వచ్చేది కోతల కాలం!
అప్రమత్తంగా లేకుంటే అంధకారమే
తెలంగాణలో భారీగా పెరగనున్న విద్యుత్ వినియోగం
ఐదేళ్లనాటికి 40,742 మిలియన్ యూనిట్ల కొరత
ప్రస్తుతం 16% లోటు.. 2018-19 నాటికి ఏకంగా 49%
ప్రభుత్వం తక్షణమే దీర్ఘకాల ప్రణాళికలకు నడుం బిగించాలి
కొత్త విద్యుత్ కేంద్రాలను నిర్ణీత కాలంలో నిర్మించాలి
కేంద్రం, ఏపీ నుంచి వాటాలు రాబట్టుకోవాలి
‘ఆటోమేటిక్ మీటర్ రీడింగ్’ పద్ధతిలో బిల్లింగ్ చేపట్టాలి
మొబైల్ సిమ్ ఆధారిత మీటర్లు.. ‘పీక్ అవర్’లో హెచ్చు టారిఫ్
టీ సర్కారుకు ఇంధన శాఖ నివేదిక
సాక్షి, హైదరాబాద్:
2018-19 నాటికి తెలంగాణలో 40,742 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత!
కొరత ఇలాగే పెరుగుతూ పోతే రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడక తప్పదు!
ఆర్థిక పురోగతిపై అంచనాలన్నీ తలకిందులవుతాయి!
..ఇంధన శాఖ వెల్లడించిన కఠోర వాస్తవాలివీ!! విద్యుత్ సంక్షోభం, రాబోయే అయిదేళ్లలో తెలంగాణ భవిష్యత్తుపై ఇంధన శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం వెంటనే అప్రమత్తం కావాలని స్పష్టంచేసింది. తక్షణమే అందుబాటులో ఉన్న ఇంధన వనరులన్నీ ఉపయోగించుకోవాలని, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికతో విద్యుత్ సమకూర్చుకునేందుకు నడుంబిగించాలని పేర్కొంది. ‘‘రాబోయే అయిదేళ్లలో విద్యుత్ కొరత అమాంతం పెరిగిపోనుంది. డిమాండ్‌తో పోలిస్తే సగానికి సగం లోటు తప్పదు.
ప్రస్తుతం 9,203 మిలియన్ యూనిట్ల లోటు ఉంది. అంటే అవసరాలతో పోలిస్తే 16.7 శాతం కొరత ఉంది. అయిదేళ్లలో విద్యుత్ కొరత ఏకంగా 49 శాతానికి ఎగబాకనుంది. 2018-19 నాటికి 40,742 మిలియన్ యూనిట్ల కొరత ఏర్పడుతుంది’’ అని విద్యుత్ రంగంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ కమిటీ తెలిపింది. ఈ కమిటీ తాజాగా తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.
ఇంధన శాఖ కార్యదర్శి ఎస్.కె.జోషి, ప్రభుత్వ సలహాదారు ఏకే గోయల్ అధ్వర్యంలో టీఎస్‌జెన్‌కో, ట్రాన్స్‌కో, సింగరేణి, వ్యవసాయ, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు రెండు నెలల పాటు కసరత్తు చేసి ఈ నివేదికను సిద్ధం చేశారు. ‘‘విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించేందుకు కొత్త విద్యుత్ కేంద్రాలు నిర్ణీత కాల వ్యవధిలో నిర్మించుకోవాలి. ఇప్పుడున్న టీఎస్‌జెన్‌కో విద్యుత్ కేంద్రాల్లో ఉత్పాదక సామర్థ్యం పెంచుకోవాలి.
కేంద్రం, ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సిన విద్యుత్ వాటాలు రాబట్టుకోవాలి. గడువు తీరిపోయే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను తిరిగి కొనసాగించాలి. సింగరేణి బొగ్గు నిల్వలు, రవాణాపై ఫోకస్ చేయాలి. సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపట్టాలి. విద్యుత్ పంపిణీ సరఫరాలో నష్టాలను తగ్గించాలి. డిస్కంలకు ఆర్థికంగా చేయూతనివ్వాలి. అన్నింటికీ మించి విద్యుత్‌ను ఆదా చేయాలి’’ అని నివేదికలో సూచించారు. విద్యుత్ డిమాండ్-సరఫరా మధ్య అంతరం తగ్గించుకునేందుకు, రానున్న అయిదేళ్లలో రాష్ట్రంలో నిరాంటకంగా 24 గంటల విద్యుత్ సరఫరా చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, భవిష్యత్తు ప్రణాళికలను ఈ నివేదిక ఆవిష్కరించింది. కమిటీ పేర్కొన్న కీలక అంశాలు, సిఫారసులు, రోడ్ మ్యాప్‌లో పొందుపరిచిన అంశాలు ఇవీ...
=====
అంచనాలు తలకిందులయ్యే ప్రమాదం..
విద్యుత్ వినియోగం పెరగటంతో.. కోత మితిమీరుతోంది. గత మూడేళ్లలో 5 నుంచి 12 శాతం విద్యుత్ కొరత నమోదైంది. ఈ ఏడాది 9,203 మిలియన్ యూనిట్ల లోటు (16.7%) తలెత్తనుంది. రాబోయే అయిదేళ్లలో తెలంగాణలో విద్యుత్ కొరత అమాంతం 51 శాతానికి ఎగబాకనుంది. 2018-19 నాటికి 4,0742 మిలియన్ యూనిట్ల కొరత ఏర్పడుతుంది. ఇలాగైతే రాష్ట్ర అభివృద్ధి, ఆర్థిక పురోగతి, భవిష్యత్తు అంచనాలన్నీ తలకిందులవుతాయి. ఏటేటా విద్యుత్ వినియోగం భారీగా పెరిగిపోతోంది. గృహ వినియోగదారులతో పాటు.. వాణిజ్య, ఆదాయ వనరులకు కరెంట్ వాడకం పెరిగింది.
నీటి పారుదల, ఎత్తిపోతల పథకాలు, హైదరాబాద్ మెగా సిటీతో పాటు వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ పట్టణాల అభివృద్ధి, హైదరాబాద్ మెట్రో రైలు, హైదరాబాద్ ఐటీఐఆర్ రీజియన్, హైదరాబాద్-నాగ్‌పూర్ ఇండస్ట్రియల్ కారిడార్.. వీటన్నింటి కారణంగా విద్యుత్ అవసరం మరింత పెరగనుంది. రాబోయే రోజుల్లో కొత్తగా విద్యుత్ ఉత్పాదన తోడవకపోతే పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. ఈ ఏడాదితో పోలిస్తే 2018-19 నాటికి విద్యుత్ అవసరం 11 శాతం పెరుగనుందని అంచనా. వచ్చే అయిదేళ్ల నాటికి... హైదరాబాద్ మెట్రో రైలుకు ఏటా 1,402 మిలియన్ యూనిట్లు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు 7,392 మిలియన్ యూనిట్లు, హైదరాబాద్ ఐటీఐఆర్‌కు 2,632 మిలియన్ యూనిట్లు విద్యుత్ అవసరమవుతుందని అంచనా. వ్యవసాయ కనెక్షన్లు ఏటా 6 శాతం పెరిగిపోతాయి. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ పట్టణాల్లో ఏటా 8 నుంచి 10 శాతం విద్యుత్ వాడకం పెరగనుంది. బయ్యారంలో ఉక్కు పరిశ్రమకు 2,400 మెగావాట్లు అవసరమవుతుంది. వీటికి తోడుగా గృహ వినియోగదారులకు, పరిశ్రమలకు విద్యుత్ అందించాల్సి ఉంటుంది.
ఐదేళ్ల నాటికి ఇదీ పరిస్థితి..
---------------------------------------------------
2014-15 2015-16 2016-17 2017-18 2018-19
---------------------------------------------------
విద్యుత్ డిమాండ్ 54,998 63,047 67,902 77,164 84,496
ఉత్పాదన 45,795 45,037 44,030 43,896 43,754
కొరత 9,203 18,009 23,872 33,268 40,742
శాతం 16.7% 28.6% 35.2% 43.1% 48.2%
----------------------------------------------------
భవిష్యత్తు ప్రణాళికలు ఇలా..
- 2018-19 నాటికి రాష్ట్రంలో నిరాటంకంగా విద్యుత్ సరఫరా చేయాలంటే 84,496 మిలియన్ యూనిట్లు అవసరం. ఇందుకు విద్యుత్ ఉత్పత్తిని పెంచటంతో పాటు ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ నష్టాలను నివారించాలి. యుద్ధప్రాతిపదికన ‘విద్యుత్ ఆదా’ విధానాన్ని అనుసరించాలి. ఒక్క యూనిట్ ఆదా చేస్తే 1.25 యూనిట్ ఉత్పత్తి చేసినట్లే అవుతుందనే నినాదాన్ని ఎంచుకోవాలి.
- అయిదేళ్లలో భూపాలపల్లి, మణుగూరు, రామగుండంలో తలపెట్టే కొత్త్త కేంద్రాల నుంచి 6,000 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. సింగరేణి ఆదిలాబాద్ జిల్లా జైపూర్‌లో నిర్మిస్తున్న 1,050 మెగావాట్లు దీనికి తోడవుతుంది. 20015-16 చివరి వరకు జూరాల, పులిచింతల నుంచి 360 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి మొదలవుతుంది. ప్రస్తుతం జెన్‌కో అధ్వర్యంలో ఉన్న విద్యుత్ కేంద్రాల ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్‌ను 80 శాతం నుంచి వచ్చే ఏడాది 85 శాతానికి పెంచుకోవాలి. అయిదేళ్లలో 90 శాతం చేరుకోవాలి.
- 2018-19 నాటికి కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన కుడిగి, నెయ్యెలి, కల్పాక్కం, శ్రీకలి ప్లాంట్ల నుంచి వాటా వస్తుంది. వీటి ద్వారా ఏటా తెలంగాణకు 6,922 మిలియన్ యూనిట్ల వాటా దక్కుతుంది.
- ఇప్పటికే తెలంగాణ డిస్కంలు చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ప్రకారం కృష్ణపట్నం, థర్మల్ పవర్‌టెక్, ఆర్‌టీపీపీ-4 నుంచి 2016-17 నాటికి 1,454 మెగావాట్ల విద్యుత్ సమకూరుతుంది. వీటికి తోడుగా సోలార్, పవన విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలి.
- ప్రస్తుతం థర్మల్ కేంద్రాల ద్వారా 72 శాతం, హైడల్ కేంద్రాల ద్వారా 7 శాతం, సంప్రదాయేతర వనరుల ద్వారా ఒక శాతం విద్యుత్ అందుతోంది. భవిష్యత్తులో జల విద్యుత్ ఉత్పత్తి తగ్గుముఖం పట్టనుంది. సోలార్ విద్యుత్‌పై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలి. ఇప్పుడు సోలార్ విద్యుత్ కేవలం ఒక శాతమే అందుబాటులో ఉంది. అయిదేళ్లలో 7,529 మిలియన్ యూనిట్ల సోలార్ పవర్ అందుబాటులోకి వస్తుందని అంచనా. అలాగైతే రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఇంధన వనరుల్లో 8 శాతం వాటాగా నిలుస్తుంది.
- కొన్ని విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు అయిదేళ్లలోపు ముగిసిపోనున్నాయి. భవిష్యత్తులో ఇంధన కోటాపై ఈ ప్రభావం పడుతుంది. 2018-19 నాటికి 347 మెగావాట్లు.. అంటే 2,217 మిలియన్ యూనిట్లు నష్టం వాటిల్లుతుంది. పెరిగే విద్యుత్ అవసరాలతో పోలిస్తే ఇది 2.6 శాతం.
- కేజీ-డీ6 బేసిన్ నుంచి గ్యాస్ ఉత్పత్తి కేటాయింపులపై కేంద్ర ప్రభుత్వం ఇంకా కసరత్తు చేస్తోంది. గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలతో డిస్కంలు చేసుకున్న కొనుగోలు ఒప్పందాలు మరో రెండు మూడేళ్లలో కాలం చెల్లనున్నాయి. వీటిద్వారా 2012-13లో 4,196 మిలియన్ యూనిట్లు, 2013-14లో 2,186 మిలియన్ యూనిట్ల విద్యుత్ రాష్ట్రానికి అందింది. కేఎస్‌కే మహానది కంపెనీతో జూన్ 2016తో కొనుగోలు ఒప్పందం ముగియనుంది. దీన్ని రెన్యువల్ చేసుకుంటే.. ఏటా 1,570 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరాకు భరోసా ఉంటుంది. డి6 బేసిన్‌లో అందుబాటులో ఉన్న గ్యాస్‌తో శంకరపల్లి గ్యాస్ ప్లాంట్‌ను పునరుద్ధరించాలి. దీంతో హైదరాబాద్ ఐటీ రీజియన్‌కు సరిపడేంత విద్యుత్ అందించవచ్చు.
- పునర్విభజన చట్టం ప్రకారం కేంద్రప్రభుత్వం హామీ ఇచ్చిన ఎన్‌టీపీసీ 4,000 మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. ఉత్తరాది నుంచి విద్యుత్ తెచ్చుకునే కారిడార్‌ను బుక్ చేసుకునేందుకు వీలైనంత తొందరగా లాంగ్‌టర్మ్ విద్యుత్ కొనుగోలు టెండర్లను పిలవాలి. 2017-18 నుంచి ఉత్తరాది గ్రిడ్ నుంచి తక్కువ రేటుకు కొనుగోలు చేసేందుకు ఇప్పట్నుంచే సిద్ధం కావాలి. టీఎస్‌జెన్‌కో ఎంచుకున్న 7,280 మెగావాట్ల కొత్త విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని అన్ని విభాగాల సమన్వయంతో ఫాస్ట్ ట్రాక్ విధానంలో చేపట్టాలి.
- సింగరేణికి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి. దేశ విదేశాల్లో బొగ్గు బ్లాక్‌లను కంపెనీ అధ్వర్యంలో నిర్వహించాలి. అధికంగా బొగ్గు ఉత్పత్తి చేసే అధునాతన తవ్వకపు విధానాలు అమలు చేయాలి. సింగరేణి నుంచి విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా విధానాన్ని మెరుగుపరుచుకోవాలి. వంద శాతం బొగ్గు కేటాయింపులు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. లోడింగ్, ట్రాన్స్‌పోర్టేషన్, అన్‌లోడింగ్ సమయంలో నిరంతర అడిటింగ్ చేపట్టాలి.
===
ఉత్తరాది కరెంటు కష్టమే
===
టీఎస్‌జెన్‌కో, ఏపీజెన్‌కో విద్యుత్‌తోపాటు కేంద్ర వనరుల నుంచి వాటాలు వచ్చినా తెలంగాణకు అదనంగా విద్యుత్ అవసరం ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాల్లో (సదరన్ రీజియన్‌లో) ప్రస్తుతం 3.300 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్లున్నాయి. వచ్చే రెండేళ్లలో ఇవి 6,000 మెగావాట్లకు ప్లాంట్లు విస్తరిస్తాయి. ఉత్తరాది నుంచి విద్యుత్ కొనుగోలుకు కారిడార్ ఇబ్బంది లేకుండా వీటి నుంచి ఎక్కువ విద్యుత్ కొనుగోలుకు టెండర్లు పిలవాలి. ఇతర రాష్ట్రాలు కూడా ఇప్పటికే ఆ ప్రయత్నాలు ప్రారంభించిన విషయాన్ని గుర్తుంచుకొని తొందరపడాలి. ఉత్తరాది రాష్ట్రాల్లో సరిపడేంత విద్యుత్ అందుబాటులో ఉంది.
కానీ.. సరఫరాకు ప్రతిబంధకాలున్నాయి. అంగుల్-శ్రీకాకుళం-వేమగిరి 765 కేవీ లైన్, వార్ధా-నిజామాబాద్-హైదరాబాద్ 765 కేవీ లైన్ నిర్మాణంలో ఉన్నాయి. వీటి ద్వారా 2017 మార్చి నాటికి 4,000 మెగావాట్ల విద్యుత్ సదరన్ గ్రిడ్‌కు సరఫరా అవుతుందని అంచనా. అందులో 1,050 మెగావాట్లు ఇప్పటికే తమిళనాడు బుక్ చేసుకుంది. వెస్టర్న్ రీజియన్, ఈస్టర్న్ రీజియన్ నుంచి సదరన్ గ్రిడ్‌కు 3,850 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేసే లైన్లు ఉన్నాయి. అందులో ఇప్పటికే 3,314 మెగావాట్లు బుక్ అయ్యాయి. అందుకే కొనుగోలు ఒప్పందాలు చేసుకునే సమయంలో కారిడార్ అవసరాలపై అప్రమత్తంగా ఉండాలి.
===
త్రీఫేజ్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు..
===
డిస్కంల పనితీరును మెరుగుపరిచేందుకు.. తెలంగాణలో అనువైన ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూషన్ ఫ్రాంఛైజీ మోడల్ అమలు చేయాలి. ఆటోమెటిక్ మీటర్ రీడింగ్ పద్ధతిలో విద్యుత్ వినియోగం గణాంకాలు సేకరించి బిల్లింగ్ చేపట్టాలి. రిమోట్ పద్ధతిలో సమాచారం చేరవేసే మొబైల్ సిమ్ ఆధారిత మీటర్లను ప్రయోగించాలి. వాణిజ్య అవసరాలకు స్మార్ట్ మీటర్లను అనుసంధానం చేయాలి. దీంతో పరిమితికి మించి విద్యుత్ వినియోగం చేయకుండా నియంత్రించే వీలుంటుంది.
తెలంగాణలో 16 లక్షల త్రీ ఫేజ్ కనెక్షన్లు ఉన్నాయి. వీటన్నింటికీ స్మార్ట్ మీటర్లను అమర్చేందుకు రూ.1,100 కోట్ల ఖర్చు అవుతుంది. ఎనర్జీ అడిట్ కొనసాగించాలి. బిల్లింగ్‌లో అవకతవకలకు తావు లేకుండా మెకానికల్ మీటర్లను స్థానంలో డిజిటల్ మీటర్లను అమర్చాలి. 19.2 లక్షల మీటర్లను మార్చేందుకు రూ.250 కోట్లు ఖర్చు అవుతుంది. పీక్ డిమాండ్ మేనేజ్‌మెంట్ అమల్లోకి తేవాలి. డిమాండ్ ఎక్కువగా ఉండే పీక్ అవర్స్‌లో వినియోగదారులపై టారిఫ్‌ను పెంచితే... డిమాండ్‌ను తగ్గించవచ్చు. హైఓల్టేజీ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అమలు చేయాలి. జీఐఎస్ మ్యాపింగ్ అండ్ మీటరింగ్, వరంగల్, హైదరాబాద్‌లో అమలు చేస్తున్న స్కాడా పథకాన్ని అన్ని జిల్లాల కేంద్రాలకు విస్తరించాలి. అర్బన్ డెవెలప్‌మెంట్ అథారిటీల సమన్వయంతో పట్టణ ప్రాంతాల్లో ప్రీ పెయిడ్ మీటర్లను ఏర్పాటు చేయాలి. 2018 నాటికి మొత్తం సరఫరాలో పది శాతం ప్రీ పెయిడ్ లక్ష్యం చేరుకోవాలి.
==
డిస్కం నష్టాలను తగ్గించాలి..
===
డిస్కంలు ఆర్థికంగా చిక్కుల్లో ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టు నాటికి వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి డిస్కంలకు రూ.1,453 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌కు రూ.961 కోట్లు, టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌కు రూ.492 కోట్లు బకాయిలున్నాయి. ఇవి ఏటా పేరుకుపోకుండా హైదరాబాద్ స్థాయిలోనే బిల్లులను సర్దుబాటు చేయాలి. డిస్కంలు ఏటేటా తమ వ్యాపారాన్ని 0.25 శాతం పెంచటంతో పాటు సరఫరా-పంపిణీ నష్టాలను 0.75 శాతం తగ్గించుకోగలిగితే రాబోయే నాలుగేళ్లలో రూ.2,716 కోట్లు ఆదా చేసే వీలుంటుంది.
===
వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు
===
వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సబ్సిడీ భారం పెరిగిపోతోంది. దీన్ని నియంత్రించేందుకు వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు అమర్చాలి. సబ్సిడీ భారాన్ని తగ్గించేందుకు ట్రాన్స్‌ఫార్మర్ల స్థాయిలో మీటరింగ్ విధానాన్ని చేపట్టాలి. మొదట వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లకు, ఆ తర్వాత వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు అమర్చాలి. దీంతో వాస్తవ నష్టాలను నివారించే వీలుంది. వ్యవసాయ కనెక్షన్లు ఎన్ని ఉన్నాయో సర్వే చేయాలి. చిన్న, సన్నకారు రైతులకు మాత్రమే సబ్సిడీ ఇవ్వాలనేది ప్రభుత్వ విధానం. వీరికే లబ్ధి చేకూరేలా చూడాలి. రాబోయే అయిదేళ్లలో వ్యవసాయ విద్యుత్‌పై సబ్సిడీ భారం రూ.10,141 కోట్లకు చేరనుంది. తెలంగాణలో 19.1 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. ఏటా వ్యవసాయానికి విద్యుత్ సబ్సిడీ భారం పెరిగిపోతోంది. ఈ ఏడాది 11,939 మిలియన్ యూనిట్ల విద్యుత్ వ్యవసాయానికి వినియోగించారు. ఇందుకు దాదాపు రూ.6,832 కోట్ల సబ్సిడీ అవసరం. ప్రభుత్వం రూ.3,331 కోట్లు భరించనుంది. మిగతా రూ.3,501 కోట్లు క్రాస్ సబ్సిడీ ద్వారా డిస్కంలు సర్దుబాటు చేసుకుంటున్నాయి. అయిదేళ్లలో వ్యవసాయ అవసరాలు 14,512 మిలియన్ యూనిట్లకు చేరుతుంది. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ రూ.4,676 కోట్లకు పెరుగుతుంది. క్రాస్ సబ్సిడీ ద్వారా రూ.5,465 కోట్లు సమకూర్చుకోవాల్సి ఉంటుందని అంచనా.
==
విద్యుత్ ఆదా మంత్రం
===
విద్యుత్‌ను ఆదాపై పెద్దఎత్తున అవగాహణ కార్యక్రమాలు చేపట్టాలి. రాష్ట్రంలో మొత్తం 81.5 లక్షల గృహ వినియోగదారులున్నారు. 7,800 మిలియన్ యూనిట్ల విద్యుత్ వాడుతున్నారు. ఇప్పుడున్న వాటిలో కనీసం పది శాతం బల్బుల స్థానంలో ఎల్‌ఈడీ బల్బులు వాడితే ఏటా 123-391 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుంది. తెలంగాణలో వీధి దీపాలకు 600 మిలియన్ యూనిట్ల విద్యుత్ వాడుతున్నారు. ఇంటెలిజెంట్ కంట్రోలు ఉన్న ఎల్‌ఈడీ బల్బులు వాడితే ఇది సగానికి సగం ఆదా అవుతుంది. ఐఎస్‌ఐ నాణ్యత ఉన్న పంప్‌సెట్లు వాడితే వ్యవసాయ విద్యుత్ డిమాండ్‌లో 25 నుంచి 30 శాతం ఆదా అవుతుంది. ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ విధానంలో ప్రభుత్వ భవనాలు నిర్మించాలి. ఇప్పుడున్న వాటిని అధునీకరించాలి. పరిశ్రమలు ఎల్‌ఈఈడీ సర్టిఫికేషన్ పాటించాలి. లేకుంటే గ్రీన్‌సెస్ విధించాలి. రాష్ట్ర స్థాయిలో ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ ఏర్పాటు చేయాలి.
మిగులు అంచనాలు..
ఇప్పుడున్న ప్రణాళికలు, లక్ష్యాల ప్రకారం అన్ని వనరులు వినియోగంలోకి వచ్చి, కొత్త విద్యుత్ కేంద్రాలు అందుబాటులోకి వస్తే... ఐదేళ్లలో తెలంగాణలో 1.99 శాతం విద్యుత్ మిగులు ఉంటుంది. మరింత ఆశావాద అంచనా వేస్తే డిమాండ్‌తో పోలిస్తే 6.74 శాతం మిగులు విద్యుత్ ఉండే అవకాశముంది. ఒక వేళ పరిస్థితులు పూర్తి అనుకూలంగా లేకపోతే 5.98 శాతం లోటు ఏర్పడుతుంది.