సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో కాంగ్రెస్.. సామాజిక సమీకరణాలపై తర్జనభర్జన పడుతోంది. కూటమిపక్షాలు సూచిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాలను పరిగణనలోకి తీసుకుంటూనే సామాజిక వర్గాల వారీగా సీట్లను ఎవరికి కేటాయించాలన్న దానిపై కసరత్తు చేస్తోంది. మొత్తం 19 ఎస్సీ రిజర్వుడ్ స్థానాల్లో 12 స్థానాలు మాదిగలకు, 7 స్థానాలు మాలలకు కేటాయించాలని యోచిస్తున్న కాంగ్రెస్, జిల్లాల సమీకరణలు, ఆయా కులాల జనాభా ప్రాతిపదికన ఎక్కడ ఏ అభ్యర్థిని బరిలో నిలపాలన్న దానిపై విస్తృతంగా చర్చిస్తోంది.
రాష్ట్రంలో ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజక వర్గాల్లో ధర్మపురి, బెల్లంపల్లి, మానకొండూరు, చెన్నూర్, చొప్పదండి, జూకల్, అంధోల్, జహీరాబాద్, చేవెళ్ల, వికారాబాద్, కంటోన్మెంట్, స్టేషన్ ఘన్‌పూర్, వర్ధన్నపేట, మధిర, సత్తుపల్లి, తుంగతుర్తి, నకిరేకల్, ఆలంపూర్, అచ్చంపేట నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో కూటమిలో టీడీపీ, టీజేఎస్, సీపీఐలకు 5 నుంచి 6 స్థానాలు కేటాయించే అవకాశం ఉండగా, 13 లేక 14 స్థానాలు కాంగ్రెస్‌కు దక్కనున్నాయి. ఇందులో ఆంధోల్‌లో దామోదర రాజనర్సింహ, మధిరలో భట్టి విక్రమార్క, ఆలంపూర్‌లో సంపత్‌కుమార్, మానుకొండూర్‌లో ఆరేపల్లి మోహన్, జహీరాబాద్‌లో గీతారెడ్డి, వికారాబాద్‌లో గడ్డం ప్రసాద్‌కుమార్ వంటి సీనియర్ నేతలు ఉన్నందున అక్కడ కూటమి పక్షాలకు సీట్లు కేటాయించే పరిస్థితి లేదు.
మిగతా వాటిలో సత్తుపల్లిలో టీడీపీ సిట్టింగ్ స్థానం కావడంతో దాన్ని తిరిగి ఆ పార్టీకే కేటాయించే అవకాశం ఉంది. ఇవి పోనూ మిగతా స్థానాల్లో ఏ పార్టీకి ఏయే సీట్లు ఇవ్వాలి.. ఇక్కడ మాల, మాదిగ వర్గాల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలన్న దానిపై ఎడతెగని చర్చలు జరుగుతున్నాయి. వర్ధన్నపేట, జూకల్‌లో మాదిగ, తుంగతుర్తి, అచ్చంపేట, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో మాల సామాజిక వర్గ అభ్యర్థిని బరిలో నిలపాలని ఇప్పటికే కూటమి పక్షాలు ఓ నిర్ణయానికి వచ్చాయి. స్టేషన్ ఘన్‌పూర్, చొప్పదండి, కంటోన్మెంట్ విషయంలో ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలన్న దానిపై చర్చలు జరుగుతున్నాయి. పార్టీల తరఫున పోటీ పడుతున్న అభ్యర్థుల్లో ఎవరి బలమెంత.. ఏ మేరకు విజయవకాశాలు ఉంటాయన్న దానిపైనా బుధవారం సైతం కాంగ్రెస్ అధిష్టాన పెద్దలతో మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment