
సమగ్ర సర్వేకు సిద్ధంగా ఉండండి
నేడే తెలంగాణవ్యాప్తంగా ‘సమగ్ర కుటుంబ సర్వే’
సాక్షి, హైదరాబాద్:‘మీరు, మీ కుటుంబ సభ్యుల వివరాలు సిద్ధంగా ఉంచుకోండి.. ఇవ్వాలనుకున్న సమాచారాన్ని ముందే దగ్గర పెట్టుకోండి.. ఇంట్లో లేనివారి, ఇతర ప్రాంతాల్లో ఉన్నవారి రుజువులు తీసి పెట్టుకోండి.. ఎన్యూమరేటర్లు అడిగే వివరాలను వెల్లడించండి.. ఏదైనా సమాచారాన్ని ఇవ్వలేమనుకుంటే.. ఆ విషయాన్ని ఎన్యూమరేటర్‌కు చెప్పండి.. ఎలాంటి తప్పులూ లేకుండా సరిచూసుకోండి.. ‘సర్వే’లో మీ వివరాలు నమోదు చేసుకోండి’
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘సమగ్ర కుటుంబ సర్వే’కు సర్వం సిద్ధమైంది. మంగళవారం ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకు ఈ సర్వే జరగనుంది. కొంత ఆలస్యమైనా నిర్ధారిత పని పూర్తయ్యే వరకు సర్వే కొనసాగుతుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో ఉన్న మొత్తం కుటుంబాల సంఖ్య 86,85,000 కాగా.. ప్రస్తుతం ఆ కుటుంబాల సంఖ్య 99,41,000గా ఉన్నట్లు అధికార గణం గుర్తించింది. ఈ కుటుంబాలు లక్ష్యంగా నిర్వహిస్తున్న సర్వేలో 3,69,729 ఎన్యూమరేటర్లు (సర్వే వివరాలు సేకరించేవారు) పాల్గొంటున్నారు. వివరాల సేకరణకుగాను 3,69,000 బుక్‌లెట్లను పంపిణీ చేశారు. ఎన్నికల సమయంలో మొత్తం ప్రభుత్వ యంత్రాంగం, టీచర్లు, ఇతర సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొనే తరహాలో... ప్రస్తుత సర్వేలో వారితో పాటు అదనంగా సింగరేణి ఉద్యోగులు, ప్రైవేట్ కాలేజీలు, స్కూళ్లలో పనిచేసే టీచర్లు, కాలేజీ విద్యార్థుల సేవలను కూడా వినియోగించుకుంటున్నారు.
సొంత ఊళ్లకు జనం..
సర్వే నేపథ్యంలో రెండురోజులుగా ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు తమ గ్రామాలకు చేరుకుంటుండగా.. సోమవారం ఆ సంఖ్య మరింత పెరిగింది. తెలంగాణలోని పది జిల్లాలకు చెం దిన ప్రజలు విద్య, ఉద్యోగ, ఉపాధి, వ్యాపార ఇతర వ్యాపకాల కోసం గణనీయ సంఖ్యలోనే హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. వారంతా సర్వే నేపథ్యంలో జిల్లాలకు ప్రయాణమయ్యారు. రైళ్లు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు, సొంత వాహనాలు ఇలా అందుబాటులో ఉన్న అన్ని రవాణా సౌకర్యాలను వినియోగించుకుని ప్రజలు సొంత ఊళ్లకు పయనమయ్యారు. తమ కు తగినన్ని బస్సులు అందుబాటులో లేవనే ఫిర్యాదులు కూడా ప్రజల నుంచి వచ్చాయి.
రాజధానిలో సవాలే!
లక్షల సంఖ్యలో జనాభాతో కిక్కిరిసి ఉన్న హైదరాబాద్ మహానగరంలో సర్వేను నిర్వహించడం ఓ సవాలు కానుంది. ఆది, సోమవారాల్లో ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటికి వచ్చి స్టిక్కర్లు అతికిస్తారని, చెక్‌లిస్ట్‌లను, నమూనాపత్రాలను అందిస్తారని అధికారులు ముందుగానే ప్రకటించారు. కానీ సోమవారం సాయంత్రానికి కూడా ఎన్యూమరేటర్లు తమ ఇళ్లకు రాలేదని చెబుతున్న వారు పెద్దసంఖ్యలోనే ఉన్నారు. సర్వే సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు సెలవు ప్రకటించడం, ఆర్టీసీ బస్సులు నడపకపోవడం, పెట్రోల్‌బంక్‌లను మూసి ఉంచడం వంటి చర్యలు, విస్తృతంగా ప్రచారం కల్పించడం ద్వారా సర్వేలో ప్రజలంతా పాల్గొని తమ వివరాల నమోదుకు సహకరిస్తారని ప్రభుత్వం అభిప్రాయ పడుతోంది.
అర్హుల గుర్తింపు కోసమే
గత ప్రభుత్వాల్లోని వివిధ శాఖలు పథకాలు/ కార్యక్రమాలకు సంబంధించి ఇంతకుముందు ఇంటింటి సర్వేలు చేసినా.. అవి అసమగ్రంగా, తప్పుల తడకగా ఉన్నందున ‘సమగ్ర కుటుంబ సర్వే’ను చేపడుతున్నట్లు సర్కారు ప్రకటించింది. నూతన రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మలుచుకునేందుకు తోడ్పడేలా మొత్తం కుటుంబాల సమగ్ర సామాజిక, ఆర్థిక వివరాలను సేకరించడానికే సర్వే చేపడుతున్నట్లు తెలిపింది. వివిధ సంక్షేమ పథకాలను సక్రమంగా అమలుచేసేందుకు అర్హులైన పేదలను ఏ ఒక్కరినీ విడిచిపెట్టకుండా సమాచారాన్ని సేకరించడమే లక్ష్యమని పేర్కొంది. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి సర్వేను చేపట్టలేదని ప్రభుత్వం చెబుతోంది. ప్రతి ఇంటికి సంబంధించిన నమ్మకమైన డాటాబేస్‌ను తయారుచేసుకోవడం, సులువుగా ధ్రువీకరణ పత్రాల మంజూరుకు వివరాలన్నింటినీ ఎమ్మార్వో కార్యాలయాల్లో అందుబాటులో ఉంచేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది.