
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టమాటా ధర పైకి ఎగబాకుతోంది. ఇప్పుడే కొత్త సాగు మొదలవ్వడం, పొరుగు రాష్ట్రాల నుంచి డిమాండ్‌కు తగినట్లు సరఫరా లేకపోవడంతో ధర పెరిగిపోతోంది. వారం క్రితం వరకు కిలో టమాటా ధర రూ.30 వరకు ఉండగా, అది ప్రస్తుతం రూ.50కి చేరింది. కొత్త పంట చేతికి రావడానికి మరో రెండు నెలలు పడుతుందని అప్పటివరకు ధర పెంపు తప్పదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మెదక్, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాలో మాత్రమే టమాటా సాగవుతోంది. ఈ జిల్లాల నుంచి హైదరాబాద్ మార్కెట్లకు రోజుకు 600–800 క్వింటాళ్ల మేర టమాటా వస్తుంది. అయితే ఒక్క హైదరాబాద్ దినసరి టమాటా వినియోగం సగటున 5వేల క్వింటాళ్ల నుంచి 6వేల క్వింటాళ్లు ఉంటుంది. దీంతో డిమాండ్‌ను తీర్చేందుకు స్థానిక వ్యాపారులు ఎక్కువగా ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లి, కర్ణాటకలోని కొలార్, చిక్‌మంగళూర్‌లపై ఆధారపడి అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటారు.
లాక్‌డౌన్ విధించిన అనంతరం హోటళ్లు, హాస్టళ్లు, రెస్టారెంట్లు మూసివేయడంతో టమాటాకు గిరాకీ తగ్గి ధరలూ తగ్గాయి. లాక్‌డౌన్ రోజుల్లో కిలో ధర కేవలం రూ.5–10 ఉండగా, లాక్‌డౌన్ ఎత్తివేత తర్వాత క్రమంగా పెరుగుతూ వస్తోంది. వారం కిందటి వరకు కిలో ధర రూ.30 పలుకగా, అది ఇప్పుడు రూ.50కి చేరింది. లాక్‌డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ఫిబ్రవరి, మార్చి నెలలో వేసిన పంటకు డిమాండ్ లేక ధర పూర్తిగా పడిపోయింది. దీంతో ఏప్రిల్, మే నెలలో మన రాష్ట్రంతో పాటు, చిత్తూరు జిల్లాలోనూ పంట సాగు పూర్తిగా తగ్గింది.
వేసిన కాస్త పంట ఎక్కడికక్కడ స్థానిక అవసరాలకే సరిపోతుండటంతో అక్కడి నుంచి సరఫరా పడిపోయింది. సరఫరా తగ్గడానికి తోడు ప్రస్తుతం మదనపల్లి మార్కెట్‌లోనే కిలో టమాటా ధర రూ.30–35 మధ్య ఉంది. ఆ ధరలకు కొనుగోలు చేసి, ఇక్కడ విక్రయించే సరికి ఆ ధర రూ.40–42 మధ్య ఉంటోంది. శనివారం రైతుబజార్‌లలోనూ కిలో టమాటా రూ.40 వరకు విక్రయించగా, బహిరంగ మార్కెట్‌లలో రూ.50 వరకు పలికింది.
Comments
Please login to add a commentAdd a comment