సాక్షిప్రతినిధి, వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ పంపిణీ కార్యక్రమం ఆగస్టు 15న జిల్లా వ్యాప్తంగా ప్రారంభించనున్నారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాలు ఉన్న 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పంపిణీ చేయనున్న భూములను గుర్తించారు.
లబ్ధిదారులకు ప్రాథమిక స్థాయిలో హక్కు పత్రాలు ఇచ్చి.. తర్వాత పూర్తి స్థాయి రికార్డు డాక్యుమెంట్‌లు ఇవ్వాలా... లేక అదే రోజు పూర్తి స్థాయిలో పత్రాలు ఇవ్వాలా అనే విషయంలో సందిగ్ధం నెలకొంది. రెవెన్యూ పరంగా ఇతర సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేలా వీటి విషయంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఆగస్టు 15న భూముల పంపిణీకి సంబంధించి జిల్లాలో 64 మంది లబ్ధిదారులను గుర్తించినట్లు తెలిసింది. వీరిలో ఐదుగురు మహిళలకు హైదరాబాద్‌లోని గోల్కొండలో జరగనున్న స్వాతంత్య్ర వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చేతుల మీదుగా భూముల పత్రాలు ఇవ్వనున్నారు.
మరో ఐదుగురు మహిళలకు జిల్లా కేంద్రంలో జరగనున్న స్వాతంత్య్ర వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య, జిల్లా కలెక్టర్ అందజేయనున్నారు. మిగిలిన వారికి ఆయా నియోజకవర్గాల్లో జరగనున్న కార్యక్రమాల్లో భూముల పంపిణీ పత్రాలు ఇవ్వనున్నారు. పూర్తిగా భూమి లేని దళిత కుటుంబాలకు మూడు ఎకరాలు, ఎకరం ఉంటే రెండు ఎకరాలు, రెండు ఎకరాలు ఉంటే ఒక ఎకరం చొప్పున ప్రభుత్వం భూములు పంపిణీ చేయనుంది. నర్సంపేట నియోజకవర్గంలో 27 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది.
స్టేషన్‌ఘన్‌పూర్, భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్‌లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆగస్టు 15న పంపిణీ చేయనున్న భూముల కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం మన జిల్లాకు రూ.5 కోట్లను విడుదల చేసింది. భూముల కొనుగోలు కోసం రూ.2 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ఖర్చు చేసే యోచనలో ప్రభుత్వ యంత్రాంగం ఉంది. పూర్తిగా సాగుకు యోగ్యంగా ఉండే భూములనే కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ జి.కిషన్ రెవెన్యూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పంపిణీ చేసేందుకు కొనుగోలు చేసే భూముల విషయంలో పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. భూగర్భ జలాల పరిస్థితి, వ్యవసాయ పంటలకు అనువుగా ఉన్నా యా, భూముల రకాలు వంటి అంశాలతోపాటు రెవెన్యూ పరంగా ఉండే సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. అధికార వర్గాల సమచారం ప్రకారం జిల్లాలో భూములు పంపిణీ చేయనున్న పది నియోజకవర్గాల్లోని గ్రామాలు ఇవీ...
స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో ధర్మసాగర్ మండలం పీసర గ్రామంలో భూ పంపిణీ పత్రాలను పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
భూపాలపల్లి నియోజకవర్గంలో మొగుళ్లపల్లి మండలం పిడిసిల్లలో భూములు పంపిణీ చేయనున్నారు. పంపిణీకి అవసరమైన భూములను ఇక్కడ సేకరించే పక్రియ చివరి దశలో ఉంది.
జనగామ నియోజకవర్గంలో నర్మెట మండలం అమ్మాపూర్‌లో దళిత మహిళలకు భూములు పంపిణీ చేయనున్నారు. ఇక్కడ అవసరమైన భూములను కొనుగోలు చేస్తున్నారు.
మహబూబాబాద్ నియోజకవర్గంలో గూడూరు మండలం పొనుగోడులో భూములు పంపిణీ చేయనున్నారు. ఇక్కడ ఉన్న భూములను గుర్తించి పంపిణీ అవసరమైన ఏర్పాట్లు పూర్తవుతున్నాయి.
నర్సంపేట నియోజకవర్గంలో నర్సంపేట మండలం బాంజిపేటలో భూములు పంపిణీ చేయనున్నారు. ఇక్కడ ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించారు.
డోర్నకల్ నియోజకవర్గంలో మరిపెడ మండలం బీచరాజుపల్లిలో భూములను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
పరకాల నియోజకవర్గంలో సంగెం మండలం రా మచంద్రాపురంలో దళిత మహిళలకు భూములు పంపిణీ చేయనున్నారు. ఇక్కడే పంపిణీకి అనువుగా ఉన్న భూములను గుర్తించి సేకరిస్తున్నారు.
పాలకుర్తి నియోజకవర్గంలో కొడకండ్ల మండలం నర్సింగాపురంలో దళిత మహిళలకు భూములు పంపిణీ చేయనున్నారు.
వర్ధన్నపేట నియోజకవర్గంలో పర్వతగిరి మండలం వడ్లకొండలో భూముల పంపిణీ కార్యక్రమం జరగనుంది. దీని కోసం రెవెన్యూ అధికారులు భూములు కొనుగోలు చేస్తున్నారు.
ములుగు నియోజకవర్గం ములుగు మండలం కాసిందేవిపేటలో భూములు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడి భూముల విషయంలో ఇబ్బందులు లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు.
రేపు భూపంపిణీ
Published Thu, Aug 14 2014 4:17 AM | Last Updated on Sat, Sep 2 2017 11:50 AM
Advertisement
Advertisement