సాక్షి, పెద్దపల్లి : డబుల్ షూటర్లు.. ఎన్‌కౌంటర్ స్పెషలిస్టులు.. డబుల్ మర్డర్ దాదాల గురించి విన్నాం. ఈ ఎన్నికల్లో ట్రిపుల్ షూటర్ల గురించి చర్చమొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉన్న నియోజకవర్గాలకు ట్రిపుల్ షూటర్ల పాత్ర అయోమయాన్ని సృష్టిస్తోంది. ప్రతిష్టాత్మకంగా మారిన పెద్దపల్లి అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులకు చోటామోటా నాయకుల బెడద తలనొప్పిగా మారింది. టీఆర్‌ఎస్ నుంచి దాసరి మనోహర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి విజయ రమణారావు, బీజేపీ నుంచి గుజ్జుల రామకృష్ణారెడ్డి పోటీ చేస్తున్నారు. అభ్యర్థులు తమ జాతకాన్ని పరీక్షించుకునే క్రమంలో ఛోటామోటా నాయకుల మాట కాదనలేకపోతున్నారు. అయితే వీరు పొద్దున ఓ నాయకుడు.. మధ్యాహ్నం మరో నాయకుడితో కలిసి వెళ్తుండడం అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తోంది. అంతేకాదు.. సీక్రెట్‌గా సపోర్ట్ చేస్తామంటూ ఎక్కడిక్కడ చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారు.
మారుతున్న పరిణామాలు..
మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా అటూఇటూ ఉండే నాయకులు వ్యూహాలు మార్చుతున్నారు. పార్టీలు మార్చుతున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి శిబిరం నిత్యం చేరికలతో కళకళలాడుతోంది. ప్రచారానికి వెళ్తున్న సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయరమణారావు, బీజేపీ అభ్యర్థి గుజ్జులకూ విశేష స్పందన లభిస్తోంది. గ్రామాల్లో ఎన్నికల ప్రచారం సమయంలో
విజయ్ వెంట వందల సంఖ్యలో వస్తున్నారు. చేరికలూ సాగుతున్నాయి. ఎన్నికల ప్రచార యాత్రతో మూడు పార్టీలు హోరెత్తిస్తున్నాయి. అయితే చోటామోటా నాయకులు ఎవరికి వారుగా వ్యవహరిస్తున్నారు.
దాసరి వద్ద ..
తాజా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డికి సపోర్ట్ చేస్తామంటున్న వారంతా నాలుగున్నరేళ్ల కాలం పనితీరును ప్రస్తావిస్తూ ఆయనకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. గుంపులుగా యువకులను తెచ్చి చేర్పిస్తున్నారు. మీరు వేయించిన రోడ్లు, ఇచ్చిన సంక్షేమ పథకాలు, కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్, పింఛన్లు, రైతుబంధు ఇలాంటి ఎన్నో ప్రయోజన స్కీంలు లక్షా 20 వేల మందికి ఇచ్చామని, అందులో లక్ష ఓట్లు పడ్డా తమదే గెలుపంటూ మద్దతు పలికే మాటలతో తమ అవసరాన్ని తీర్చుకుంటున్నారు.
విజయ్ వద్ద..
ఎస్సారెస్పీ నీళ్లొచ్చాయి.. ఆస్పత్రిలో చేరితే వచ్చి పలుకరించావు.. ఫోన్‌చేస్తే ఇంటికొచ్చావు.. ఇప్పుడు నేనెక్కడున్నానని కాదు.. మరో వారం ఆగితే మీవెంటే నడుస్తానంటూ.. సూక్తులు చెబుతున్నారు. రేపు రాత్రికి కలుస్తా, లేదంటే తెల్లవారక ముందు కలుస్తా. నీ గెలుపు కోసం నా వంతు పనిచేస్తా అంటూ హామీలిస్తూ నమ్మబలుకుతున్నారు.
గుజ్జుల వద్ద...
పోటీ పడుతున్న మరో అభ్యర్థి గుజ్జుల వద్ద మెప్పు పొందేందుకు ట్రిపుల్ షూటర్లు ప్రయత్నిస్తున్నారు. మీ పరిపాలనలో బ్రిడ్జీలు కట్టారు. మేమేం పని చెప్పినా చేసి పెట్టారు.. మా ఊరికి రోడ్లు మీరే వేయించారు.. మిమ్ముల్ని మరిచిపోతామా.. బేఫికర్‌గా ఉండండి.. ఆఖరునాడు చూడు అంతా మనకే అనుకూలమవుతుందంటూ ప్రత్యర్థి శిబిరంలో కనిపిస్తున్నారు.
అయోమయం..
అటూఇటూ ఉంటున్న వారితీరు ఆసక్తిగా మారింది. అయితే తన వారు ఎవరు, మన వారు ఎవరు.. డబుల్ షూటర్‌ను మించిన వారు ఎవరో తేల్చుకోలేక అభ్యర్థులు.. నాయకులు తలలు పట్టుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment