దాడిలో గాయపడ్డ ఉప్పుగూడ కార్పొరేటర్ ఫహద్ అబ్దుల్ సమద్‌ను పరామర్శిస్తున్న చార్మినార్ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ
చాంద్రాయణగుట్ట/చంచల్‌గూడ : సోషల్ మీడియా వదంతుల నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి నగరంలోని రెండుచోట్ల తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. చాంద్రాయణగుట్ట, మాదన్నపేట ఠాణాల పరిధిల్లో స్థానికేతరులపై జరిగిన ఘటనల్లో ఒకరు మరణించగా.. ఏడుగురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. చాంద్రాయణగుట్ట ఉదంతంలో స్థానికులు పోలీసులు, నేతలపైనా దాడిచేయడంతో పాటు పోలీసు వాహనాలు ధ్వంసం చేశారు. రెండు చోట్లా లాఠీచార్జి చేసిన పోలీసులు పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చారు. చాంద్రాయణగుట్ట ఉదంతాలకి సంబంధించి హత్య కేసు నమోదు చేసిన పోలీసులు 15 మందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు వెబ్‌చానల్ రిపోర్టర్లు ఉన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం బండకిందపల్లికి చెందిన చంద్రయ్య (52), అతని కుమారుడు రవి (25), స్వామి (45), నర్సింహులు (37) రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని హిజ్రాలుగా చెప్పుకొని భిక్షాటన చేసేందుకు సిటీకి వచ్చారు. ఆడ వారి మాదిరిగా వేషధారణ చేసుకునే వీరు కుటుంబ సభ్యులతో కలిసి శంషాబాద్‌లో గుడిసెలు వేసుకుని ఉంటున్నారు.
భిక్షాటన కోసం శనివారం రాత్రి తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌లో వచ్చి ఫలక్‌నుమా రైల్వేస్టేషన్‌లో దిగారు. రైల్వేస్టేషన్‌లోనే మహిళలుగా వస్త్రధారణ చేసుకొని ఫలక్‌నుమా ప్రధాన రహదారి నుంచి భిక్షాటన ప్రారంభించారు. ఒక రోడ్డులో చంద్రయ్య, స్వామి వెళుతుండగా.. మరో వైపు రోడ్డులో నర్సింహులు, రవి భిక్షాటన చేస్తున్నారు. రాత్రి 11.30 గంటల సమయంలో నర్సింహులు, రవి బాబానగర్ డీఎల్‌ఆర్‌ఎల్ ప్రహరీ పక్కన ఉన్న అజీమ్ హోటల్‌కి వెళ్లి యజమానిని డబ్బులు ఇవ్వాల్సిందిగా అడిగారు. రూ.5 ఇవ్వడంతో ఎక్కువగా ఇవ్వాలంటూ కొద్దిసేపు అక్కడే ఉండి వాగ్వాదానికి దిగారు. ఓ యువకుడు తన సెల్‌ఫోన్ తీసుకొని హోటల్ యజమాని వద్దకు వచ్చి పిల్లలను కిడ్నాప్ చేసే ముఠా వీరేనంటూ ఓ వీడియో చూపించాడు. ఇది చూసి అక్కడే ఉన్న మరో వ్యక్తి టైర్ తీసుకొని నర్సింహులు, రవిపై దాడికి దిగాడు. తమకేమి తెలియదంటూ వారు రోదిస్తూ రోడ్డు దాటే ప్రయత్నం చేశారు. ఈలోపు అటుగా వచ్చిన కొందరు యువకులు వారిని పట్టుకొని తీవ్రంగా కొట్టడం ప్రారంభించారు.
అతికష్టమ్మీద ఇద్దరు బాధితులూ తప్పించుకుని పరుగు తీస్తుండగా అక్కడకు వచ్చిన పోలీసులు వారిని రక్షించారు. నర్సింహులును చాంద్రాయణగుట్టలోని లైప్‌లైన్ ఆసుపత్రికి, రవిని కంచన్‌బాగ్ ఆస్పత్రికి తరలించారు. ఇంతలో రోడ్డుకు అవతల వైపు ఉన్న చంద్రయ్య, స్వామిని గమనించిన స్థానికులు వారిపై తవక్కల్ గుల్ మహాల్ వద్ద మూకుమ్మడిగా దాడి చేశారు. ఆగ్రహంతో అక్కడే ఉన్న బండరాళ్లను తీసుకొని వారి తలలపై మోదారు. తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయిన వారిని పోలీసులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులపై సైతం దాడికి పాల్పడ్డారు. అతికష్టం మీద పోలీసులు పెట్రోలింగ్ కారులో ఎక్కించుకొని ఆసుపత్రికి తరలిస్తుండగా కారుకు అడ్డు తగిలి అద్దాలు పగులకొట్టి మరీ పోలీసులను కూడా చితకబాదారు.
ఎట్టకేలకు పోలీసులు వారిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చంద్రయ్య ఆదివారం తెల్లవారుజామున 3.25 గంటలకు మృతి చెందాడు. స్వల్ప గాయాలకు గురైన చం ద్రయ్య కుమారుడు రవి ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయ్యాడు. మిగిలిన ఇద్దరు బాధితులు స్వామి, నర్సింహులులకు తీవ్రగాయాలు కావడం తో ఇంకా ఉస్మానియాలోనే చికిత్స పొందుతున్నారు. స్వామి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు హత్య సహా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 15 మంది బా«ధ్యుల్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు, కార్పొరేటర్ పైనా దాడులు...
హిజ్రాల రూపంలో ఉన్న వ్యక్తులపై దాడి జరుగుతోందన్న విషయాన్ని తెలుసుకున్న కంచన్‌బాగ్ ఇన్‌స్పెక్టర్ ఎన్.శంకర్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకొని వారిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. పిల్లలను కిడ్నాప్ చేసే వారిని ఎలా కాపాడుతారంటూ ఒక్కసారిగా వందలాదిగా ఉన్న యువకులపై పోలీసులపై పడిపోయారు. ఈ ఘటనలో కంచన్‌బాగ్ ఇన్‌స్పెక్టర్‌తో పాటు కానిస్టేబుళ్లు అతికష్టం మీద బయటపడ్డారు. పిల్లల ప్రాణాలను తీసేవారిని పోలీసులు ఎలా కాపాడుతారంటూ వందలాది యువకులు చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసేందుకు యత్నించారు. సహాయక చర్యలకు దిగిన ఉప్పుగూడ కార్పొరేటర్ ఫహద్ అబ్దుల్ సమద్‌పై కూడా ఆందోళన కారులు దాడి చేశారు. వెంటనే అక్కడే ఉన్న మజ్లీస్ కార్పొరేటర్లు అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న చార్మినార్ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని యువకులకు సూచించారు. దొంగల గ్యాంగ్‌లు తిరుగుతున్నారన్న వదంతులలో వాస్తవం లేదన్నారు. అనంతరం ఆయన గాయపడ్డ కార్పొరేటర్‌ను పరామర్శించారు.
మాదన్నపేటలో మరో నలుగురిపై...
చంద్రాయణగుట్ట గొడవ సద్దుమణగక ముందే మాదన్నపేటలో ఇదే తరహా ఉదంతం జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కృష్ణ (25), ఈశ్వర్ (22), ఆంజనేయులు (26), శంకర్ (28) హైదరాబాద్‌కు వచ్చి హిజ్రాల వేషంలో ఉదయం వేళల్లో భిక్షాటన చేస్తుంటారు. ఈ క్రమంలో వేషం తీసిన తరువాత రాత్రి వేళ యాకత్‌పురా రైల్వే స్టేషన్‌లో నిద్రించారు. రైల్వే పోలీస్‌లు వారిని అక్కడ నుంచి వెళ్ళగొట్టగా చావణి శాంతి నగర్ మీదుగా వీరు నడుచుకుంటూ వెళుతున్నారు. ఆ సమయంలో స్థానిక యువకులు కొందరు అనుమానం వచ్చి వారిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. పోలీసులు అక్కడకు చేరుకున్న సమయంలో అప్పటికే యువకులు పెద్ద ఎత్తున గుమికూడారు. ఈక్రమంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పరిస్థితి అదుపులోకి రాకపోవటంతో టాస్క్‌ఫోర్స్ పోలీస్‌లు అక్కడకు చేరుకుని అల్లరి మూకను చెదరగొట్టారు. బాధితులు మాదన్నపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నగేశ్ తెలుపారు. నిందితులను గుర్తించేందుకు పోలీస్‌లు ఘటన స్థలంలోని సీసీ కెమేరాల ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. డీసీపీ సత్యనారాయణ ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment