జిల్లా కలెక్టర్లకు సీఎస్ రాజీవ్‌శర్మ ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల్లో కలెక్టర్, ఎస్పీ, అన్ని శాఖలు తమ కార్యకలాపాలు ప్రారంభించేలా సన్నాహక చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఆఫీసులకు అవసరమైన భవనాలను గుర్తించి, అవసరమైన ఫర్నీచర్‌ను సమకూర్చాలని చెప్పారు. కొత్త జిల్లాలు ఏర్పడ్డ తొలిరోజు నుంచే ట్రెజరీ అకౌంట్లను ప్రారంభించి, ట్రెజరీ కార్యాలయాలు పని చేసేలా చూడాలని ఆదేశించారు. కొత్త జిల్లాల్లో ఉద్యోగులను సర్దుబాటు చేసేటప్పుడు పదోన్నతులకు సంబంధించి పాత సీనియారిటీనే కొనసాగుతుందని స్పష్టం చేశారు. దాని ఆధారంగానే పదోన్నతులు వస్తాయని ప్రకటించారు. జిల్లాలో వివిధ శాఖల్లో పని చేస్తున్న సిబ్బంది వివరాలు, సీనియారిటీ, పోస్టుల సంఖ్య వివరాలను వెంటనే పంపించాలని ఆదేశించారు.
కొత్త జిల్లాలకు సంబంధించిన ఫైళ్లను వర్గీకరించి, క్రమ పద్ధతిలో ఆయా జిల్లాలకు అందించాలని చెప్పారు. ఫైళ్ల వివరాలను నమోదు చేయడానికి కొత్త జిల్లాలకు ఏర్పాటు చేసిన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించాలని సూచించారు. కొత్త జిల్లాలకు కావాల్సిన ఉద్యోగులు, ఫర్నీచర్, ఫైళ్లు, వసతి సదుపాయాలు తదితర అంశాలపై సీఎస్ మంగళవారం సచివాలయం నుంచి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో పంచాయతీరాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, రాజకీయ ముఖ్య కార్యదర్శి అదర్‌సిన్హా, అటవీశాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, ఆర్ అండ్ బీ శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్ పాల్గొన్నారు.
కొత్త జిల్లాల్లో తొలి రోజే ట్రెజరీలు
Published Wed, Aug 31 2016 3:01 AM | Last Updated on Mon, Sep 4 2017 11:35 AM
Advertisement