‘గులాబీ’ బలోపేతం! | trs aim is heavily member | Sakshi
Sakshi News home page

‘గులాబీ’ బలోపేతం!

Published Sat, Feb 7 2015 12:55 AM | Last Updated on Tue, Aug 14 2018 2:50 PM

trs aim is heavily member

భారీగా సభ్యత్వ నమోదు లక్ష్యం
నియోజకవర్గాలవారీగా  ప్రత్యేక కార్యాచరణ
ఉప ఎన్నికలు, మేయర్ పీఠం  లక్ష్యంగా వ్యూహం
రేపు టీఆర్‌ఎస్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం

 
 వరంగల్ : తెలంగాణ రాష్ట్ర సమితి సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించింది. రాష్ట్రంలో తిరుగులేని పార్టీగా ఎదిగేందుకు తాజాగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తోంది. సంస్థాగతంగా ఇన్నాళ్లు టీఆర్‌ఎస్‌కు అన్ని గ్రామాల్లో బలమైన పునాదులు లేవు. సాధారణ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన టీఆర్‌ఎస్.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ మేరకు విజయం నమోదు చేసుకోలేదు. రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు భారీగా టీఆర్‌ఎస్‌లో చేరారు. అధికారంలో ఉన్న పార్టీగా ఇప్పుడున్న అనుకూలతను పార్టీ పటిష్టత కోసం వినియోగించుకోవాలని టీఆర్‌ఎస్ అధిష్టానం  భావిస్తోంది. ముఖ్యంగా టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి సాధారణ ఎన్నికల్లో గణనీయ విజయాలు నమోదు చేసుకున్న పార్టీగా గ్రామాల్లోనూ ఇదే స్థాయిలో బలపడేందుకు ప్రయత్నిస్తోంది. పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియతో దీని కి శ్రీకారం చుట్టింది. సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేలోపు జిల్లాలోనే ఎక్కువ మంది కార్యకర్తలు ఉన్న పార్టీగా ఆవిర్భవించాలని టీఆర్‌ఎస్ ప్రణాళిక సిద్ధం చేసిం ది. రాష్ట్ర పార్టీ నాయకత్వం ఆదేశాల మేరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 25 వేల మందిని సాధారణ కార్యకర్తలుగా, 5 వేల మందిని క్రియాశీల కార్యకర్తలుగా చేర్చించాలని లక్ష్యంగా పెట్టుకుంది. జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ లక్ష్యాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసేం దుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
 
ఉప ఎన్నికలకు సన్నద్ధం

ప్రస్తుతం జరుగుతున్న సంస్థాగత ఎన్నికల ప్రక్రియను ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం వినియోగించుకోవాలని టీఆర్‌ఎస్ జిల్లా పార్టీ భావిస్తోంది. వరంగల్ ఎంపీగా ఉన్న కడియం శ్రీహరి ఇటీవలే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కడియం శ్రీహరి ఆరు నెలల్లోపు వరంగల్ ఎంపీ స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుం ది. దీంతో ఉప ఎన్నిక అనివార్యం కానుంది. అధికారంలో ఉన్న పార్టీగా టీఆర్‌ఎస్‌కు ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా ఉండనుంది. వరంగల్ లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల సంస్థాగత ఎన్నికల విషయంలో టీఆర్‌ఎస్ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్లాలని భావిస్తోంది. మరోవైపు గ్రేటర్ వరంగల్ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. నగరంలో టీఆర్‌ఎస్‌కు అన్ని డివిజన్లలో పటిష్టమైన సంస్థాగత బలం లేదు. గ్రేటర్ ఎన్నికల్లో విజయం కోసం సంస్థాగత ఎన్నికలు చక్కగా ఉపయోగపడతాయని టీఆర్‌ఎస్ నగర పార్టీ భావిస్తోంది. గ్రేటర్ వరంగల్ మేయర్ పీఠం లక్ష్యంగా ఈ ప్రక్రియను నడిపిస్తోంది.

విజయవంతం చేయాలి :  తక్కళ్లపల్లి రవీందర్‌రావు, నరేందర్

టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం ఆదివారం జరగనుంది. కాకతీయ మెడికల్ కాలేజీ ఆవరణలోని ఎన్‌ఆర్‌ఐ ఆడిటోరియంలో ఉంటుం దని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, నగర పార్టీ అధ్యక్షుడు నన్నపనేని నరేందర్ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్, పార్లమెంటరీ కార్యదర్శి దాస్యం వినయభాస్కర్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దల పద్మ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారని చెప్పారు. టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు పరిశీలన కోసం రాష్ట్ర పార్టీ ప్రతినిధులుగా పెద్ది సుదర్శన్‌రెడ్డి, జి.బాలమల్లు, సత్యవతి రాథోడ్, కె.రాజయ్యయాదవ్ ఈ సమావేశానికి వస్తున్నారని తెలిపారు. ఆదివారం ఉదయం 11 గంటలకు కార్యక్రమం మొదలవుతుందని చెప్పారు. ఈ సమావేశానికి టీఆర్‌ఎస్ జిల్లా పార్టీ ముఖ్యనేతలు, జెడ్పీటీసీ సభ్యులు, మండల పరిషత్ అధ్యక్షులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, పార్టీ ప్రతినిధులు హాజరుకావాలని వారు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement