సాక్షి, కొడకండ్ల: రాష్ట్ర అభివృద్ధి, పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సుపరిపాలన అందించిన టీఆర్‌ఎస్ పార్టీకి పాలకుర్తి ప్రజలు అండగా నిలవాలని పాలకుర్తి నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కుందూరు వెంకటేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన రేగులతండా, హక్యతండా, జీబీ తండా, కడగుట్ట తండా, రామేశ్వరంలో ఆదివారం జరిగిన తండాబాట ప్రచార కార్యక్రమంలో ఎర్రబెల్లి పాల్గొని మాట్లాడారు.
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించాక 60 ఏళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగింది శూన్యమన్నారు. నాలుగేళ్ల టీఆర్‌ఎస్ పరిపాలనలో ఎన్నో ప్రజారంజక పథకాలను అమలు చేసి పేదల సంక్షేమానికి బాటలు వేసిన ఘనత సీఎం కేసీఆర్ సారథ్యంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చి సంక్షేమ మహానీయుడిగా కేసీఆర్ ఖ్యాతి గడించాడన్నారు. తాను ఎమ్మెల్యేగా గడిచిన ఎనిమిదేళ్లలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయానని, టీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాతనే రెండేళ్లలో పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.
తనపై ఎనలేని విశ్వాసంతో కష్టకాలంలో అండగా నిల్చిన పాలకుర్తి ప్రజలు మూడోసారి అండగా నిల్చి ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి గిరిజనుల చిరకాల వాంఛను నెరవేర్చడంతోపాటు 12 శాతం రిజర్వేషన్ కల్పించేందుకై అసెంబ్లీలో తీర్మానించి కేంద్రానికి పంపినట్లు గుర్తు చేశారు. ప్రజలకు మాట ఇస్తే కట్టుబడి నిలబడే గుణం తనదని, చైతన్యం, విజ్ఞత కలిగిన పాలకుర్తి ప్రజలు మంచి చెడులు ఆలోచించి ప్రత్యర్థికి డిపాజిట్ దక్కకుం డా నియోజకవర్గ అభివృద్ధి కోసం తనను భారీ మెజార్టీతో గెలిపించినట్లయితే నిత్యం అందుబాటులో ఉంటానని ఎర్రబెల్లి హామీ ఇచ్చారు.
కేసీఆర్‌తోనే సాగునీటికి మోక్షం:మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌రావు
గత కాంగ్రెస్ పాలనలో సాగునీటి రంగానికి చేసింది శూన్యమని, కేసీఆర్ అధికారం చేపట్టాకే సాగునీటి రంగానికి పెద్దపీట వేశారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్‌రావు అన్నారు. పదేళ్ల పాలనలో సాగునీరందించక పంటలను కాంగ్రెస్ ఎండపెడితే సాగునీటితో గ్రామాల్లో జలకళతో సస్యశ్యామలం చేసిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. కార్యక్రమంలో జీసీసీ చైర్మన్ గాంధీనాయక్, జెడ్పీటీసీ బాకి లలితప్రేమ్‌కుమార్, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యుడు సిందె రామోజీ, మండల కన్వీనర్ ధీకొండ వెంకటేశ్వర్‌రావు, ఎంపీటీసీలు విజయ, సుభద్రకోక్యానాయక్, నాయకులు జక్కుల విజయమ్మ, పేరం రాము, పసునూరి మధుసూదన్, అందె యాకయ్య, అమరేందర్‌రెడ్డి, హసిఫ్, కుమార్‌గౌడ్, ఉప్పల్‌రెడ్డి, సోమేశ్వర్‌రావు, రాజిరెడ్డి, సత్యనారాయణ, సోమ రాములు, పాండురంగం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment