Manuguru power plant
-
సమన్వయంతో పనిచేయాలి
అశ్వాపురం: అధికారులు, ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు సమన్వయంతో పనిచేసి మణుగూరు భారజల కర్మాగారం అభివృద్ధికి కృషి చేయాలని భారజల బోర్డు చైర్మన్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ డాక్టర్ యూ.కామాచి ముదలి అన్నారు. బోర్డు చైర్మన్ రెండో రోజు మణుగూరు భారజల కర్మాగారం పరిధిలో విసృతంగా పర్యటించారు. శుక్రవారం ఉదయం భారజల కర్మాగారం అడ్మినిస్ట్రేటివ్ భవనంలో అధికారులతో సమావేశమై సమీక్ష జరిపారు. అనంతరం అశ్వాపురం మండలం అమ్మగారిపల్లిలో యాష్ ప్లాంటును, గౌతమీనగర్ కాలనీలోని అణుశక్తి కేంద్రీయ విద్యాలయంలో సైన్స్‌పార్క్‌ను, స్కూల్‌ను పరిశీలించారు. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారజల ఆస్పత్రిని సందర్శించి రోగులకు వైద్యం అందుతున్న పరిశీలించారు. వైద్యులతో సమావేశమై వైద్యం అందుతున్న తీరు, సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. సాయంత్రం భారజల కర్మాగార అతిథిగృహంలో అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. భారజల కర్మాగారం ప్రతిష్టను మరింత పెంచాలన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి శాయశక్తులా కృషి చేస్తానన్నారు. అనంతరం చైర్మన్ తన పర్యటనను ముగించుకుని హైదరాబాద్ వెళ్లారు. ఈ సమావేశంలో భారజల బోర్డు అసోసియేట్ డైరెక్టర్ పీకేఎం.పార్థిబన్, భారజల కర్మాగారం సీజీఎం జితేంద్ర శ్రీవాత్సవ, సీఏఓ జయకృష్ణ, డీజీఎంలు అరుణ్‌బోస్, ప్రసాద్, ఏడీఎంఓ నవీన్‌కుమార్, ఏపీఓ శ్రీనివాస్, ఉద్యోగ సంఘం గౌరవ అధ్యక్షుడు సీతారాములు, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విఠల్‌రావు, పోతురాజు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు కూరపాటి శ్రీనివాసరావుతో అసోసియేషన్ ప్రతినిధులు, ఇతర అధికారులు, సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
మిషన్ కాకతీయకు మరో రూ.67.12కోట్లు
సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయలో భాగంగా చేపట్టిన చెరువుల పునరుద్ధరణ పనుల్లో భాగంగా ఆరు జిల్లాల పరిధిలోని చెరువుల్లో రూ.67.12కోట్లతో పనులను చేపట్టేందుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పనులతో 20,346 ఎకరాల ఆయకట్టుకు నీరందించే అవకాశం ఉందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనుమతిచ్చిన రూ.130కోట్లతో కలుపుకుంటే ఇప్పటివరకు రూ.197 కోట్ల పనులకు పరిపాలనా ఆమోదం లభించినట్లైంది. ప్రస్తుతం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు మెదక్ జిల్లాలో 64 చెరువులకు రూ.9.70కోట్లు, రంగారెడ్డిజిల్లాలో 108చెరువులకు రూ.26.44కోట్లు, కరీంనగర్ జిల్లాలో 12 చెరువులకు 4.34కోట్లు, ఆదిలాబాద్ జిల్లాలో 25 చెరువులకు రూ.5.74కోట్లు, వరంగల్‌లో 22 చెరువులకు 5.95కోట్లు, నిజామాబాద్ జిల్లాలో 34 చెరువులకు 14.95కోట్లకు పరిపాలనా అనుమతులు ఇచ్చినట్లు తన ఉత్తర్వుల్లో నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి పేర్కొన్నారు. మణుగూరు విద్యుత్ ప్లాంటుకు గోదావరి నుంచి 1.40టీఎంసీల నీరు ఖమ్మం జిల్లా మణుగూరు మండలం, రామానుజవరంలో తెలంగాణ జెన్కో ఏర్పా టు చేయనున్న విద్యుత్ ప్లాంటుకు గోదావరి నుంచి ఏడాదికి 1.40టీఎంసీ ల నీటిని వినియోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులిచ్చింది. -
పవర్ ప్లాంట్ భూనిర్వాసితులకు న్యాయం చేస్తాం
భద్రాచలం: మణుగూరు పవర్ ప్లాంట్ భూనిర్వాసితులకు నష్టం జరగకుండా ప్రభుత్వ నిబంధల ప్రకారం న్యాయం చేస్తామని కలెక్టర్ ఇలంబరితి అన్నారు. భూనిర్వాసిత రైతులతో ఆయన మంగళవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో సమావేశమయ్యూరు. నష్ట పరిహారం పెంచాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వాలని, నగదు పరిహారం కాకుండా భూమి ఇవ్వాలని కలెక్టర్‌కు భూనిర్వాసితులు విజ్ఞప్తి చేశారు. ఆ తరువాత, కలెక్టర్ మాట్లాడుతూ.. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ప్రకారంగా భూనిర్వాసితులకు ఐదులక్షల రూపాయలుగానీ, ఇంటిలో ఒకరికి ఉద్యోగంగానీ, నెలకు రెండువేల రూపాయల పెన్షన్‌గానీ చెల్లించగలమని అన్నారు. ఉద్యోగావకాశాలలో ముందుగా గిరిజనులకు ప్రాధాన్యమిస్తామన్నారు. ప్రభుత్వ అసైన్డ్ భూములకు సంబంధించిన సర్వేను త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీవో దివ్య, భద్రాచలం ఆర్డీవో అంజయ్య, డీడీ సరస్వతి, ఎస్డీసీ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్థానిక రైతులకే నష్ట పరిహారం:జేసీ పాల్వంచ రూరల్: గ్రామంలో నివాసముంటూ, భూమిని సాగు చేసుకుంటున్న రైతులకు మాత్రమే నష్ట పరిహారం ఇస్తామని జాయింట్ కలెక్టర్(జేసీ), ఆర్ అండ్ ఆర్ అడ్మినిస్ట్రేటర్ సురేంద్రమోహన్ స్పష్టం చేశారు. మణుగూర్ మండలంలోని తెలంగాణ జెన్కో పవర్ ప్లాంట్ భూనిర్వాసితుల ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ఆయన మంగళవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించారు. రామానుంజపురం, చిక్కుడుగుంట, సాంబాయిగూడెం, దమ్మక్కపేట గ్రామాలకు చెందిన 110మంది రైతుల కుటుంబాలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జారుుంట్ కలెక్టర్ మాట్లాడుతూ.. పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం భూములు కోల్పోయిన అర్హతగల అందరికీ న్యాయం జరిగేలా చూస్తామన్నారు. మధ్య దళారుల మాటలు నమ్మవద్దని కోరారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న వారికి ప్యాకేజీ వర్తించదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కె.వెంకటేశ్వర్లు, మణుగూరు తహశీల్దారు, ఐటీఐ ప్రిన్సిపాల్ సందీప్, టి-జెన్కో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సురే ష్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు బీహెచ్ఈఎల్ బృందం రాక
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : జిల్లాలో విద్యుత్ తయారీ ప్రాజెక్టుల ఏర్పాటు ప్రక్రియ వేగవంతమవుతోంది. జిల్లాలో ఏర్పాటు చేయతలపెట్టిన 6వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులకు గాను మొదటి దశలో రెండువేల మెగావాట్ల ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా మణుగూరులో నిర్మించ తలపెట్టిన 1,080 మెగావాట్ల ప్రాజెక్టు నిర్మాణం కోసం జిల్లా యంత్రాంగం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఇందుకు అవసరమయిన భూమిని గుర్తించడంతో పాటు ఎంజాయ్మెంట్ సర్వేను కూడా ప్రారంభించింది. ఈ క్రమంలో బీహెచ్ఈఎల్ బృందం గురువారం మణుగూరుకు రానుంది. ఈ ప్రాజెక్టుకు భూసేకరణ ప్రక్రియ న వంబర్ మొదటివారం కల్లా పూర్తవుతుందని, జెన్కోకు భూమి అప్పగిస్తే ప్లాంటు నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయని జిల్లా రెవెన్యూ యంత్రాంగం చెపుతోంది. ఇక, కేటీపీఎస్ ఏడోదశ విస్తరణతో పాటు ఇల్లెందులో కూడా మరో విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటు ప్రతిపాదనలు కూడా వేగంగా ముందుకు కదులుతున్నాయి. అయితే, గతంలో అనుకున్న విధంగా పునుగుడుచెలక, పెనుగడపల వద్ద ప్రాజెక్టు నిర్మాణ ప్రతిపాదనలను ఉపసంహరించుకున్నట్టు తెలుస్తోంది. అటవీ భూమి సమస్య ఉన్నందున భూసేకరణ ఆలస్యం అవుతుందని, మణుగూరు ప్రథమ ప్రాధాన్యంగా ఎంచుకున్నారని, ఆ తర్వాత మిగిలిన ప్రాజెక్టులను ప్రాధాన్యతల వారీగా ఎంచుకుని పూర్తి చేస్తారని సమాచారం. మొత్తం మీద మెగావాట్‌కు రూ.5-6 కోట్ల వ్యయంతో జిల్లాలో నిర్మించ తలపెట్టిన 6వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులకు గాను వచ్చే నాలుగేళ్లలో దాదాపు 30-36 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో విద్యుత్ తయారీ ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి. హక్కు ఎలా వచ్చింది..? తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉండడం, జిల్లాలో భూమి, నీరు, బొగ్గు అందుబాటులో ఉండడంతో రాష్ట్రానికి అవసరమయ్యే విద్యుత్‌ను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లానే ప్రథమ ప్రాధాన్యంగా తీసుకుంది. అందులో భాగంగా మణుగూరు ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యతా ప్రాజెక్టుగా తీసుకున్నట్టు తెలుస్తోంది. భెల్ ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టు పనులు వీలైనంత త్వరగా ప్రారంభించేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో జేసీ కె.సురేంద్రమోహన్ భూసేకరణ పనిలో పడ్డారు. పూర్తిస్థాయి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మణుగూరు మండలం రామానుజవరం, పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం, సీతారాంపురం గ్రామాల్లోని భూములపై ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహిస్తున్నారు. ఇందులో 140 ఎకరాల ప్రైవేటు, 275 ఎకరాల అసైన్డ్, 550 ఎకరాల కబ్జా భూమి ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఈ భూమి అంతా 650 సబ్డివిజన్లుగా ఉందని, ఏ సబ్‌డివిజన్‌లో ఎవరున్నారు, వారికి ఆ హక్కు ఎలా వచ్చింది అనేది ప్రాథమికంగా నిర్ధారించేందుకు చేపట్టిన ఈ ఎంజాయ్మెంట్ సర్వే ఈ నెలాఖరునాటికి పూర్తి కానుంది. ఇక, ఆ తర్వాత ఎంతమందికి ఎన్ని ఎకరాల్లో పట్టా ఉంది? అసైన్డ్ భూమి ధ్రువపత్రాల పరిశీలన, దారిద్య్రరేఖకు దిగువన పట్టాదారులున్నారా లేక ఎగువున ఉన్నారా? అందులో గిరిజనులు, గిరిజనేతరులెంద రు? భూమి మార్కెట్ ధర ఎంత? అనే అంశాలతో అక్టోబర్ మొదటి వారంలో ఆర్డీవో నివేదిక పంపుతారు. దీనిని రెండోవారం కల్లా భూపరిపాలన కమిషనర్ (సీసీఎల్ఏ)కు అందజేస్తారు. ఆ తర్వాత జెన్కో, ఇంధన శాఖ, ప్రభుత్వ వర్గాల సమావేశం నిర్వహించి భూసేకరణకు అవసరమైన నష్టపరిహారాన్ని అంచనా వేయనున్నారు. భూసేకరణలో భాగంగా ప్రైవేటు పట్టాదారులకు ఎంత పరిహారం చెల్లించాలి? అసైన్డ్ భూమిని ఎలా తీసుకోవాలి, ప్రభుత్వ భూమి కబ్జాలో ఉన్నవారికి ఏం ఇవ్వాలి అనే దానిపై నిర్ణయం తీసుకుని అక్టోబర్ నెలాఖరు నాటికి ప్రభుత్వం ప్రకటిస్తే, నవంబర్ మొదటి వారంలో భూమిని జెన్కోను అప్పగించనున్నారు. ముందుగా ప్రైవేటు భూముల నష్టపరిహారం అంశాన్ని తేలుస్తారని ప్రభుత్వ వర్గాంటున్నాయి. అశ్వాపురంలో 1200 ఎకరాలు ఇక, మణుగూరు పవర్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం పినపాక - బూర్గంపాడు మధ్య పవర్ కారిడార్ ఏర్పాటవుతుందని అధికారులంటున్నారు. అందుకే మణుగూరు ప్రాజెక్టును ప్రథమ ప్రాధాన్యంగా ఎంచుకున్నారని సమాచారం. పినపాక, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు (తెలంగాణలో ఉండే 12 గ్రామాలు) మండలాల్లోని ప్రభుత్వ భూములన్నింటినీ సర్వే చేసే పనిలో జిల్లా యంత్రాంగం పడింది. ఈ క్రమంలో అశ్వాపురం మండలంలో 1200 ఎకరాలు గుర్తించినట్టు సమాచారం. ఇక, ఈ భూములను గుర్తించేందుకు గాను జిల్లా యంత్రాంగం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోంది. డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (డీజీపీఎస్) ద్వారా ఈ సర్వే నిర్వహిస్తున్నారు. ఇటీవల ఒకే చోట ఉన్న 525 ఎకరాలను ఈ సిస్టమ్ ద్వారా ఒక్కరోజులోనే సర్వే చేశారు. అదే గతంలోలా గొలుసు పద్ధతిన చేస్తే 10 రోజులు పడుతుందని రెవెన్యూ వర్గాలంటున్నాయి. ఈ నేపథ్యంలో వడివడి సర్వేలు, ప్రతిపాదనలతో జిల్లాలో విద్యుత్ తయారీ ప్రాజెక్టు ఏర్పాటు పనులు యుద్ధప్రాతిపదికన చేపడుతుండడం గమనార్హం.