కిలో టమాటా ధర రూ.100కు పైగా..
- హైదరాబాద్ సహా రాష్ట్రమంతా చుక్కల్లోకి రేటు
- వర్షాలతో పంట నష్టం, దిగుబడులు తగ్గడమే కారణం
- ప్రధానంగా సరఫరా ఏపీలోని మదనపల్లి నుంచే..
- మరికొంత ఇతర రాష్ట్రాల నుంచి సరఫరా
- భారీ వర్షాలతో కర్ణాటకలో దెబ్బతిన్న పంట
- అటు ఆంధ్రప్రదేశ్‌లో తగ్గిన దిగుబడులు
- సరఫరా తగ్గడంతో పెరిగిపోయిన ధర
- ఇతర కూరగాయల ధరలకూ రెక్కలు
- మరో రెండు వారాలు ఇదే పరిస్థితి: అధికారులు
సాక్షి, హైదరాబాద్
రాష్ట్రంలో టమాటా ధర కూడా మంటెక్కిస్తోంది.. ఒక్క కిలో టమాటా కొందామన్నా గుండె గుభేలుమంటోంది.. రోజు రోజుకూ ధర పెరుగుతూ ఏకంగా సెంచరీ కొట్టేసింది.. ఆదివారం రాష్ట్రంలో టమాటా ధర రికార్డు స్థాయిలో ఏకంగా రూ.100కు పైగా పలికింది. రాష్ట్రంలో టమాటా సాగు తక్కువగా ఉండటం, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గడం, భారీ వర్షాల కారణంగా పంట దెబ్బతినడం వల్ల టమాటా ధర పెరుగుతోంది. మరో రెండు వారాల వరకు కూడా ఇదే పరిస్థితి ఉండవచ్చని మార్కెటింగ్ శాఖ వర్గాలు తెలిపాయి.
హోల్‌సేల్‌గానే రూ.72
తెలంగాణలో వినియోగించే మొత్తం టమాటాలో రాష్ట్రంలో పండేది కేవలం 3 శాతం వరకే ఉంటుంది. దాదాపు 85 శాతం టమాటా ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచే సరఫరా అవుతుంది. ఆ తర్వాత కర్ణాటకలోని కోలారు, చింతమణి ప్రాంతాల నుంచి మరికొంత వస్తుంది. అయితే ఆయా ప్రాంతాల్లో దిగుబడి పడిపోవడం, భారీ వర్షాల కారణంగా టమాటా పంట దెబ్బతినడంతో రాష్ట్రానికి సరఫరా తగ్గిపోయింది. దీంతో టమాటా ధరలు అమాంతం ఎగబాకాయి. ఇక మహారాష్ట్ర, తమిళనాడుల్లో భారీ వర్షాల కారణంగా టమాటా పంట దెబ్బతిన్నది. దాంతో ఆయా రాష్ట్రాల వ్యాపారులు మదనపల్లి నుంచి టమాటాను దిగుమతి చేసుకుంటుండటంతో.. డిమాండ్ పెరిగి, తెలంగాణకు టమాటా సరఫరా తగ్గిపోయింది. అంతేకాదు మదనపల్లి పరిసర ప్రాంతాల్లోనూ టమాటా దిగుబడులు పడిపోయాయి. దీంతో మదనపల్లి హోల్‌సేల్ మార్కెట్లోనే ధరలు రెండు మూడు రోజుల్లో రెట్టింపయ్యాయి. ఈ నెల 6వ తేదీన మొదటి గ్రేడ్ టమాటా కిలో రూ.41 పలకగా.. ఏడో తేదీన రూ.60కి.. 8వ తేదీన రూ.72కు చేరింది. దీంతో స్థానికంగానే రిటైల్ వ్యాపారులు కిలో టమాటా రూ.80 నుంచి రూ.90 వరకు అమ్ముతుండటం గమనార్హం.
మరింత పంట చేతికొచ్చాక..
ఏపీలోని అనంతపురం జిల్లాలో ప్రస్తుతం టమాటా సాగులో ఉంది. 2 వారాల తర్వాతి నుంచి దిగుబడి ప్రారంభం కానుంది. దీంతో రెండు వారాల తర్వాతే టమాటా ధరలు తిరిగి తగ్గుముఖం పడతాయని అధికారులు చెబుతున్నారు. ఆదివారం బోయినపల్లి, గుడిమల్కాపూర్, ఎల్బీనగర్ మార్కెట్లకు 2,270 క్వింటాళ్ల టమాటా వచ్చింది. సాధారణ రోజుల కంటే ఇది పావువంతే కావడం గమనార్హం.
రాష్ట్రంలో సాగు తక్కువ
రాష్ట్రంలో టమాటా సాగు విస్తీర్ణం చాలా తక్కువ. తెలంగాణలో లక్ష ఎకరాల్లో టమాటా సాగు అవుతుందని ఉద్యానశాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి చెప్పారు. వికారాబాద్, గజ్వేల్, చేవెళ్ల, మహబూబ్‌నగర్, నల్లగొండ తదితర ప్రాంతాల్లో ఎక్కువగా టమాటా సాగవుతుందని తెలిపారు.
సీజన్‌లో ధర రాదు..
రాష్ట్రంలో రైతులు సీజన్‌లోనే టమాటా సాగు చేస్తున్నారు. దీంతో అన్ని ప్రాంతాల నుంచి టమాటా సరఫరా పెరిగి ధర పలకని పరిస్థితి నెలకొంటోంది. కొన్ని సమయాల్లో కిలోకు ఒకటి రెండు రూపాయల ధర కూడా రాక.. రైతులు టమాటాను రోడ్లపై పారబోయడం, పంటను చేలల్లోనే వదిలేయడం జరుగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి–ఏప్రిల్ నెలల మధ్య అనేక మంది రైతులు టమాటా పంటను తెంపకుండానే చేలలో వదిలేశారు కూడా.
దళారుల కారణంగా హెచ్చుతగ్గులు
మార్కెట్లో దళారీ వ్యవస్థ వల్లే సీజన్‌లో టమాటా ధర బాగా తగ్గిపోవడం.. అన్‌సీజన్‌లో ధర బాగా పెరిగిపోవడం జరుగుతోందని మార్కెటింగ్ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏప్రిల్, మే, జూన్, జూలై నెలలు టమాటా పంట వేసేందుకు సీజన్ కాదని... దాంతో ఏటా జూన్, జూలై నెలల్లో టమాటా ధరలు పెరుగుతున్నాయని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్‌సీజన్‌లో టమాటా పండించేలా రైతులను సిద్ధం చేయడంలో వ్యవసాయ, ఉద్యానశాఖలు విఫలమవుతున్నాయని.. దానితో ధరలు పెరిగిపోతున్నాయని స్పష్టం చేస్తున్నాయి. దీనిపై రెండేళ్ల కింద ప్రణాళిక రచించినా.. అది అమల్లోకి రాలేదని మార్కెట్ శాఖ అధికారి ఒకరు తెలిపారు. దళారుల దోపిడీ కారణంగానే రైతులు టమాటా వేయడానికి ఆసక్తి చూపడం లేదని పేర్కొన్నారు.