నాయి. ప్రతి పీహెచ్‌సీ సెంటర్లలో కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఐసీటీసీ మొబైల్ టీం అందుబాటులో ఉంది.
ఇవే కాకుండా ఏఆర్‌టీ సెంటర్లు రెండు, లింక్ ఏఆర్‌టీలు ఆరు, బ్లడ్‌బ్యాంకులు ఆరు, నివారణ కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలో ఐదు స్వచ్ఛంద సంస్థలు ఎయిడ్స్ నివారణకు తోడ్పడుతున్నాయి. స్నేహ సొసైటీ రూరల్ రీకన్‌స్టక్షన్ , లెప్రా సొసైటీ, చైల్డ్ పౌండ్ ఇండియా, పేరలి నర్సయ్య మెమోరియల్, వర్డ్, నిజం, అభయ తదితర స్వచ్ఛంద సంస్థలు జిల్లాలో ఎయిడ్స్‌ను నిర్మూలించేందుకు కృషి చేస్తున్నాయి. ఎయిడ్స్ బాధితులకు అండగా నిలుస్తున్నాయి.
సమస్యలు పరిష్కరిస్తే
ఎయిడ్స్ ప్రధానంగా సురక్షితం కానీ లైంగిక సంబంధాలను కొనసాగించడం వల్లే వ్యాప్తిచెందుతోంది. జిల్లాలో సెక్స్‌వర్కర్ల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వీరికి ప్రభుత్వం తరపున పింఛన్లు, ఉచిత బస్సుపాస్ సౌకర్యం కల్పిం చాల్సి ఉంది. 80శాతం మందికి సా యమందడం లేదు. పేదరికం, జీవనోపాధి లేని కారణంగా చాలామం ది అదే రొంపిలో గడుపుతున్నారని స్వచ్ఛంద సంస్థలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వం సాయమందిస్తే వారు ఉపాధి మార్గాలు చూసుకుంటారని చెబుతున్నాయి.
వ్యాధి లక్షణాలు..
హెచ్‌ఐవీ బారిన పడినవారిలో నాలుగుదశల లక్షణాలు కనిపిస్తాయి. మొ దటి దశలో ఫ్లూజ్వరం, రక్తంలో వైరస్ సంఖ్య అధికంగా ఉన్న ప్రతిరక్షకాలు కనిపించవు. రెండో దశలో హెచ్‌ఐవీ ఉనికి తెలుస్తుంది. కానీ వ్యక్తిలో బాహ్యంగా కనిపించవు. మూడో దశలో వ్యాధి నిరోధక శక్తి క్రమంగా తగ్గుతుంది. నాల్గో దశలో దీర్ఘకాలిక జ్వరం, నీళ్ల విరోచనాలు, నోటి పుళ్లు, లింప్ గ్రంధులు వాచడం, శరీర బరువు పది శాతం కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
సోకుతుందిలా..
రక్షణ లేని లైంగిక సంబంధాల వల్ల ఎక్కువగా విస్తరిస్తోంది. వ్యాధిగ్రస్తులకు వాడిన సిరంజీలను మళ్లీ ఇతరులకు వాడితే ఎయిడ్స్ వస్తుంది. వారికి వాడిన బ్లేడ్‌లను వాడినా సోకే ప్రమాదాలున్నాయి. లైంగిక సంబంధాల్లో కండోమ్ వాడటం వల్ల దీన్ని అరికట్టవచ్చని వైద్య ఆరోగ్య శాఖాధికారులు అవగాహన కల్పిస్తున్నారు. హెచ్‌ఐవీ సోకిన గర్భిణులకు వారికి పుట్టబోయే పిల్లలకు వ్యాధి సోకకుండా నెవరాపిన్ ట్యాబ్‌లెట్‌ను ఇస్తారు. ఐసీటీసీ కేంద్రాల్లో హెచ్‌ఐవీ పరీక్ష ఉచితంగా చేస్తారు. హెచ్‌ఐవీ సోకినట్లయితే వారికి ఏఆర్టీకి మందులను అందజేస్తారు. వారి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
పౌష్టికాహారం కీలకం...
హెచ్‌ఐవీ బాధితులు మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి. యోగా, వ్యాయామం చేయా లి. ఆహారంలో పండ్లు, గుడ్లు, పప్పుధాన్యాలు, పాలు ఉండేలా చూడాలి. హెచ్‌ఐవీ వైరస్ శరీరంలోని రోగనిరోధక శక్తిపై దాడి చేస్తుంది. ఏఆర్టీ మందులను వాడితే రోగనిరోధక శక్తి తగ్గకుండా కాపాడుతుంది. ముఖ్యంగా మద్యం, పొగాకు, ధూమపానం అలవాట్లను మానుకోవాలి. సెక్స్‌లో పాల్గొనేటప్పుడు కండోమ్ తప్పనిసరిగా వాడాలి.