ఊరూరా కాళేశ్వరం సంబురాలు | TRS Decides To Hold Kaleshwaram Festivals On June 21st | Sakshi
Sakshi News home page

ఊరూరా కాళేశ్వరం సంబురాలు

Published Thu, Jun 20 2019 2:43 AM | Last Updated on Thu, Jun 20 2019 8:32 AM

TRS Decides To Hold Kaleshwaram Festivals On June 21st - Sakshi

బుధవారం తెలంగాణ భవన్‌లో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: ‘ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ దశల సాగునీటి ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరం. అంతర్‌ రాష్ట్ర వివాదాలు పరిష్కరించి, అందరూ ఆశ్చర్యపోయేలా.. కేవలం మూడేళ్ల రికార్డు సమయంలో ప్రాజెక్టు పనులను పూర్తి చేసిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదే. ఈ ప్రాజెక్టు ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంది. ఈ నెల 21న ప్రారంభోత్సవం జరుపుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోనుంది. ఈ చారిత్రక సందర్భాన్ని ఊరూరా పండుగ వాతావరణంలో నిర్వహించుకోవాలి’అని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ కార్యవర్గాన్ని ఉద్దేశించి సుమారు గంట పాటు ప్రసంగించిన కేసీఆర్‌.. ఉద్యమ సమయంలో పార్టీ ప్రస్థానం సాగిన తీరును పునశ్చరణ చేశారు. పార్టీ సంస్థాగత నిర్మాణం జరగాల్సిన తీరుపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరుగుతున్న నేపథ్యంలో గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా రైతులతో కలసి.. భారీ ఎత్తున సంబురాలు నిర్వహించాల్సిందిగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.  

వ్యవస్థాగత నిర్మాణంతోనే పార్టీ మనుగడ... 
టీఆర్‌ఎస్‌ 2001లో ప్రస్తానం మొదలు పెట్టినప్పటి నుంచి 2019 వరకు సాగించిన ప్రస్థానాన్ని వివరిస్తూ.. రెండు దశాబ్దాల్లో తెలంగాణ ప్రజలకు పార్టీ రక్షణ కవచంగా మారిందని కేసీఆర్‌ అన్నారు. ‘పార్టీ ఖాతాలో ప్రస్తుతం రూ.255 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. వీటిపై రూ.1.25 కోట్ల మేర వడ్డీ రూపంలో ఆదాయం వస్తోంది. తమిళనాడులో డీఎంకే పార్టీకి రూ.6 వేల కోట్ల ఆస్తులున్నాయి. పార్టీలో ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు తరాల పాటు సభ్యులుగా కొనసాగుతుండటంతో అక్కడ డీఎంకే దశాబ్దాల తరబడి బలమైన రాజకీయ శక్తిగా ఉంది’అని వెల్లడించారు. తమిళనాడులో జాతీయ పార్టీలను దశాబ్దాలుగా అక్కడి ప్రజలు దూరంగా పెడుతున్న తీరును ప్రస్తావించారు. పార్టీ శాశ్వతంగా బలోపేతం కావాలంటే ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు.. పార్టీ కూడా వ్యవస్థీకృతంగా బలపడాలని అన్నారు.

దేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల మనుగడ, పనితీరుపై తన అధ్యయనంలో వెల్లడైన అంశాలను పార్టీ కార్యవర్గంతో పంచుకున్నారు. జార్ఖండ్‌ ముక్తి మోర్చా, అసోం గణ పరిషత్‌ తదితర పార్టీల ప్రస్థానాన్ని వివరిస్తూ.. పార్టీకి ఆస్తులు, ఆర్థిక వనరులు, సంస్థాగత నిర్మాణం ఉంటేనే దీర్ఘకాలం మనుగడ సాగిస్తుందన్నారు. ప్రభుత్వానికి పార్టీ సమాంతరంగా ఎదగాల్సిన అవసరాన్ని నేతలకు కేసీఆర్‌ వివరించారు. ‘ఎస్సీల సంక్షేమానికి మరిన్ని కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. అదే సమయంలో రాష్ట్ర జనాభాలో ఎక్కువ సంఖ్యలో ఉన్న బీసీలకు కూడా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో మరింత ప్రాధాన్యత ఇస్తాం. ఇప్పటికే విద్యుత్, తాగునీటి సమస్యలను పరిష్కరించాం. సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే అభివృద్ధి, సంక్షేమంతో పాటు ఇతర అంశాలపై మరింత దృష్టి పెట్టేందుకు అవకాశం ఉంటుంది’అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.  

అందరినీ కాపాడుకుంటాం.. ఎవరినీ రోడ్డున పడేయం‘ 
‘సభ్యత్వ నమోదు, సంస్థాగత శిక్షణ కార్యక్రమాలతో పాటు మున్సిపల్‌ ఎన్నికలపైనా పార్టీ నేతలు దృష్టి పెట్టండి. సహకార ఎన్నికలు కూడా నిర్వహించాల్సి ఉన్నా.. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యతను నేతలు తీసుకోవాలి. పార్టీ కోసం కష్టపడే అందరినీ కాపాడుకుంటాం. ఎవరినీ రోడ్డున పడేయం. నామినేటెడ్‌ పదవులతో పాటు ఇతర అవకాశాలను కల్పిస్తాం. ఎవరూ అ«ధైర్యంతో ఆత్మ విశ్వాసం కోల్పోవద్దు’అని కేసీఆర్‌ పార్టీ నేతలకు భరోసా ఇచ్చారు. 

ఈ నెల 24న పార్టీ కార్యాలయాలకు శంకుస్థాపన 
ఖమ్మం మినహా రాష్ట్రంలోని మిగతా 32 జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణానికి సంబంధించి కేసీఆర్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కీలక ప్రకటన చేశారు. ఈ నెల 24న అన్ని జిల్లా కేంద్రాల్లోనూ పార్టీ కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమం ఏకకాలంలో నిర్వహించాలని నిర్ణయించారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా మినహా.. 31 జిల్లా కేంద్రాల్లో పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణానికి మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో స్థలం కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ చోటా ఎకరా స్థలం ఇవ్వగా, బుధవారం జరిగిన రాష్ట్ర కార్యవర్గ భేటీలో పార్టీ కార్యాలయాల నిర్మాణానికి రూ.19.20 కోట్లు కేటాయించాలనే కేసీఆర్‌ ప్రతిపాదనను రాష్ట్ర కార్యవర్గం ఆమోదించింది. 24న భూమి పూజతో మొదలయ్యే భవన నిర్మాణ పనులు దసరా నాటికి పూర్తి చేయాలని గడువు నిర్దేశించారు. జిల్లాల వారీగా పార్టీ కార్యాలయాల నిర్మాణ బాధ్యతను ఎంపిక చేసిన బాధ్యులకు అప్పగిస్తారు. ఈ నెల 24న జిల్లాల వారీగా బా«ధ్యుల జాబితాను కూడా విడుదల చేసి, నిధుల వ్యయం భాధ్యతను వారికే అప్పగిస్తారు. త్వరలో నియోజకవర్గ స్థాయిలోనూ పార్టీ కార్యాలయాలను నిర్మించే యోచనలో ఉన్నట్లు కేసీఆర్‌ వెల్లడించారు. 

27 నుంచి సభ్యత్వ నమోదు... 
సభ్యత్వ నమోదుతో పాటు పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపైనా కేసీఆర్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పలు సూచనలు చేశారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో ఈ నెల 27న పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తారు. అదే రోజు సచివాలయం, అసెంబ్లీ భవనాలకు భూమి పూజ చేసిన అనంతరం ఈ భేటీ జరుగుతుంది. ఈ సందర్భంగా పార్టీ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో పాటు ముఖ్యనేతలు పార్టీ సభ్యత్వం స్వీకరిస్తారు. జూలై 20 నాటికి సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రతీ 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకరు చొప్పున.. రాష్ట్ర కార్యవర్గంలోని నేతలకు సమన్వయ బాధ్యతలు అప్పగిస్తారు. నియోజవర్గాల వారీగా సభ్యత్వ నమోదు ఇన్‌చార్జీల పేర్లను ఈ నెల 27న ప్రకటిస్తారు. సభ్యత్వ నమోదు ప్రక్రియ ముగిసిన తర్వాత జూలై నెలాఖరుకు గ్రామకమిటీల ఏర్పాటు పూర్తి చేస్తారు. కొత్తగా ఏర్పాటైన పార్టీ కమిటీలకు శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. 

మోదీ సమావేశం నేపథ్యంలో ఢిల్లీకి కేటీఆర్‌... 
ఢిల్లీలో బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన అఖిల పక్ష సమావేశానికి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ వెళ్లడంతో కార్యవర్గ సమావేశానికి హాజరుకాలేదు. మంగళవారం జరిగిన కేబినెట్‌ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన కేసీఆర్‌.. రాజకీయ అంశాలపై బుధవారం కార్యవర్గ సమావేశం అనంతరం స్పందిస్తానని ప్రకటించారు. అయితే పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం గవర్నర్‌తో కేసీఆర్‌ భేటీ నేపథ్యంలో.. కార్యవర్గంలో చర్చించిన అంశాలను పార్టీ విప్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ఇతర నేతలు మీడియాకు వెల్లడించారు. 21న కాళేశ్వరం ప్రారంభోత్సవం సందర్భంగా ఊరూరా సంబురాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు శ్రీనివాస్‌రెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు, సత్యవతి రాథోడ్‌తో పాటు పార్టీ నేతలు తులా ఉమ, గుండు సుధారాణి, లింగంపల్లి కిషన్‌రావు, తాడూరు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు అభినందన 
టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తూ.. ఇటీవల చట్టసభలకు ఎన్నికైన నేతలను సీఎం కేసీఆర్‌ అభినందించారు. ఎంపీలుగా ఎన్నికైన రాములు (నాగర్‌కర్నూలు), మాలోత్‌ కవిత (మహబూబాబాద్‌), ఎమ్మెల్సీలుగా ఎన్నికైన శేరి సుభాశ్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, జడ్పీ చైర్మన్లుగా ఎన్నికైన దాదన్నగారి విఠల్‌రావు, వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ ఈ జాబితాలో ఉన్నారు. చట్టసభలకు ఎన్నికైన పార్టీ నేతలు ప్రజా సేవలో మంచి పేరు తెచ్చుకోవాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు. 

పార్టీ ఖాతాలో రూ.255 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. వీటిపై రూ.1.25 కోట్ల మేర వడ్డీ రూపంలో ఆదాయం వస్తోంది. తమిళనాడులో డీఎంకే పార్టీకి రూ.6 వేల కోట్ల ఆస్తులున్నాయి. పార్టీలో ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు తరాల పాటు సభ్యులుగా కొనసాగుతుండటంతో అక్కడ డీఎంకే దశాబ్దాల తరబడి బలమైన రాజకీయ శక్తిగా ఉంది. 
సభ్యత్వ నమోదు, సంస్థాగత శిక్షణ కార్యక్రమాలతో పాటు మున్సిపల్‌ ఎన్నికలపైనా నేతలు దృష్టి పెట్టండి. పార్టీ కోసం కష్టపడే అందరినీ కాపాడుకుంటాం. ఎవరినీ రోడ్డున పడేయం. నామినేటెడ్‌ పదవులతో పాటు ఇతర అవకాశాలను కల్పిస్తాం. ఎవరూ అ«ధైర్యంతో ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. 
– కార్యవర్గ సమావేశంలో కేసీఆర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement