నేడు చేవెళ్లలో..వైఎస్సార్‌సీపీ సమావేశం | today ysrcp meeting in chevella | Sakshi
Sakshi News home page

నేడు చేవెళ్లలో..వైఎస్సార్‌సీపీ సమావేశం

Published Sun, Nov 9 2014 12:30 AM | Last Updated on Tue, May 29 2018 2:28 PM

today ysrcp meeting in chevella

 చేవెళ్ల: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయలేక టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతూ కాలయాపన చేస్తోందని వైఎస్సార్ సీపీ కేంద్ర కమిటీ సభ్యులు కొండా రాఘవరెడ్డి అన్నారు. చేవెళ్లలో ఆదివారం జరుగనున్న వైఎస్సార్ సీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం ఏర్పాట్లను ఆయన శనివారం పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు.. అడిగిన ప్రతి ఒక్కరికీ పింఛన్లు పంపిణీ చేశారని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రం అర్హుల పేరిట గ్రామానికి 100 నుంచి 200 పింఛన్లు తొలగించిందని ఆరోపించారు. సర్వేల పేరుతో కాలయాపన చేయడమే తప్ప ఆచరణలో ప్రజలకు ఈ ఆరునెలల కాలంలో ప్రభుత్వం చేసిందేమీ లేదని పేర్కొన్నారు.

తెల్లరేషన్‌కార్డులను ఏరివేసే పనిలో కూడా అధికార యంత్రాంగం నిమగ్నమైందని, సుమారుగా 30శాతం వరకు ఆ కార్డులను ప్రభుత్వం తొలగిస్తోందని ప్రజలే చెబుతున్నారని స్పష్టంచేశారు. ప్రజాసమస్యలపై పోరాటం కోసమే తెలంగాణలోని ప్రతి జిల్లాలో వైఎస్సార్ సీపీ సమావేశాలు నిర్వహిస్తున్నదని వివరించారు.

తెలంగాణలో మొదట చేవెళ్లలో వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ విస్తృత సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. చేవెళ్ల సభకు పార్టీ శ్రేణులు, వైఎస్సార్ అభిమానులు పెద్దఎత్తున తరలిరావాలని కొండా రాఘవరెడ్డి కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు మహిపాల్‌రెడ్డి, అమృతాసాగర్, పి.నాగిరెడ్డి, ఎం.రాజయ్య, పుష్పలత, ఎండీ ఖాజాపాష, జగన్, కంజర్ల శివయ్య, మోహన్‌కుమార్, శ్రీకాంత్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

 ఏర్పాట్ల పరిశీలన...
 చేవెళ్లలో ఆదివారం నిర్వహిస్తున్న జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర కమిటీ నాయకులు కొండా రాఘవరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు మహిపాల్‌రెడ్డి, నాగిరెడ్డి, అమృతాసాగర్, ఎం.రాజయ్య తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు. హైదరాబాద్ నగరం నుంచి మొయినాబాద్ మీదుగా చేవెళ్లవరకు దారిపొడవునా భారీ ఫ్లెక్సీలు, కటౌట్లు, బ్యానర్లు, పోస్టర్లను ఏర్పాటుచేస్తున్నారు.

తెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ఉదయం 9 గంటలకు నాంపల్లి దర్గాలో ప్రార్థనలు చేసి బయలుదేరుతారు.
 మార్గమధ్యంలో బండ్లగూడ వద ్దగల ఆర్మీమైసమ్మ దేవాలయం, చిలుకూరు బాలాజీ దేవాలయంలో పూజలు, మొయినాబాద్ చర్చిలో ప్రార్థనలు చేసి చేవెళ్లకు చేరుకొని సమావేశంలో పాల్గొంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement