
పాల్వాయిపై వేటుకు సిఫారసు
హైదరాబాద్: సొంత పార్టీ నాయకులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డిపై వేటుకు రంగం సిద్ధమైంది. ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలంటూ టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ఏఐసీసీకి సిఫార్సు చేసింది. గాంధీభవన్‌లో నేడు జరిగిన టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. పాల్వాయికి కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందే షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మునుగోడు అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ రెబల్గా పోటీ చేసిన తన కూతురు స్రవంతి తరపున పాల్వాయి ప్రచారం చేయడంతో ఆయన ఇబ్బందుల్లో పడ్డారు.
అంతేకాకుండా ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి దిగ్విజయ్‌సింగ్, పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డిలే ప్రధాన కారణమని పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్‌తో పొత్తు పెట్టుకోవాలని, తెలంగాణ బిల్లులో ఆయనను భాగస్వామిని చేయాలని చెప్పినా వారు వినలేదని, కేసీఆర్ వస్తే వాళ్లకు సీఎం పదవి దక్కదనే దురాశతో వ్యతిరేకించారని ఆరోపణలు చేశారు.