సాక్షి ప్రతినిధి, వరంగల్: జిల్లా పరిషత్ చైర్మన్లు, మండల పరిషత్ అధ్యక్ష పదవులు ఎవరికి దక్కనున్నాయనే అంశంపై నెలకొన్న సస్పెన్స్ శుక్రవారం ఉదయానికి వీడిపోనుంది. ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లా పరిషత్ చైర్మన్లు గెలుచుకునేంత స్థాయిలో స్పష్టమైన మెజార్టీ టీఆర్‌ఎస్‌కు లభించింది. దీంతో పాటు 70కి 70 ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో ఆ పార్టీ అధిష్టానం పావులు కదుపుతోంది. ఇందులో 62 ఎంపీపీ స్థానాలకు గాను సరిపడా సంఖ్యాబలం ఉన్నప్పటికీ మిగతా ఎనిమిది స్థానాలను కూడా దక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకోసం స్వతంత్రులు, ఇతర పార్టీల నుంచి గెలిచిన వారితో మంతనాలు జరుపుతున్నారు. కాగా, ఉమ్మడి జిల్లాలోని 70 మంది జెడ్పీటీసీల్లో 62 మందిని, 781 ఎంపీటీసీ సభ్యుల్లో 541కి పైగా సభ్యులను క్యాంపులకు తరలించారు.
నేడు ఎంపీపీల ఎన్నిక
ఎంపీపీల ఎన్నిక శుక్రవారం జరగనుండగా ఉదయం 10 గంటల నుంచి ప్రక్రియ మొదలవుతుంది. అధికారికంగా సాయంత్రం 4 గంటలకు ఎంపీపీని ప్రకటించనున్నారు. ఇక శనివారం జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నేతృత్వంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమాలోచన చేసిన అనంతరం చైర్మన్లు, అధ్యక్షులపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. చైర్మన్లు, అధ్యక్షుల పేర్లను సీల్డ్ కవర్‌లో ఎన్నికలకు కొద్ది గంటల ముందు జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు ఇన్‌చార్జ్‌లకు చేరవేస్తే.. ఆ మేరకు చైర్మన్లు, అధ్యక్షులను ఎన్నుకుంటారు.
విడుదలైన నోటిఫికేషన్
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆరు జిల్లా పరిషత్ చైర్మన్లు, 70 మండల పరిషత్ అధ్యక్ష పదవుల ఎన్నికలు శుక్రవారం, శనివారం న్నికలు జరగనున్నాయి. మండల పరిషత్ అధ్యక్ష పదవి ఎన్నికకు గురువారం నోటిఫికేషన్ విడుదల కాగా, జెడ్పీ చైర్మన్ ఎన్నికలకు రేపు ప్రకటన విడుదల చేయనున్నారు. ఈ ఎన్నికలకు కొన్ని గంటల ముందే చైర్మన్లు, అధ్యక్షులెవరనే అంశంపై స్పష్టత రానుంది.
మూడు ఓకే...
ములుగు జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా కుసుమ జగదీష్ పేరును మొదటల్లోనే ప్రకటించగా, ఇటీవల కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన గండ్ర వెంకటరమణారెడ్డి భార్య గండ్ర జ్యోతికి వరంగల్ రూరల్ జెడ్పీ చైర్మన్ ఇచ్చేందుకు ఒప్పందం జరిగినట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆమె శాయంపేట జెడ్పీటీసీ బరిలోకి దిగి విజయం సాధించారు. వరంగల్ అర్బన్‌కు సంబంధించి ఎల్కతుర్తి నుంచి జెడ్పీటీసీగా గెలుపొందిన భీమదేవరపల్లికి చెందిన డాక్టర్ సుధీర్‌కుమార్ పేరు ఖాయం చేసినట్లు చెబుతున్నారు. ఈ మూడు మినహాయిస్తే మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి జయశంకర్ జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థులపై సస్పెన్స్ కొనసాగుతోంది.
ఎస్సీ మహిళకు కేటాయించిన భూపాలపల్లి జయశంకర్ జెడ్పీ చైర్మన్ పీఠం కోసం జక్కు శ్రీహర్షిణి(కాటారం జెడ్పీటీసీ) పేరు ఖరారైనట్లు గురువారం ప్రచారం మొదలైంది. జనగామ జెడ్పీ చైర్మన్ కోసం జనగామ, చిల్పూరు, లింగాల గణపురం, తరిగొప్పుల నుంచి జెడ్పీటీసీలుగా గెలిచిన నిమ్మతి దీపికారెడ్డి, పాగాల సంపత్ రెడ్డి, గుడి వంశీధర్‌రెడ్డి, ముద్దసాని పద్మజారెడ్డి జెడ్పీ చైర్మన్ కోసం పదవి పోటీపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మహబూబాబాద్ జెడ్పీ చైర్మన్ కోసం మొదటి నుంచి ఎమ్మెల్యే రెడ్యా నాయక్ కోడలు నిత్య రవిచంద్ర పేరు వినిపించినా ఆమె పోటీకే దిగలేదు. ప్రస్తుతం గూడూరు, బయ్యారం, నర్సింహులపేట నుంచి జెడ్పీటీసీలుగా గెలిచిన గుగులోతు సుచిత్ర, అంగోతు బిందు, భూక్యా సంగీత నడుమ పోటీ ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఆరుగురు జెడ్పీ చైర్మన్లతోపాటు మండల పరిషత్ అధ్యక్షులెవరనేది ఎన్నికకు కొద్దిగంటల ముందు మాత్రమే వెల్లడి కానుంది.
క్యాంపుల్లో ఇన్‌చార్జ్‌ల చర్చలు
ఆరు జెడ్పీ పీఠాలు, మొత్తానికి మొత్తం మండల పరిషత్‌లను కైవసం చేసుకోవాలనే వ్యూహంతో ఫలితాలు వెలువడిన రోజునే జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులను అధికార టీఆర్‌ఎస్ పార్టీ క్యాంపులకు తరలించింది. హైదరాబాద్‌తో పాటు చుట్టూ ఉన్న రిసార్ట్‌లతో పాటు యాదగిరిగుట్ట, పాపికొండలు తదతర ప్రాంతాల్లో ఈ క్యాంపులు కొనసాగుతున్నాయి. జెడ్పీ చైర్మన్, మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నికపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమై చర్చించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొందిన పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని బుధవారం తీసుకెళ్లిన మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు కేటీఆర్, కేసీఆర్‌ను కలిసిన అనంతరం ఈ అంశంపై కూడా చర్చించినట్లు తెలిసింది.
అంతే కాకుండా వైస్ చైర్మన్లు, కో–ఆప్షన్ సభ్యుల ఎన్నికపై కూడా మంతనాలు జరిపినట్లు సమాచారం. ఇదే సమయంలో అన్నీ జెడ్పీ చైర్మన్ల ఎంపిక ప్రక్రియను సమన్వయం చేసేందుకు ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ బండా ప్రకాష్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, పెద్ది సుదర్శన్‌రెడ్డిలు క్యాంపుల్లో ఉన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీలతో చర్చలు జరిపి ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. దీనికి తోడు ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతల అభిప్రాయాలు, అధినేత కేసీఆర్ సూచన మేరకు శుక్రవారం ఉదయమే ఎంపీపీలు, వైస్ ఎంపీపీ, కో–ఆప్షన్ సభ్యుల పేర్లు, శనివారం ఉదయం జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్, కో–ఆప్షన్ సభ్యుల పేర్లను సీల్డ్ కవర్ల ద్వారా వెల్లడించేందుకు సన్నాహాలు చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment