సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా పరిధిలో పదేళ్ల కిందట మూతపడిన కల్లు దుకాణాలను పునరుద్ధరిస్తూ టీ సర్కార్ గురువారం జీవో జారీ చేసింది. ‘చెట్లకు 50 కి.మీ. పరిధిలోనే కల్లు దుకాణం’ అనే నిబంధనను రద్దు చేసింది. గతంలో ఉన్న 103 కల్లు దుకాణాలు తెరవడానికి అనుమతిస్తూ జీవో నంబర్ 24ను వెలువరించింది. ఈ మేరకు ‘ఏపీ కల్లు అమ్మకపు లెసైన్స్ విధానం-2007’ను అనుసరించి స్వల్ప మార్పులతో తెలంగాణకు కొత్త విధానాన్ని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి టి. పద్మారావు గౌడ్ విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఈ జీవో ప్రకారం ఉమ్మడిరాష్ట్రంలో ఉన్న కల్లు అమ్మకం, కల్లు లెసైన్స్ విధానం తెలంగాణ రాష్ట్రంలో యథాతథంగానే అమలవుతుంది. అయితే ‘చెట్లకు 50 కిలోమీటర్ల పరిధి’ నిబంధన తొలగించినట్టు, దసరా నుంచి కల్లు అమ్మకాలు సాగించనున్నట్టు మంత్రి తెలిపారు.
హామీ నెరవేర్చిన కేసీఆర్
నగరంలో కల్లు అమ్మకాలపై ఆధారపడిన 50 వేల కుటుంబాలకు న్యాయం చేసేందుకే కల్లు దుకాణాలను తెరిపించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని పద్మారావు చెప్పారు. గత ఏడాది టీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం నాడు కల్లు గీత కుటుంబాల అభ్యర్థన మేరకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని సీఎం నెరవేర్చారన్నారు. కల్లుగీత వృత్తిపై ఆధారపడిన వారితోనే దుకాణాలు నడిపిస్తామని, 2004లో మూతపడిన సొసైటీలే కొనసాగుతాయన్నారు. నగరంలో తాటి, ఈత చెట్లు లేకపోయినా ఇతర జిల్లాల నుంచి రేషన్ పద్ధతిలో కల్లు దిగుమతి చేసుకొని అమ్మకాలు సాగించనున్నట్టు మంత్రి వివరిం చారు. హరితవనం పథకంలో జిల్లాల్లో తాటి, ఈత చెట్ల పెంపకాన్ని పరిశీలిస్తామన్నారు. నగర సొసైటీలకు శివారు జిల్లాల్లో 5 ఎకరాల స్థలం కేటాయించి చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. సీఎంతో మాట్లాడి 200 ఎకరాల్లో తాటి, ఈత వనాలు పెంచుతామన్నారు. కల్లు దుకాణాల వల్ల శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నం కావని, రంగారెడ్డి జిల్లా పరిధిలోని గ్రేటర్‌లో ఇప్పటికీ కల్లు దుకాణాలు కొనసాగుతున్నాయన్నారు. స్వచ్ఛమైన కల్లు విక్రయాలు సాగేలా ఎక్సైజ్ యంత్రాంగం చర్యలు తీసుకుంటుందన్నారు. ఎక్సైజ్ నిబంధనలన్నీ కల్లు దుకాణాలకు వర్తిస్తాయని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బి.ఆర్. మీనా వివరించారు.
హర్షణీయం: ‘గీత’ సంఘం
ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర గీత పనివారల సంఘం హర్షించింది. తాటి,ఈతవనాల పెంపకానికి పదెకరాల భూమి కల్లుగీత సహకార సంఘాలకు కేటాయించాలని విడుదల చేసిన జీవో 560ను అమలు చేయాలని సంఘం అధ్యక్షుడు బొమ్మగాని ప్రభాకర్ డిమాండ్ చేశారు. గీత కార్మికులకు పెన్షన్, ఎక్స్‌గ్రేషియా పెంచాలని కోరారు.
దసరా నుంచి జంటనగరాల్లో కల్లు!
Published Fri, Sep 5 2014 1:10 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement