కేసీఆర్ కుట్రకు మేం వ్యతిరేకం : శ్రవణ్
సాక్షి, హైదరాబాద్ :
ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్ కలిసి రైతులను మోసం చేసేవిధంగా చేసుకుంటున్న తప్పుడు ప్రచారాన్ని వ్యతిరేకిస్తున్నామని టీపీసీసీ అధికారప్రతినిధి దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు. కేసీఆర్‌కు వ్యవసాయ నాయకత్వ అవార్డును ప్రకటించిన ఐసీఎఫ్‌ఏకు మంగళవారం ప్రత్యుత్తరం రాశారు. ఈ లేఖను మీడియాకు శ్రవణ్ విడుదల చేశారు.
వ్యవసాయం సంక్షోభంలో ఉందని, రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. రుణమాఫీ చేయకుండా, రైతులను ఆదుకోకుండా, ఇన్‌పుట్ సబ్సిడీని అందించకుండా కేసీఆర్ రైతాంగాన్ని మోసం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి రైతుల వద్ద మంచి పేరు కొట్టేయడానికి ప్రైవేటు సంస్థ, వ్యాపార అవసరాలకోసం ఇచ్చిన అవార్డును కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డుగా చేస్తున్న ప్రచారాన్ని మాత్రమే వెల్లడించినట్టుగా శ్రవణ్ వివరించారు. ప్రధాన ప్రతిపక్షపార్టీగా మోసాల నుంచి కాపాడటం టీపీసీసీ బాధ్యత అని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కేంద్ర ప్రభుత్వమే ప్రతిష్టాత్మక గ్లోబల్ లీడర్ షిప్ అవార్డ్-2017ను ఎంపిక చేసినట్టుగా, దానిపై రాష్ట్ర గవర్నర్ అభినందించినట్టుగా తప్పుడు ప్రచారం చేసుకున్నారని విమర్శించారు. ఈ అవార్డును దుర్వినియోగం చేసుకుంటూ తెలంగాణ ప్రజలను వెర్రివాళ్లను చేసేవిధంగా వాడుకున్నారని శ్రవణ్ విమర్శించారు. రాష్ట్ర ప్రథమ పౌరుడు, రాజ్యాంగ రక్షకుడుగా ఉండాల్సిన గవర్నరు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తున్న మోసపూరిత ప్రచారంలో భాగమయ్యారన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకమని హెచ్చరించారు.
ఐసీఎఫ్‌ఏ అనే ప్రైవేటు కంపెనీ గురించి లోతుగా పరిశీలిస్తే చాలా అనుమానాలు వచ్చాయని, వాటిపైనే తాము మాట్లాడామన్నారు. రైతుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన స్వర్గీయ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డికి ఈ అవార్డును ఇచ్చామని పోల్చి చెప్పుకోవడం ఇక్కడ సరికాదన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి రుణ మాఫీ, ఉచిత విద్యుత్ వంటి రైతుల అభ్యున్నతికి అనేక పథకాలు చేపట్టారని, రైతు బాంధవునిగా పేరు సాధించిన వైఎస్‌తో రైతులకు మోసం చేస్తున్న కేసీఆర్‌కు పోలికా అని శ్రవణ్ ప్రశ్నించారు. పైగా ఐసీఎఫ్ఏ ప్రారంభమైందే 2015లో అయినప్పుడు 2008లోనే వైఎస్ ను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు.
గ్లోబల్ లీడర్ షిప్-2017 అవార్డు కోసం మీకు ఎన్ని దరఖాస్తులు అందాయి? అందుకు ఎంచుకున్న ప్రాతిపదిక ఏమిటి? కేసీఆర్ ను ఎంపిక చేయడంలో మీరెంచుకున్న ప్రత్యేక పథకాలేంటి? ఈ అవార్డు ప్రకటించే ముందు క్షేత్రస్థాయి పరిశీలన చేశారా? ఈ అవార్డును ప్రకటించడానికి కమిటీ ఎన్నిసార్లు సమావేశమైంది? ఎక్కడ సమావేశమైంది? అవార్డు కమిటీ నియమ నిబంధనలేంటి? వివరించాలని ఈ సందర్భంగా లేఖలో శ్రవణ్ కోరారు. 8 పేజీల లేఖ ప్రతులను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలతో పాటు టీపీసీసీ నేతలకు కూడా పంపినట్టు పేర్కొన్నారు.