సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: టీఆర్‌ఎస్‌కు సోమవారం వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు మింగుడుపడటంలేదు. సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీ ఫలితాలు ఆ పార్టీకి తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఈ రెండు మున్సిపాలిటీల్లోనూ టీఆర్‌ఎస్ ఆశించిన మేర ఫలితాలు సాధించకపోవటంతో పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం నెలకొంది. సంగారెడ్డి మున్సిపాలిటీలో బరిలోకి దిగిన ముఖ్యనాయకులు సైతం ఓటమి చవిచూడటం పార్టీని కలవరపాటుకు గురిచేస్తోంది.
తెలంగాణ సాధించిన ఊపులో ఉన్న తమ పార్టీకి పట్టణ ఓటర్లు పట్టం కడతారని పార్టీ నాయకత్వం భావించింది. అయితే రెండు మున్సిపాలిటీల్లో ఫలితాలు నిరాశాజనకంగా ఉండడంతో పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల మాదిరిగానే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఉంటాయోమోననే ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల్లో ఫలితాలు ఆశించిన స్థాయిలోలేకపోవటంతో పార్టీ అధిష్టానం స్థానిక నేతల తీరుపై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపిక, టికెట్ల కేటాయింపులో పొరపాట్లు, స్థానిక నాయకత్వం సక్రమంగా, పనిచేయకపోవటం, అంతర్గత విభేదాలు వల్లే ఆశించిన ఫలితాలు రాలేదని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.
సంగారెడ్డి మున్సిపాలిటీలో 31 వార్డులకుగాను పది నుంచి 15 స్థానాలు రావచ్చని టీఆర్‌ఎస్ నాయకత్వం భావించింది. అయితే ఫలితాల్లో కేవలం రెండు స్థానాలకు మాత్రమే టీఆర్‌ఎస్ పరిమితమైంది. 28వార్డుల్లో పార్టీ అభ్యర్థులు పోటీ చేయగా 20, 22 వార్డుల్లో మాత్రం అభ్యర్థులు గెలుపొందారు. మిగితా చోట్ల పార్టీ అభ్యర్థులు ఓటమి చవిచూశారు. పార్టీకి నుంచి బరిలో నిలిచిన మాజీ మున్సిపల్ వైస్‌చైర్మన్ జలాలుద్దీన్‌బాబా, పట్టణ పార్టీ అధ్యక్షురాలు లక్ష్మి, మాజీ వైస్ చైర్మన్ సతీమణి మనోరంజని ఓటమిపాలయ్యారు. జలాలుద్దీన్‌బాబా ఇద్దరు సోదరీమణులు ఓడిపోయారు.
సదాశివపేట మున్సిపాలిటీలో సైతం టీఆర్‌ఎస్‌కు ఆశించిన ఫలితాలు రాలేదు. మున్సిపాలిటీలో 21 వార్డులకుగాను ఐదు వార్డుల్లో మాత్రమే టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. సదాశివపేటలోనూ ఆశించిన ఫలితాలు రాకపోవటం పార్టీ నాయకులను నిరాశకలిగించింది. రెండు మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేసిన టీఆర్‌ఎస్ నేతలకు ఫలితాలు మింగుడుపడని పరిస్థితి నెలకొంది.
టీఆర్‌ఎస్‌కు మింగుడుపడని ఫలితాలు
Published Tue, May 13 2014 12:07 AM | Last Updated on Wed, Aug 29 2018 6:13 PM
Advertisement
Advertisement