నేడు రాఖీ పౌర్ణమి
అన్నా.. చెల్లి.. అక్కా.. తమ్ముడు.. వినడానికైనా.. పిలవడానికైనా.. నాలుగే వరసలు.. కానీ ఇవి నాలుగు తరాలపాటు ఒకరికి ఒకరు ఉన్నాం అనే ధీమానిచ్చే బంధాలు. బతికున్నంత కాలం ఆ బతుకుకు భరోసానిచ్చే అనుబంధాలు. అడుగడుగునా సంరక్ష ణనిచ్చే నమ్మకాలు. దేవుడే దిగొచ్చి ముచ్చటపడేలా చేసే ఆశ్చర్యాల సాక్ష్యాలు. అందుకే అంటారు... అన్నా చెల్లెల్ల అనుబంధానికి.. అక్కా, తమ్ముళ్ల ఆత్మీయ బంధానికి ప్రతీక రక్షాబంధన్.. నీకు నేను రక్ష.. నాకు నువ్వు రక్ష.. కష్టసుఖాల్లో ఒకరికొకరం సంరక్ష.. అనే అభయాన్ని తోబుట్టువులకిచ్చే పండుగే రాఖీ. కులమతాలకు అతీతంగా.. ఆప్యాయతలకు అతి దగ్గరగా.. సోదర, సోదరీమణులు అపురూపంగా జరుపుకుంటారు ఈ ఉత్సవాన్ని. ఈ నేపథ్యంలో ఈ రోజంతా ఇంటింటా రాఖీ ఆనందోత్సాహాలు వెల్లివిరియనున్నాయి. రక్షానుబంధాలు పరస్పరం మనసులను తడుమనున్నాయి.
ఎక్కడున్నా సోదరుల ఇంటికి..
ఆదిలాబాద్ కల్చరల్ : పెళ్లయి అత్తారింటికి వెళ్లిన అక్కాచెల్లెళ్లు రాఖీ కట్టేందుకు పండుగ రోజున సోదరుల ఇంటికి వస్తారు. ఎంత దూరన ఉన్నా పండుగ రోజు రావడం ఆనవాయితీ. ఎవరైన రాలేని పక్షంలో కొరియర్, పోస్టు ద్వారా రాఖీలు పంపి అనుబంధాన్ని పంచుకుంటారు. ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో స్థిరపడిన వారు కొరియర్ ద్వారా రాఖీలు పంపి ఆనవాయితీని కొనసాగిస్తారు. ఈ పండుగను వేర్వేరు చోట్ల వేర్వేరు పేర్లతో పిలుస్తారు. మన రాష్ట్రంలో జంధ్యాల పూర్ణిమగా, కేరళలో వేదాధ్యయనంగా ప్రారంభించే అవని అవిక్టంగా, తమిళనాడులో పూనూల్ పర్వగా జరుపుకుంటారు.
మార్కెట్‌లో సందడే సందడి
ఆదిలాబాద్ కల్చరల్ : రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకొని సోదరులకు కట్టేందుకు అందమైన రాఖీలను మనసుకునచ్చిన పలు రకాల రాఖీలు కొనుగోలు చేసేందుకు మహిళలు, యువతులు, బాలికలు శనివారం బిజిబిజీగా గడిపారు. జిల్లాలోని రాఖీ దుకాణాలు, స్టాళ్లు జనాలతో కిటకిటలాడాయి. మహిళల అభివృద్ధికి అనుగుణంగా వైవిధ్యమైన రాఖీలు వ్యాపారులు అందుబాటులో ఉంచారు. ఫ్యాన్సీ రాఖీలు కుందల్‌తో చేసిన డిజైన్ల రాఖీల అందాన్ని ఇనుమడింపజేస్తున్నాయి. రూ.10 నుంచి మొదలుకొని రూ.500 వరకు ధరల్లో అందుబాటుల్లో లభిస్తున్నాయి. చిన్నపిల్లలను ఆకర్షించే విధంగా మిక్‌మౌస్, స్ప్రెడర్‌మన్, కార్టూన్ బొమ్మలతో కూడిన రాఖీలను అమ్ముతున్నారు. రాఖీ కట్టిన తర్వాత మిఠాయి తినపించడం ఆచారం. దీంతో మిఠాయి దుకాణాల్లో సందడి నెలకొంది.