
సాక్షి, మహబూబాబాద్ : ఆర్టీసీ కార్మికులు యూనియన్ నాయకుల ఉచ్చులో పడవద్దని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ విజఒప్తి చేశారు. మంగళవారం స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఎంపీ మాలోతు కవితతో కలిసి ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘తెలంగాణలో 91 కార్పొరేషన్లు ఉన్నాయి. ఒక్క ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే అనేక సమస్యలు వస్తాయి. 5100 ప్రైవేటు బస్సులను ప్రవేశపెట్టింది ప్రజల ఇబ్బందులు తొలగించడానికే. గత ప్రభుత్వాలు చిరుద్యోగుల విషయంలో చేసిన అనేక తప్పులను సవరించి వారికి జీతాలు పెంచిన గొప్ప వ్యక్తి కేసీఆర్. సమ్మె చేయడానికి ఇది సరైన సమయ కాదు. నేటితో కార్మికులకు ఇచ్చిన గడువు ముగుస్తుంది. కార్మికులు వెంటనే విధుల్లో చేరాలి. ప్రజల మద్దతు ఆర్టీసీ కార్మికులకు లేదు అనడానికి హుజూర్‌నగర్ ఉప ఎన్నికలే నిదర్శనం.
సీఎం ఎక్కడో ఉండి పిలుపునిచ్చినా ప్రజలు 43 వేల భారీ మెజార్టీతో గెలిపించారు. బీజేపీ రోడ్ల మీద చిల్లర రాజకీయాలు చేస్తోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయలేదు. తహసీల్దార్ విజయారెడ్డి హత్యను ఖండిస్తున్నా. దోషులను కఠినంగా శిక్షిస్తామ’ని వెల్లడించారు. ఎంపీ కవిత మాట్లాడుతూ.. ఎంతో అనుభవం ఉన్న సీఎం కేసీఆరకు రాష్ట్ర ప్రజలకు ఎప్పుడు ఏం చేయాలో తెలుసని అభిప్రాయపడ్డారు. అశ్వత్థామ రెడ్డి కార్మికుల పుణ్యమా అని హైలెట్ అవుతున్నాడని విమర్శించారు. కేసీఆర్ పార్టీలను చూసి పనిచెయ్యడు. ప్రజలను చూసి పని చేస్తాడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ బిందు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఇతర నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment