‘దుకాణం’ దక్కేదెవరికో..?
- నేడు వైన్‌షాపులకు లక్కీడ్రా
- 127 దుకాణాలకు 993 దరఖాస్తులు
- మూడింటికి నిల్.. భారీగా తగ్గిన టెండర్లు
నిజామాబాద్ క్రైం: అదృష్టం ఎవరిని వరిస్తుందో.. కొన్నిగంట ల్లో తేలనుంది. జిల్లాలోని మద్యం దుకాణాలకు సంబంధించిన లక్కీడ్రాను సోమవారం నిర్వహిం చనున్నారు. ఇందుకు జిల్లాకేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో అధికారులు అన్నిఏర్పాట్లు పూర్తిచేశారు. మొత్తం 127 దుకాణాలకు 993 దరఖాస్తులు వచ్చాయి. నిజామాబాద్ ఎక్సైజ్ డివిజన్ పరిధిలో గల 93దుకాణాల్లో మూడు దుకాణాలు మినహ 90దుకాణాలకు 721దరఖాస్తులు వచ్చాయి. కోటగిరి, ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి, వార్డు నం.10 దుకాణాలకు టెండర్లు రాలేదు. కామారెడ్డి ఎక్సైజ్ డివిజన్ పరిధిలోని 37దుకాణాలకు గానూ అన్నింటికీ దరఖాస్తులు వచ్చాయి. నిజామాబాద్ నగర శివారు బోర్గాం(పి) మద్యం దుకాణం కోసం 28 దరఖాస్తులు, డిచ్‌పల్లి మండలం ఇందల్వాయి వైన్‌షాపునకు 34దరఖాస్తులు రావడం గమనార్హం. ఈసారి కూడా మహిళలు టెండర్లలో పాల్గొన్నారు.
చివర్లో పెరిగిన దరఖాస్తులు
మద్యం షాపులకు అధికారులు టెండర్లు ఆహ్వానించిన తర్వాత మొదటి మూడురోజులు అంతంత మాత్రంగానే వచ్చాయి. చివరి రెండురోజులు మాత్రం వ్యాపారులతో ఎక్సైజ్ ఈఎస్ కార్యాలయం కిటకిటలాడింది. చివరిరోజైన శనివారం సాయంత్రం ఐదుగంటల లోపు కార్యాలయంలోకి వచ్చి, టెండర్‌ఫారం చూపినవారికి అధికారులు టోకన్లు ఇచ్చారు. అనంతరం వచ్చిన వారిని అనుమతించలేదు. దరఖాస్తులు స్వీకరించిన అధికారులు అవి సక్రమంగా ఉన్నాయా.. లేదా పరిశీలించాకే టెండర్‌బాక్స్‌లో వేయనిచ్చారు. ఈ ప్రక్రియ శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కొనసాగింది.
భారీగా తగ్గుదల
జిల్లాలో 2014-15 సంవత్సరానికి 127 దుకాణాలకు 993 దరఖాస్తులు వచ్చాయి. 2012లో జరిగిన టెండర్లతో పోల్చితే ఈసారి భారీగా తగ్గాయి. అప్పుడు 142 మద్యం దుకాణాలకు టెండర్లు పిలువగాా, 17షాపులు మినహా.. 125దుకాణాలకు 1,538 దరఖాస్తులు వచ్చాయి. గత టెండర్లతో పోల్చితే ఈసారి 545 దరఖాస్తులు తక్కువగా వచ్చాయి. 2012లో 17దుకాణాలకు టెండర్లు రాకపోగా.. ఈఏడాది మూడింటికి టెండర్లు రాలేదు. ఈ దుకాణాలు లాభసాటిగా లేవన్న కారణంగానే టెండర్లు వేసేందుకు ఎవరు ఆసక్తి చూపలేదు. గతంలో ఇవే దుకాణాలకు దాదాపు 8సార్లు టెండర్లు పిలిచినా స్పందన రాలేదు.
రెండున్నర కోట్ల ఆదాయం
ఈ ఏడాది కేవలం దరఖాస్తుల రూపంలోనే ఎక్సైజ్‌శాఖకు దాదాపు రూ.రెండున్నర కోట్ల ఆదాయం సమకూరింది. మొత్తం 993 దరఖాస్తులకు ఒక్కో దరఖాస్తు రూ.25వేల చొప్పున అంటే రూ.2కోట్ల 48లక్షల 25వేల ఆదాయం వచ్చింది.
డ్రా కోసం ఏర్పాట్లు పూర్తి
జిల్లాకేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో ఉదయం 11గంటలకు లాటరీ పద్ధతిన మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఎక్సైజ్ సూపరింటెండెంట్ గంగారాం తెలిపారు. జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో టెండర్లకు డ్రా తీయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తిచేశారు. గతంలో మద్యపాన నిషేధాన్ని ప్రభుత్వం అమలు చేయకుండా, లక్కీడ్రా ద్వారా దుకాణాలను కేటాయించటాన్ని నిరసిస్తూ పలు పార్టీలు ఆందోళనలు చేపట్టాయి. టెండర్లను అడ్డుకునేందుకు టీడీపీ, బీజేపీ, సీపీఐ, న్యూడెమోక్రసీ పార్టీల వారు ప్రయత్నాలు చేశాయి. టెండర్లు రద్దు చేయాలంటూ వేదిక వైపు దూసుకువచ్చారు. ఈసారి అలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు.