
కండోమ్‌ల కొరత.. విస్తరిస్తున్న హెచ్ఐవి
కర్ణాటకలో, ముఖ్యంగా రామనగరం, ఉడిపి, హసన్ జిల్లాలలో కండోమ్‌ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దాంతో ఆ ప్రాంతంలో హెచ్ఐవీ వ్యాప్తి ప్రమాదం ఎక్కువగా ఉంటోందని ఓ పరిశీలనలో తేలింది.
'ఎయిడ్స్‌కు చికిత్స లేదు.. నివారణ మాత్రమే' అని ప్రభుత్వం అనేక నినాదాలు వినిపిస్తూ ఉటుంది. హెచ్ఐవీ వ్యాపించకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా ఉచితంగా కండోమ్‌లు పంచిపెడుతుంది. కానీ, కర్ణాటకలో, ముఖ్యంగా రామనగరం, ఉడిపి, హసన్ జిల్లాలలో కండోమ్‌ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దాంతో ఆ ప్రాంతంలో హెచ్ఐవీ వ్యాప్తి ప్రమాదం ఎక్కువగా ఉంటోందని ఓ పరిశీలనలో తేలింది. సగటున ఒక సెక్స్ వర్కర్‌కు 12-30 నిమిషాలకు ఓ కండోమ్ అందుబాటులో ఉండాలని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమం నిర్దేశిస్తోంది.
సాధారణంగా కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలో సెక్స్ వర్కర్ల కోసం నెలకు దాదాపు 26-30 లక్షల కండోమ్‌లు సరఫరా చేస్తుంది. కానీ, డిసెంబర్ నెలకు అందుబాటులో ఉన్న స్టాకు కేవలం 6.9 లక్షలు మాత్రమే. కొరత తీవ్రంగా ఉందన్న విషయాన్ని సెక్స్ వర్కర్లకు కండోమ్‌లను సరఫరా చేసే స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. అయితే కొరత ఉందన్న విషయాన్ని సంబంధిత పథకం ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్‌జీ రాఘవేంద్ర మాత్రం అంగీకరించడం లేదు. త్వరలోనే మరిన్ని స్టాకులు వస్తాయని, సమస్య ఏమీ లేదని చెబుతున్నారు.
దేశంలోనే హెచ్ఐవీ పాజిటివ్ వ్యక్తులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఒకటి కర్ణాటక. ఇక్కడ దాదాపు 87వేల మంది సెక్స్ వర్కర్లున్నట్లు ప్రభుత్వమే లెక్కలు తేల్చింది. ఎయిడ్స్ వ్యాపించకుండా చూసేందుకు తాము నిరంతరం పోరాడుతున్నామని, అయితే.. ఇలా కండోమ్‌లకు కొరత వస్తే వాళ్ల జీవితాలపై ప్రభావం పడుతుందని, తర్వాత చికిత్సకు అయ్యే ఖర్చుల వల్ల వాళ్ల ఆర్థిక స్థితి కూడా దారుణంగా దెబ్బతింటుందని ఎన్జీవోల ప్రతినిధులు చెబుతున్నారు. గడిచిన పదేళ్లుగా చేసిన కృషి అంతా ఈ ఒక్క కారణం వల్ల బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుందని కర్ణాటక సెక్స్ వర్కర్ల సంఘం ప్రధాన కార్యదర్శి భారతి అంటున్నారు.