నేడు బీహెచ్‌ఈఎల్ బృందం రాక | Today the arrival of BHEL team | Sakshi
Sakshi News home page

నేడు బీహెచ్‌ఈఎల్ బృందం రాక

Published Thu, Sep 25 2014 2:11 AM | Last Updated on Sat, Sep 2 2017 1:54 PM

నేడు బీహెచ్‌ఈఎల్ బృందం రాక

నేడు బీహెచ్‌ఈఎల్ బృందం రాక

సాక్షి ప్రతినిధి, ఖమ్మం : జిల్లాలో విద్యుత్ తయారీ ప్రాజెక్టుల ఏర్పాటు ప్రక్రియ వేగవంతమవుతోంది. జిల్లాలో ఏర్పాటు చేయతలపెట్టిన 6వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులకు గాను మొదటి దశలో రెండువేల మెగావాట్ల ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా మణుగూరులో నిర్మించ తలపెట్టిన 1,080 మెగావాట్ల ప్రాజెక్టు నిర్మాణం కోసం జిల్లా యంత్రాంగం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఇందుకు అవసరమయిన భూమిని గుర్తించడంతో పాటు ఎంజాయ్‌మెంట్ సర్వేను కూడా ప్రారంభించింది.

 ఈ క్రమంలో బీహెచ్‌ఈఎల్ బృందం గురువారం మణుగూరుకు రానుంది. ఈ ప్రాజెక్టుకు భూసేకరణ ప్రక్రియ న వంబర్ మొదటివారం కల్లా పూర్తవుతుందని, జెన్‌కోకు భూమి అప్పగిస్తే ప్లాంటు నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయని జిల్లా రెవెన్యూ యంత్రాంగం చెపుతోంది. ఇక, కేటీపీఎస్ ఏడోదశ విస్తరణతో పాటు ఇల్లెందులో కూడా మరో విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటు ప్రతిపాదనలు కూడా వేగంగా ముందుకు కదులుతున్నాయి. అయితే, గతంలో అనుకున్న విధంగా పునుగుడుచెలక, పెనుగడపల వద్ద ప్రాజెక్టు నిర్మాణ ప్రతిపాదనలను ఉపసంహరించుకున్నట్టు తెలుస్తోంది.

 అటవీ భూమి సమస్య ఉన్నందున భూసేకరణ ఆలస్యం అవుతుందని, మణుగూరు ప్రథమ ప్రాధాన్యంగా ఎంచుకున్నారని, ఆ తర్వాత మిగిలిన ప్రాజెక్టులను ప్రాధాన్యతల వారీగా ఎంచుకుని పూర్తి చేస్తారని సమాచారం. మొత్తం మీద మెగావాట్‌కు రూ.5-6 కోట్ల వ్యయంతో జిల్లాలో నిర్మించ తలపెట్టిన 6వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులకు గాను వచ్చే నాలుగేళ్లలో దాదాపు 30-36 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో విద్యుత్ తయారీ ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి.

 హక్కు ఎలా వచ్చింది..?
 తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉండడం, జిల్లాలో భూమి, నీరు, బొగ్గు అందుబాటులో ఉండడంతో రాష్ట్రానికి అవసరమయ్యే విద్యుత్‌ను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లానే ప్రథమ ప్రాధాన్యంగా తీసుకుంది. అందులో భాగంగా మణుగూరు ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యతా ప్రాజెక్టుగా తీసుకున్నట్టు తెలుస్తోంది. భెల్ ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టు పనులు వీలైనంత త్వరగా ప్రారంభించేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో జేసీ కె.సురేంద్రమోహన్ భూసేకరణ పనిలో పడ్డారు. పూర్తిస్థాయి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మణుగూరు మండలం రామానుజవరం, పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం, సీతారాంపురం గ్రామాల్లోని భూములపై ఎంజాయ్‌మెంట్ సర్వే నిర్వహిస్తున్నారు.

ఇందులో 140 ఎకరాల ప్రైవేటు, 275 ఎకరాల అసైన్డ్, 550 ఎకరాల కబ్జా భూమి ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఈ భూమి అంతా 650 సబ్‌డివిజన్లుగా ఉందని, ఏ సబ్‌డివిజన్‌లో ఎవరున్నారు, వారికి ఆ హక్కు ఎలా వచ్చింది అనేది ప్రాథమికంగా నిర్ధారించేందుకు చేపట్టిన ఈ ఎంజాయ్‌మెంట్ సర్వే ఈ నెలాఖరునాటికి పూర్తి కానుంది. ఇక, ఆ తర్వాత ఎంతమందికి ఎన్ని ఎకరాల్లో పట్టా ఉంది? అసైన్డ్ భూమి ధ్రువపత్రాల పరిశీలన, దారిద్య్రరేఖకు దిగువన పట్టాదారులున్నారా లేక ఎగువున ఉన్నారా? అందులో గిరిజనులు, గిరిజనేతరులెంద రు? భూమి మార్కెట్ ధర ఎంత? అనే అంశాలతో అక్టోబర్ మొదటి వారంలో ఆర్డీవో నివేదిక పంపుతారు.

దీనిని రెండోవారం కల్లా భూపరిపాలన కమిషనర్ (సీసీఎల్‌ఏ)కు అందజేస్తారు. ఆ తర్వాత జెన్‌కో, ఇంధన శాఖ, ప్రభుత్వ వర్గాల సమావేశం నిర్వహించి భూసేకరణకు అవసరమైన నష్టపరిహారాన్ని అంచనా వేయనున్నారు. భూసేకరణలో భాగంగా ప్రైవేటు పట్టాదారులకు ఎంత పరిహారం చెల్లించాలి? అసైన్డ్ భూమిని ఎలా తీసుకోవాలి, ప్రభుత్వ భూమి కబ్జాలో ఉన్నవారికి ఏం ఇవ్వాలి అనే దానిపై నిర్ణయం తీసుకుని అక్టోబర్ నెలాఖరు నాటికి ప్రభుత్వం ప్రకటిస్తే, నవంబర్ మొదటి వారంలో భూమిని జెన్‌కోను అప్పగించనున్నారు. ముందుగా ప్రైవేటు భూముల నష్టపరిహారం అంశాన్ని తేలుస్తారని ప్రభుత్వ వర్గాంటున్నాయి.

 అశ్వాపురంలో 1200 ఎకరాలు
 ఇక, మణుగూరు పవర్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం పినపాక - బూర్గంపాడు మధ్య పవర్ కారిడార్ ఏర్పాటవుతుందని అధికారులంటున్నారు. అందుకే మణుగూరు ప్రాజెక్టును ప్రథమ ప్రాధాన్యంగా ఎంచుకున్నారని సమాచారం. పినపాక, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు (తెలంగాణలో ఉండే 12 గ్రామాలు) మండలాల్లోని ప్రభుత్వ భూములన్నింటినీ సర్వే చేసే పనిలో జిల్లా యంత్రాంగం పడింది. ఈ క్రమంలో అశ్వాపురం మండలంలో 1200 ఎకరాలు గుర్తించినట్టు సమాచారం.

 ఇక, ఈ భూములను గుర్తించేందుకు గాను జిల్లా యంత్రాంగం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోంది. డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (డీజీపీఎస్) ద్వారా ఈ సర్వే నిర్వహిస్తున్నారు. ఇటీవల ఒకే చోట ఉన్న 525 ఎకరాలను ఈ సిస్టమ్ ద్వారా ఒక్కరోజులోనే సర్వే చేశారు. అదే గతంలోలా గొలుసు పద్ధతిన చేస్తే 10 రోజులు పడుతుందని రెవెన్యూ వర్గాలంటున్నాయి. ఈ నేపథ్యంలో వడివడి సర్వేలు, ప్రతిపాదనలతో జిల్లాలో విద్యుత్ తయారీ ప్రాజెక్టు ఏర్పాటు పనులు యుద్ధప్రాతిపదికన చేపడుతుండడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement