సీమాంధ్ర మిగులు తెలంగాణకు దఖలు !
విద్యుత్ విభజనలో జీవోఎం చిట్కాలు
కొరత తీర్చేందుకు రంగంలోకి దిగిన కేంద్రం
‘మొదటి తిరస్కార హక్కు’ తెలంగాణకే
25 ఏళ్లపాటు యుథాతథంగా విద్యుత్ ఒప్పందాలు
కేంద్ర విద్యుత్తులో తెలంగాణకు 59.62, సీమాంధ్రకు 40.38 శాతం
ఆర్‌టీపీపీకి యథావిధిగా సింగరేణి బొగ్గు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రానికి విపరీతంగా విద్యుత్ కొరత ఏర్పడుతుందనే భయూందోళనలను తీర్చడానికి వుంత్రుల బృందం కొన్ని పరిష్కారవూర్గాలను బిల్లులో సూచించింది. అందులో మొదటిది తిరస్కార హక్కు. అంటే సీమాంధ్ర మిగులు విద్యుత్‌ను తెలంగాణ ఒక హక్కుగా కొనుగోలు చేయడానికి వీలుంటుంది. సీమాంధ్ర తనకు ఎంత మిగులు విద్యుత్ ఉంటే అంతమేరకు మొదటగా తెలంగాణకే విక్రయించాల్సి వస్తుంది. ఈ మేరకు సీమాంధ్ర మిగులు విద్యుత్‌పై తెలంగాణకు మొదటి తిరస్కార హక్కు (ఫస్ట్ రైట్ ఆఫ్ రెఫ్యూజల్ -ఎఫ్‌ఆర్‌ఆర్)ను కేంద్రం అప్పగించింది. తెలంగాణ ఈ విద్యుత్‌ను కొనుగోలు చేయడం లేదంటేనే దానిని బహిరంగ మార్కెట్లో ఇతరులకు విక్రయించాల్సి ఉంటుంది. దీనినే ఎఫ్‌ఆర్‌ఆర్‌గా వ్యవహరిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడనున్న విద్యుత్ కొరత సమస్యను తీర్చేందుకు ఈ విధానాన్ని ఎన్నుకున్నట్టు బిల్లు పేర్కొంది.
అదేవిధంగా గత ఐదేళ్ల వినియోగాన్ని లెక్కించి.... రాష్ట్రంలోని పలు కేంద్ర విద్యుత్ ప్లాంట్ల (సీజీఎస్) నుంచి తెలంగాణ ప్రాంతానికి 59.62 శాతం విద్యుత్‌ను, సీమాంధ్ర ప్రాంతానికి 40.38 శాతం విద్యుత్‌ను కేటాయించాలని కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013లో స్పష్టం చేసింది. అంతేకాక జెన్‌కోతో పాటు పలు ప్రైవేట్ ప్లాంట్లతో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ)ను యథావిధిగా కొనసాగించాలని కేబినెట్ పేర్కొంది. అంటే ఈ ప్లాంట్ల నుంచి ప్రస్తుతం ఏ ప్రాంతానికి ఎంత విద్యుత్ సరఫరా అవుతుందో... అంతే మొత్తం రానున్న 25 సంవత్సరాల పాటు కొనసాగుతుందన్నమాట. తెలంగాణ ప్రాంతంలో 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు ఉన్న అవకాశాలను ఎన్‌టీపీసీ పరిశీలించాలని కూడా ఈ బిల్లు స్పష్టం చేసింది. తెలంగాణ ప్రాంతానికి ఏర్పడనున్న విద్యుత్ కొరతను పరిష్కరించేందుకు ఈ బిల్లు ద్వారా కేంద్రం ప్రయత్నించిందని అర్థమవుతోంది.
మరికొన్ని ముఖ్యాంశాలు...
- పలు ప్రభుత్వ, ప్రైవేట్ ప్లాంట్లతో రాష్ట్రంలోని నాలుగు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు) కొనసాగుతాయి. నిర్మాణంలో ఉన్న ప్లాంట్లతో కుదుర్చుకున్న పీపీఏలు కూడా కొనసాగుతాయని బిల్లు స్పష్టం చేసింది. ఫలితంగా జెన్‌కోకు చెందిన పలు విద్యుత్ ప్లాంట్ల నుంచి విద్యుత్ పీపీఏ మేరకు రెండు ప్రాంతాలకూ విద్యుత్ సరఫరా అవుతుంది. వీటి కాలపరిమితి 25 సంవత్సరాల వరకు ఉంది.
- జెన్‌కోకు చెందిన ఆయా ప్లాంట్లపై హక్కులు మాత్రం భౌగోళిక ప్రాంతం ఆధారంగానే ఉండనున్నాయి. ఈ లెక్కన తెలంగాణ ప్రాంతంలో థర్మల్ విద్యుత్ ప్లాంట్ల సామర్థ్యం 2,282.5 మెగావాట్లు ఉండగా, ఆంధ్రా ప్రాంతంలో 2,810 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి. అయితే, జల విద్యుత్ ప్లాంట్లు మాత్రం తెలంగాణలోనే ఎక్కువ కావడం గమనార్హం. తెలంగాణలో జల విద్యుత్ ప్లాంట్ల సామర్థ్యం 2,541.8 మెగావాట్లు. ఆంధ్రలో 1,287.6 మెగావాట్లు మాత్రమే.
ప్రైవేట్ విద్యుత్ ప్లాంట్లను పరిగణనలోకి తీసుకుంటే ఆంధ్రలోని విద్యుత్ ప్లాంట్ల సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంది. మొత్తం మీద రాష్ట్రవ్యాప్తంగా జెన్‌కోకు 8,924.86 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి. ఇందులో తెలంగాణ ప్రాంతంలో 4,825.26 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి. అంటే మొత్తం జెన్‌కో సామర్థ్యంలో 54 శాతం తెలంగాణలోనే ఉన్నాయి. ఇక ఆంధ్ర ప్రాంతంలో 4,099.6 మెగావాట్ల ప్లాంట్లు... అంటే 46 శాతం ఉన్నాయన్నమాట.
- వైఎస్సార్ జిల్లాలో ముద్దనూరు వద్ద ఉన్న రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటు (ఆర్‌టీపీపీ)కి యథావిధిగా సింగరేణి నుంచి బొగ్గు సరఫరా చేయాలి. ఆర్‌టీపీపీకి సింగరేణి నుంచి ఏటా 1.88 మిలియన్ టన్నుల బొగ్గు సరఫరా అవుతోంది.
- విద్యుత్ ప్రసార వ్యవస్థను నియంత్రిస్తున్న స్టేట్ లోడు డిస్పాచ్ సెంటర్ (ఎస్‌ఎల్‌డీసీ)పై 2 రాష్ట్రాలకు రెండేళ్లపాటు హక్కు ఉండనుంది. ఇప్పటికే తిరుపతిలో నిర్మిస్తున్న ఎస్‌ఎల్‌డీసీ డాటా బ్యాక్ సెంటర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందనుంది.
- ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఆరు నెలల పాటు రెండు రాష్ట్రాలకు నియంత్రణ వ్యవస్థగా పనిచేస్తుంది. అనంతరం వేర్వేరుగా ఈఆర్‌సీలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.
- శ్రీశైలం ఎడమగట్టు ప్రాజెక్టుతో పాటు, పులిచింతల విద్యుత్తు ప్లాంటు కూడా తెలంగాణ ప్రాంతానికే చెందనుంది. 30 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు యూనిట్లను, మొత్తం 120 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పులిచింతల ప్రాజెక్టు నల్లగొండ జిల్లా ప్రాంతంలో ఉంది. అయితే ఈ ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టు మొత్తం సీమాంధ్రలో ఉండటం గమనార్హం.
హైదరాబాద్‌కు అదనపు విద్యుత్ ఇవ్వాలి: జీహెచ్‌ఎంసీ పరిధి ఉమ్మడి రాజధానిగా ఉండబోతున్నందున హైదరాబాద్‌కు అదనపు విద్యుత్‌ను కేంద్రం ఇవ్వాలని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కో-ఆర్డినేటర్ కంచర్ల రఘు కోరారు. లేనిపక్షం లో తెలంగాణ రైతాంగానికి విద్యుత్ సమస్య ఏర్పడే అవకాశం ఉంటుందన్నారు.
* జెన్‌కో ప్లాంట్లు ఏ ప్రాంతానివి ఆ ప్రాంతానికే...
* జెన్‌కో విద్యుత్‌లో 54 శాతం వాటా తెలంగాణదే (4,825.26 మెగావాట్లు)
* జెన్‌కో విద్యుత్‌లో సీమాంధ్రకు 46 శాతమే (4,099.6 మెగావాట్లు)
* తెలంగాణ థర్మల్ ప్లాంట్ల సామర్థ్యం 2,282.5 మెగావాట్లు
* సీమాంధ్ర థర్మల్ ప్లాంట్ల సామర్థ్యం 2,810 మెగావాట్లు
కేంద్ర విద్యుత్‌లో తెలంగాణకు 59.62%
ఆంధ్రప్రదేశ్‌కు 40.38%
మొత్తం విద్యుత్‌లో తెలంగాణకు 56%
ఆంధ్రప్రదేశ్‌కు 44%
* మరో 25 ఏళ్లపాటు పీపీఏలు అమలు.
* ఆర్టీపీపీకి యథావిధిగా సింగరేణి బొగ్గు
* సీమాంధ్ర మిగులు విద్యుత్ కొనే హక్కు తెలంగాణదే
* తెలంగాణలో 4 వేల మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటుకు ఎన్‌టీపీసీకి సూచన
* 6 నెలలపాటు రెండు రాష్ట్రాలకు ఒకటే ఈఆర్‌సీ, ఆ తర్వాత కొత్త ఈఆర్‌సీలు
* స్టేట్‌లోడ్ డిస్పాచ్ సెంటర్‌పై రెండు రాష్ట్రాలకు రెండేళ్ల హక్కు
* తిరుపతి ఎస్‌ఎల్‌డీసీ డాటా సెంటర్ సీమాంధ్రకే
* సీపీడీసీఎల్ నుంచి అనంత, కర్నూలు జిల్లాలు ఎస్‌పీడీసీఎల్‌లోకి మార్పు
* జలవిద్యుత్ ప్లాంట్లు తెలంగాణలోనే అధికం (2,541.8 మెగావాట్లు)
* సీమాంధ్ర జలవిద్యుత్ ప్లాంట్ల సామర్థ్యం 1,287.6 మెగావాట్లు మాత్రమే