కాలుతున్న ఫైటర్ విమానం, గాయపడిన పైలట్‌కు చికిత్స అందిస్తున్న వైద్యులు
కిలోమీటర్ దూరంలోనే బాహుపేట గ్రామం.. పక్కనే నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్– వరంగల్ జాతీయ రహదారి.. ఓ వెంచర్‌లో పనులు చేసుకుంటున్న పలువురు కూలీలు... ఈ క్రమంలోనే అకస్మాత్తుగా ఓ శిక్షణ విమానం పెద్దశబ్దంతో ఆ వెంచర్‌లోని నిర్మానుష్య ప్రదేశంలో కళ్లుమూసి తెరిచేలోపే కుప్పకూలింది. ఏం జరిగిందో తెలుసుకునేలోపే విమాన శకలాలు అల్లంతదూరాన పడ్డాయి. విమానం ఆనవాళ్లు లేకుండా కాలిబూడిదైపోయింది. ఉహించని ఘటనతో మండల పరిధిలోని బాహుపేట ఉలిక్కిపడింది. ప్రత్యక్ష సాక్షులు, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
యాదగిరిగుట్ట (ఆలేరు) : హైదరాబాద్ హకీంపేటలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌శిక్షణ కేంద్రానికి చెందిన ఫైటర్ విమానంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యోగేష్ యాదవ్ శిక్షణ తీసుకుంటున్నాడు. మరో 15 రోజులైతే శిక్షణ పూర్తి చేసుకునే దశలో యోగేష్ నడుపుతున్న ఫైటర్ విమానంలో హకీంపేట నుంచి బయలుదేరాడు. బాహుపేట సమీపంలోకి రాగానే.. బుధవారం ఉదయం సుమారు 11.40 గంటల ప్రాంతంలో యాదగిరిగుట్ట మండలం బాహుపేట సమీపంలోకి రాగానే ఫైటర్ విమానంలోని ఇంజన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఎయిర్ ఫోర్స్‌కు చెందిన అధికారులతో ఎప్పటికప్పుడు పైలట్ యోగేష్ యాదవ్ సమస్యకు సంబంధించిన వివరాలు అందిస్తూనే ఉన్నాడు.
విమానంలో తలెత్తిన సమస్య మరింత తీవ్రంగా మారింది. ఈ విషయాన్ని అధికారులకు తెలియజేసి, పైలట్ యోగేష్ యాదవ్ విమానంలో ఉన్న ప్యారాచూట్, ఇతర సామగ్రి సహాయంతో బయటికి దూకాడు. దీంతో సుమారు అర కిలోమీటర్ దూరంలోకి వెళ్లి విమానం భారీ శబ్దంతో కుప్ప కూలిపోయి.. పూర్తిగా దగ్ధమైంది. భారీగా మంటలు వ్యాపించడంతో స్థానిక ప్రజలు, వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై నుంచి వెళ్లె ప్రజలు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. సుమారు అర కిలోమీటర్ దూరంలో పడిపోయిన పైలెట్ యోగేష్ యాదవ్‌ను స్థానికులు వెళ్లి పరామార్శించారు. ఏం జరిగిందంటూ.. బాహుపేట సమీపంలో కుప్పకూలిన ఫైటర్ విమానం చూసి యాదగిరిగుట్ట, ఆలేరు మండలాల ప్రజలు ఒక్కసారిగా ఉలికిపడ్డారు.
శిక్షణ తీసుకుంటున్న పైలట్‌కు చెందిన ఫైటర్ విమానం సాంకేతిక లోపంతో కుప్పకూలిపోయింది.. అదే సయమంలో వివిధ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం కోసం ప్రముఖ నాయకులు అప్పుడే బహిరంగ సభలకు బయల్దేరిన హెలికాప్టర్ ఏమైనా కుప్పకూలిందా అనే సందేహాలు ప్రజల్లో నెలకొన్నాయి. ఇటీవల వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులు హెలికాప్టర్‌లో పర్యటనలు చేస్తున్నారు. బుధవారం అధికంగా ప్రముఖులు వివిధ ప్రాంతాలకు పర్యటించే క్రమంలో ఏమైన ప్రమాదం జరిగాందా అనే అనుమానంతో అధిక సంఖ్యలో ప్రజలు, వివిధ పార్టీల నాయకులు అధిక సంఖ్యలో చేరుకున్నా రు. శిక్షణ తీసుకుంటున్న విమానం కుప్పకూలిందని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అంతే కాకుండా ప్రమాదం జరిగిన ప్రదేశంలో కూడా ఎవరు లేకపోవడంతో ప్రాణహాని జరగలేదని అధికారులు తెలిపారు. ఘటనాస్థలిని పరిశీలించిన ఎయిర్‌ఫోర్స్ అధికారులు ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన అధికారులు సంఘటన స్థలానికి 15 నుంచి 20 నిమిషాల వ్యవధిలో చేరుకున్నారు. తొలుత హెలికాప్టర్‌లో ఆర్మీకి చెందిన వైద్యులు నలుగురు అక్కడికి చేరుకున్నారు. పైలెట్‌కు వైద్య పరీక్షలు చేసి, మెరుగైన చికిత్స నిమిత్తం హెలికాప్టర్‌లో తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు చేస్తున్న సమయంలోనే మరో హెలికాప్టర్ ఆకాశంలో నాలుగు సార్లు తిరిగి దిగింది. అందులో ప్రమాదం జరిగిన తీరును పరిశీలించడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన సాంకేతిక నిపుణులు వచ్చి అక్కడ ఖాళీ బూడిదైన శకలాలను పరిశీలించారు. అంతకు ముందే భువనగిరి ఏసీపీ జితేదర్‌రెడ్డి, యాదగిరిగుట్ట ఎస్‌ఐ రమేష్‌లు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించి, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.
గాయాలతో పైలెట్.. సెల్ఫీలతో యువకులు... శిక్షణ విమానంలో గాయాలైన పైలెట్‌ను రక్షించకుండా స్థానిక యువకులు సెల్ఫీ తీసుకున్నారు. కనీస మానవతాదృక్పథంతో ఆలోచించకుండా ఖాళీ బూడిదైన విమానం వద్ద, గాయాలై కిందపడిపోయిన పైలెట్ వద్దకు వెళ్లి కొందరు యువకులు సెల్ఫీలు తీసుకోవడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారీ శబ్దం వచ్చింది
మేము వెంచర్‌లో పనులు చేస్తున్నాం. అప్పుడే మా సార్ కారులో వస్తున్నాడు. ఒక్క సారిగా విమానం ఆకాశంలో నుంచి కిందకి వస్తుంటే అందులో నుంచి ఓ వ్యక్తి బెలున్ కట్టుకొని కిందకు దూకాడు. కళ్లు తెరచి మూసే లోపే భారీ శబ్దంతో విమానంలో భూమిపై పడిపోయింది.దీంతో భారీగా మంటలు వ్యాపించాయి. దానిని చూసి షాక్‌కు గురయ్యాం. భయమేసింది. నోట్లో నుంచి మాటలు కూడా రాలేదు. కొద్ది సేపటికి తేరుకొని చూసే సరికి జనమంతా సంఘటన స్థలానికి చేరుకున్నారు. కిందపడిన వ్యక్తితో మాట్లాడే ప్రయత్నం చేసిన.. భాష అర్థం కాలేదు. ఇలాంటి ప్రమాదం చూడడం ఇదే ప్రథమం. – నిర్మల, బాలలక్ష్మి, ప్రత్యక్ష సాక్షులు
Comments
Please login to add a commentAdd a comment