
జిల్లా ఏర్పాటు అనంతరం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండోసారి జిల్లాలో అడుగుపెడుతున్నారు. ఎన్నికల శంఖారావంలో భాగంగా జిల్లా కేంద్రంలోని మోతె శివారులో సోమవారం నిర్వహించతలపెట్టిన టీఆర్‌ఎస్ బహిరంగసభలో పాల్గొంటారు. సభ నిర్వహణకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన జిల్లా నాయకత్వం జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గాల నుంచి భారీగా జనసమీకరణకు నిమగ్నమైంది. ఒక్కో నియోజకవర్గం నుంచి 30 వేల మందికి తగ్గకుండా జనాన్ని తరలించేందుకు గులాబీ నేతలు తగిన రవాణా ఏర్పాట్లు చేశారు. వంద సీట్లు గెలుచుకొని.. మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేసిన కేసీఆర్ ఆ మేరకు అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈక్రమంలో జిల్లాలో జరిగే ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు జిల్లా నాయకులు. జిల్లా ప్రజలందరూ తమవైపే ఉన్నారని చాటేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా కేసీఆర్ తనయ, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత స్వయంగా దగ్గరుండి సభ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులకు జనసమీకరణపై సూచనలు చేశారు. ఇప్పటికే స్టేడియం, హెలీప్యాడ్ పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు.. భారీ భద్రత చర్యలు తీసుకుంటున్నారు.
సాక్షి, జగిత్యాల : రాష్ట్రం తెచ్చిన ఘనతతోపాటు నాలుగేళ్లలో చేసిన అభివృద్ధిని ప్రచారాస్త్రంగా మలుచుకొని టీఆర్‌ఎస్ ముందుకు సాగుతుంది. ముఖ్యంగా 2014లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఏకైక ప్రతిపక్ష స్థానం జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా గులాబీ పార్టీ వ్యూహాలు రచిస్తుంది. క్షేత్రస్థాయి నుంచే క్యాడర్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికలలో జగిత్యాల సీటు కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్న జిల్లా నేతలు కేసీఆర్ పాల్గొననున్న ఈ సభపై భారీగా ఆశలు పెంచుకున్నారు. ఇందులో భాగంగా వేలాదిగా జనం తరలివచ్చేలా పల్లెపల్లెన జనాన్ని సమీకరిస్తున్నారు. మరోపక్క జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులు రెండు నెలల నుంచే ప్రచారంలో ఉన్నారు. ఇప్పటికే తమ నియోజకవర్గమంతా రెండు దఫాలుగా చుట్టి వచ్చేశారు. తర్వాత బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. కేసీఆర్ సభ తర్వాత పరిస్థితులు తమకు మరింత అనుకూలంగా మారుతాయని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు భావిస్తున్నారు.
వాటిపై హామీ దక్కేనా ?
గల్ఫ్ వలసలకు కేరాఫ్‌గా పేరొందిన జగిత్యాలలో ప్రజలు ప్రవాస పాలసీ అమలు గురించి ఏళ్లుగా కలలు కంటున్నారు. 2014లోనూ టీఆర్‌ఎస్ తన మేనిఫెస్టోలో ప్రవాస పాలసీ అమలును ప్రస్తావించిన అది అమలుకు నోచుకోలేదు. కనీసం ఈ సభలోనైన కేసీఆర్ వలస జీవులకు సంబంధించిన పాలసీ గురించి నోరు విప్పుతారా? లేదా? అని జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. జిల్లాలో పసుపుబోర్డు ఏర్పాటు, మూడేళ్ల క్రితం మూతబడ్డ మల్లాపూర్ మండలం ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ అంశాలపై స్పష్టమైన ప్రకటన చేయాలనే డిమాండ్ ఉంది. దీంతోపాటు ప్రస్తుత ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు జగిత్యాలలో మెడికల్ కాలేజీ ఏర్పాటు వాగ్దానాలు చేస్తున్నారు. దీనిపై కేసీఆర్ మాట్లాడుతారా? లేదా? అని వైద్యవర్గాలు ఎదురుచూస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment