రేపే మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక | Tomorrow the election of the chairman of the municipal | Sakshi
Sakshi News home page

రేపే మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక

Published Wed, Jul 2 2014 5:05 AM | Last Updated on Tue, Jun 4 2019 6:31 PM

Tomorrow the election of the chairman of the municipal

 సాక్షి, ఖమ్మం  : మున్సిపల్ చైర్మన్ పీఠాల కోసం ఎవరికివారు పావులు కదుపుతున్నారు. ఎన్నిక సమయం దగ్గర పడుతుండడంతో ఆ పదవి దక్కించుకోవడమే ధ్యేయంగా తెరచాటు రాజకీయాలు ఊపందుకుంటున్నాయి. ఇల్లెందు, కొత్తగూడెం, మధిరలో చైర్మన్ పీఠం ఆశిస్తున్న వారు ఇప్పటికే రూ.లక్షలు ఖర్చు చేసి కౌన్సిలర్లను క్యాంపులకు తరలించారు. ఇక సత్తుపల్లిలో టీడీపీకి మెజారిటీ ఉన్నా.. సొంత పార్టీ కౌన్సిలర్లే పీఠం కోసం నువ్వానేనా అన్నట్లుగా పోటీపడుతున్నారు.

 మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల పదవులకు గురువారం ఎన్నిక జరగనుంది. జిల్లాలో కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీలు, మధిర, సత్తుపల్లి నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. సత్తుపల్లి మినహా మిగతా మూడు చోట్ల చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి ఏ పార్టీ, కూటమికి పూర్తి మెజారిటీ రాలేదు. దీంతో స్థానిక ప్రజాప్రతినిధుల జోక్యంతో చైర్మన్ పీఠం ఆశిస్తున్న వారు తెరచాటు రాజకీయాలు నడుపుతున్నారు. చైర్మన్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన మరుసటి రోజునే తమ అనుంగు కౌన్సిలర్లను క్యాంపులకు తరలించారు.

రూ.లక్షలు ఖర్చు చేసేందుకు,  అవసరైమైతే నజరానాలు ఇచ్చేందుకు కూడా వారు వెనకాడడం లేదు. క్యాంపులకు తీసుకెళ్లిన వారిని ఎన్నిక జరిగే రోజు తెల్లవారుజామున తిరిగి తమ ప్రాంతానికి తరలించేందుకు పక్కా ప్రణాళిక రూపొందించారు. తమ క్యాంపు నుంచి పోతే.. తిరిగి ఎటు వెళ్తారోనన్న భయంతో తమ అనుచరులను కౌన్సిలర్ల వెంటే ఉంచుతున్నారు. ఇక స్థానిక ప్రజాప్రతినిధులు తమ అనుంగు కౌన్సిలర్లకు చైర్మన్ పీఠం దక్కేలా చక్రం తిప్పుతున్నారు. రిజర్వేషన్ ప్రకారం గతంలో ఎన్నడూ లేని విధంగా నాలుగు చైర్మన్ స్థానాలనూ మహిళలే దక్కించుకోనున్నారు. కొత్తగూడెం, ఇల్లెందు, సత్తుపల్లి చైర్మన్ పదవులు బీసీ మహిళలకు, మధిర ఎస్సీ మహిళకు రిజర్వు అయింది.

 ‘గూడెం’ పీఠం ఎవరిదో..?
 కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో 33 వార్డులు ఉన్నాయి. సీపీఐ- టీఆర్‌ఎస్, సీపీఎం - వైఎస్సార్‌సీపీ కూటములుగా, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగాయి. కాంగ్రెస్ 12, సీపీఐ 8, టీడీపీ 4, స్వతంత్రులు 6, టీఆర్‌ఎస్ 1, వైఎస్సార్‌సీపీ 1, టీఆర్‌ఎల్డీ 1 వార్డు దక్కించుకున్నాయి. చైర్మన్ పీఠం దక్కించుకోవడానికి ఏ పార్టీ, కూటమికి స్పష్టమైన మెజారిటీ రాలేదు. 17 వార్డులుంటేనే ఎవరికైనా చైర్మన్ పీఠం దక్కనుంది.

 కాంగ్రెస్ నుంచి పులి గీత చైర్‌పర్సన్ పదవి కోసం పోటీ పడుతుండగా, సీపీఐ-టీడీపీ కూటమి స్వతంత్రుల మద్దతుతో పీఠాన్ని దక్కించుకోవాలని చూస్తోంది. అయితే ఆ పదవి ఎవరు దక్కించుకోవాలన్నా ఇక్కడ స్వతంత్రుల మద్దతే కీలకం. దీంతో ఎవరికి వారు రహస్యంగా చర్చలు జరుపుతున్నారు. పీఠంపై కన్నేసిన టీఆర్‌ఎస్ కూడా ఇతర పార్టీల నుంచి గెలుపొందిన కౌన్సిలర్‌ల కోసం వేట ప్రారంభించినట్లు సమాచారం.

 మధిరలో లోపాయికారి  ఒప్పందం..
 నూతనంగా ఏర్పడిన మధిర నగర పంచాయతీకి ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. ఇక్కడ ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో అడ్డదారిన చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇక్కడ వైఎస్సార్‌సీపీ- సీపీఎం, కాంగ్రెస్- సీపీఐ కూటమిగా బరిలోకి దిగగా టీడీపీ ఒంటరిగా పోటీ చేసింది. వైఎస్సార్‌సీపీకి 4, సీపీఎంకు 3, కాంగ్రెస్‌కు 4, సీపీఐకి 2, టీడీపీకి 6 వార్డులు, స్వతంత్రులు 1 వార్డు కైవసం చేసుకున్నారు.

పొత్తుతో పోటీ చేసిన కాంగ్రెస్- సీపీఐ కూటమి ఇప్పుడు  టీడీపీతో జత కట్టాలని లోపాయికారిగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. టీడీపీ, కాంగ్రెస్ చేరో రెండున్నరేళ్లు చైర్మన్ పదవిని పంచుకునేలా అంగీకారానికి వచ్చినట్లు తెలిసింది. ఇక వైస్ చైర్మన్ పదవి సీపీఐకి ఐదేళ్లు ఇచ్చేలా ఖరారు చేసుకున్నట్లు సమాచారం. తొలి రెండున్నరేళ్లు   చైర్మన్ పీఠం దక్కించుకోవాలనే ప్రతిపాదనతో టీడీపీకి చెందిన కౌన్సిలర్లు క్యాంపునకు తరలివెళ్లారు. కాంగ్రెస్‌లో మాత్రం మొండితోక నాగరాణి, నంద్రూ శారమ్మ చైర్‌పర్సన్ పదవికోసం పోటీ పడుతున్నారు.

 ఇల్లెందు చైర్మన్ గిరి  ‘మడత’కేనా..?
 ఇల్లెందులో కాంగ్రెస్- సీపీఐ, వైఎస్సార్‌సీపీ-సీపీఎం కూటములుగా బరిలోకి దిగాయి. టీడీపీ, న్యూడెమోక్రసీ, టీఆర్‌ఎస్ ఒంటరిగా పోటీ చేశాయి. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ 8, సీపీఐ 3, టీడీపీ 4, టీఆర్‌ఎస్ 3, ఎన్డీ 2, స్వతంత్రులు 4 వార్డులు దక్కించుకున్నారు. స్వతంత్రుల మద్దతుతో చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఈ పార్టీ నుంచి చైర్మన్ పదవికి మడత రమ, వైస్ చైర్మన్ పదవికి సీపీఐ నుంచి బాస శ్రీనివాస్ రేసులో ఉన్నారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య చక్రం తిప్పడంతో ఆయన అనుచరుడైన మడత వెంకట్‌గౌడ్ భార్య మడత రమకు చైర్‌పర్సన్ పీఠం దక్కే అవకాశాలున్నాయి. ఈ పీఠాన్ని ఆశిస్తున్న కాంగ్రెస్.. సొంత పార్టీతో పాటు మిగతా కౌన్సిలర్లనూ క్యాంపునకు తరలిచింది.

 సత్తుపల్లిలో  ఇంటిపోరు..
 సత్తుపలి నగర పంచాయతీలో టీడీపీ అత్యధిక వార్డులు దక్కించుకున్నా చైర్మన్ పదవి వ్యవహారం స్థానిక ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారింది. ఇక్కడ వైఎస్సార్‌సీపీ- సీపీఎం, కాంగ్రెస్- సీపీఐ కూటములుగా, టీడీపీ ఒంటరిగా బరిలో నిలిచాయి. టీడీపీ 17 వార్డులు దక్కించుకోగా, వైఎస్సార్‌సీపీ 3 వార్డులు కైవసం చేసుకుంది. అయితే ఎక్కువ వార్డులు దక్కించుకున్నామన్న ఆనందం టీడీపీలో లేదు. చైర్మన్ పీఠంపై వర్గపోరు కొనసాగుతుండడమే ఇందుకు కారణం.

 వెలిశాల సత్యావతి, దొడ్డాకుల స్వాతి ఈ పదవి కోసం పోటీపడుతున్నారు. పీఠం తనకే  ఇవ్వాలని ఇరువురూ తమకు మద్దతు తెలిపే కౌన్సిలర్లతో కలిసి పలుమార్లు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వద్దకు వెళ్లారు. ఎన్నిక సమయం దగ్గరకు వచ్చినా ఇంకా చైర్మన్ పీఠం ఎవరికన్నది ఆ పార్టీలో కొలిక్కి రాలేదు. ఈ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు పూర్తిగా జోక్యం చేసుకోకపోవడంతో ఇప్పటి వరకు చైర్మన్ ఎవరన్నది తేలలేదని ఆ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement