ఐటీ ఉద్యోగులపై ‘లే ఆఫ్’ కత్తి
సాక్షి, హైదరాబాద్/బెంగళూరు: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. ఐదంకెల వేతనం... వారంలో రెండ్రోజులు సెలవులు.. పిక్ అండ్ డ్రాప్ సౌకర్యం.. హ్యాపీ లైఫ్! కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారవుతోంది. సాఫ్ట్‌వేర్ రంగంలో సంక్షోభం ముదురుతోంది. కంపెనీలు లాభనష్టాలను బేరీజు వేసుకుంటూ ఆర్థిక సర్దుబాటు చర్యలు చేపడుతున్నాయి. దిగ్గజ ఐటీ కంపె నీలు సైతం ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతున్నాయి.
ఈ ఏడాది ఏడు ప్రముఖ ఐటీ కంపెనీలు (ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహేంద్ర, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, కాగ్నిజెంట్, డీఎక్స్‌సీ, క్యాప్ జెమినీ) 56 వేల మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ఉద్వాసన (లే ఆఫ్) పలకాలని చూస్తున్నాయి. ఇది గతేడాది వివిధ కంపెనీలు తొలగించిన ఉద్యోగుల సంఖ్యకు రెట్టింపు కావడం ఐటీ సంక్షోభానికి అద్దంపడుతోంది.
హైదరాబాద్‌లో 50కి పైగా అంతర్జాతీయ ఐటీ సంస్థలుండగా.. మరో 2 వేల వరకు మధ్య, చిన్న తరహా సంస్థలున్నాయి. ఈ కంపెనీల్లో దాదాపు 3 లక్షల మంది పనిచేస్తున్నట్లు అంచనా. తాజాగా ఐటీ కంపెనీలు.. పనితీరు సంతృప్తికరంగా లేదంటూ ఉద్యోగుల తొలగింపు చర్యలకు సిద్ధమయ్యాయి. ఉద్యోగులకు ఇబ్బడిముబ్బడిగా పింక్ స్లిప్‌లు జారీ చేస్తున్నాయి. మరికొందరికి నిర్ణీత గడువు ఇస్తూ ఆలోగా ఉద్యోగానికి రాజీనామా చేయాలని ఒత్తిడి తెస్తున్నాయి. ఒక్క హైదరాబాద్‌లో ఈ ఏడాది కనీసం 10 వేల మందిపై వేటు పడనున్నట్లు ఐటీ వర్గాలు చెబుతున్నాయి.
తక్కువ రేటింగ్ ఇస్తూ..
ఉద్యోగుల పనితీరుకు తక్కువ రేటింగ్ ఇస్తూ ఏడు ప్రముఖ కంపెనీలు ఇప్పట్నుంచే వారి తొలగింపునకు రంగం సిద్ధం చేస్తున్నాయి. కాగ్నిజెంట్ కంపెనీ 15 వేల మందికిపైగా ఉద్యోగులకు తక్కువ స్థాయి కేటగిరీ(బకెట్–4)లో చేర్చింది. ఇన్ఫోసిస్ కూడా 3 వేల మంది సీనియర్ మేనేజర్లను ‘పనితీరు మెరుగుపర్చుకోవాల్సిన ఉద్యోగుల జాబితా’లో చేర్చింది. డీఎక్స్‌సీ టెక్నాలజీ కంపెనీ రానున్న మూడేళ్లలో దేశంలో ప్రస్తుతం ఉన్న 50 కార్యాలయాలను 26కు తగ్గించుకోవాలని యోచిస్తోంది. అలాగే ఈ ఏడాది తమ కంపెనీలోని మొత్తం 1,70,000 సిబ్బందిలో 10 వేల మందిని ఇంటి కి పంపేందుకు సిద్ధమవుతోంది. కంపెనీలు మాత్రం దీన్ని నిరాకరిస్తున్నాయి. ఇది పని తీరు ఆధారంగా ఏటా సాధారణంగా జరిగే మధింపు మాత్రమేనని చెబుతున్నాయి. ‘‘ప్రతి రెండేళ్లకోసారి పనితీరుపై మధింపు జరుపుతాం’’అని ఇన్ఫోసిస్ ప్రతినిధి తెలిపారు.
ఉద్యోగుల్లో అలజడి..
ఐటీ కంపెనీల తీరుతో ఎగువ, మధ్యస్థాయి ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రత్యామ్నాయ అవకాశాలు లేని సమయంలో వేటు వేస్తే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిలో కొలువు నుంచి తొలగిస్తే మరో కంపెనీలో ఉద్యోగం దొరకడం అసాధ్యం. దీంతో ఉద్యోగులు న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు. తాజాగా హైదరాబాద్ కాగ్నిజెంట్ సంస్థలో వేటు పడిన వారిలో 8 మంది తమను తొలగించడాన్ని సవాలు చేస్తూ కార్మికశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.
కంపెనీలతో కార్మిక శాఖ చర్చలు
ఉద్యోగుల ఫిర్యాదుపై కార్మిక శాఖ స్పందిం చింది. గురువారం కంపెనీ ప్రతినిధులతో సమావేశమైంది. కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయంలో జరిగిన చర్చల్లో కాగ్నిజెంట్ వైస్ చైర్మన్‌తో పాటు నలుగురు హెచ్‌ఆర్ ఉద్యోగులు, తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ప్రతినిధులు, నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ యూనిట్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఫిర్యాదులపై ప్రాథమిక సమాచారం తీసుకున్న కాగ్నిజెంట్ ప్రతినిధులు రెండు వారాల గడువు కోరారు. దీంతో ఈ నెల 26న మరోమారు చర్చలు నిర్వహించనున్నట్లు కార్మిక శాఖ సంయుక్త కమిషనర్ చంద్రశేఖరం మీడియాకు తెలిపారు.