
సాక్షి, హైదరాబాద్ : మహాకూటమిలో ఏ పార్టీ ఏ స్ధానంలో పోటీ చేస్తుందన్న వివరాలు సోమవారం వెల్లడిస్తామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. టీజేఎస్ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ప్రొఫెసర్ కోదండరాం, టీటీడీపీ నేత ఎల్ రమణతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి చర్చలు జరిపారు. తాజా సంప్రదింపులతో కూటమి చర్చలు తుదిదశకు చేరుకున్నాయని నేతలు తెలిపారు. డిసెంబర్ 12న తెలంగాణలో మహాకూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని ఉత్తమ్‌కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టడమే తమ కూటమి ధ్యేయమని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు, మైనారిటీలను మోసం చేసేందుకే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని విమర్శించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీచేసేందుకు కేసీఆర్ యోచిస్తున్నారన్నారు.
టీఆర్‌ఎస్ హయాంలో ఒక్క విద్యుత్, ఇరిగేషన్ ప్రాజెక్టు రాలేదని, ధనిక రాష్ట్రాన్ని అప్పులు పాలుచేశారని ఆరోపించారు. సానుకూల వాతావరణంలో కూటమి చర్చలు సాగుతున్నాయన్నారు. ఆశావహులు నిరాశ చెందకుండా పార్టీ విజయానికి కృషి చేస్తే నామినేటెడ్ పోస్టులు, మండలిలో అవకాశం కల్పిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment