
కర్లపాలెం(బాపట్ల): పాపం.. ఆమె మరణించి గెలిచింది. ఎన్నికలు పూర్తయిన కొద్ది రోజులకే మృతిచెందిన ఆమె.. ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో ఎంపీటీసీగా విజయం సాధించింది. ఆమె బతికున్నట్టయితే ఎంపీపీగా ఎన్నికై ఉండేది కూడా. గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం–1 సెగ్మెంట్ నుంచి ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసిన ఝాన్సీలక్ష్మి ఎన్నికల అనంతరం అనారోగ్యంతో మరణించారు. వైఎస్సార్‌సీపీ కర్లపాలెం మండల అధ్యక్షుడు దొంతిబోయిన సీతారామిరెడ్డి సతీమణి అయిన ఆమెను కర్లపాలెం ఎంపీపీ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ప్రకటించింది కూడా.
సమీప టీడీపీ అభ్యర్థి పిట్ల వేణుగోపాల్‌రెడ్డిపై 134 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఆమె గెలిచిందని తెలియగానే.. ఆమెను తలుచుకుని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇదిలా ఉండగా ఆమె భర్త సీతారామిరెడ్డిని పార్టీ నాయకులు ఊరేగింపుగా ఇంటి వరకూ తీసుకురావడంతో కుటుంబ సభ్యులు, కార్యకర్తలు ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం ఝాన్సీలక్ష్మి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment