సాక్షి, నెట్‌వర్క్: మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ప్రజలు ఘనంగా నివాళులు అర్పించారు. ఏపీ, తెలంగాణతో పాటు విదేశాల్లోని ఆయన అభిమానులు వైఎస్ సేవలు గుర్తు చేసుకున్నారు. వైఎస్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. వివిధ ప్రాంతాల్లో అన్నదాన, ఉచిత వైద్య, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యక్తిత్వం అందరికీ ఆదర్శప్రాయమని శాసనమండలి విపక్షనేత డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కొనియాడారు.
హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు వైఎస్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఉమ్మారెడ్డి మాట్లాడుతూ పేదలను ఆదుకోవాలని ఆయన నిరంతరం తపన పడేవారన్నారు. ఆ ఆలోచనల నుంచి పుట్టినవే ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలని చెప్పారు.
వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ కోటి ఎకరాలకు నీరు ఇవ్వాలని కలలు కన్న మహానుభావుడు వైఎస్సార్ అని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు పి. సుధాకర్‌రెడ్డి, వాసిరెడ్డి పద్మ, పద్మజ, పుత్తా ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విజయవాడలోని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో వైఎస్ విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment