సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మున్సి‘పల్స్’ దొరికింది. 42 రోజుల సుదీర్ఘ నిరీక్షణకు సోమవారం తెరపడింది. పుర పోరులో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్, తెచ్చిన టీఆర్‌ఎస్ హోరాహోరీగా పోటీపడ్డాయి. అయితే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకే మెతుకుసీమ పట్టణ ఓటర్లు ‘చేయూత’నందించారు. ఎన్నికల సర్వేల అంచనాలను తలకిందులు చేస్తూ ఓటర్లు తీర్పు చెప్పారు. సదాశివపేట, సంగారెడ్డి, జహీరాబాద్ మున్సిపాలిటీల్లో, అందోల్ నగర పంచాయతీలో కాంగ్రెస్ పార్టీకి చైర్మన్లను ఎన్నుకునే స్పష్టమైన మెజార్టీ వచ్చింది. గజ్వేల్ నగర పంచాయతీలో టీఆర్‌ఎస్, టీడీపీ ఇంచుమించు చెరిసగం సీట్లు గెలుచుకోవడంతో ఇక్కడ హైడ్రామాకు తెరలేచింది.
మెదక్ మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్ పెద్ద పార్టీగా ఆవిర్భవించినప్పటికీ చైర్మన్ పీఠం సొంతం చేసుకోవడంలో మాత్రం ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ టీడీపీ, కాంగ్రెస్, ఇతరులు జెండాలు, ఎజెండాలు పక్కనపెట్టి జట్టుకట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అన్ని పార్టీలు అప్పుడే క్యాంపు రాజకీయాలు ప్రారంభించాయి. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలలో కలిపి 145 వార్డులకు ఎన్నికలు జరుగగా.. కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 56 వార్డులను గెలుచుకుని ముందంజలో ఉంది. 36 వార్డులతో టీఆర్‌ఎస్ రెండో స్థానంలో ఉంది.
గజ్వేల్‌లో జీవన్మరణ పోరాటం...
గులాబీ దళపతి కేసీఆర్‌కు ప్రతిష్టాత్మకంగా మారిన గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీలో టీఆర్‌ఎస్‌కు, టీడీపీ గట్టి పోటీ ఇచ్చింది. హోరాహోరీగా సాగిన పోరులో టీడీపీపే ఒక స్థానం అధికంగా సాధించింది. టీడీపీకి 10, టీఆర్‌ఎస్‌కు 9 వార్డులు వచ్చాయి. ఒకే ఒక వార్డును కాంగ్రెస్ గెలుచుకుంది. కాంగ్రెస్ నుంచి గెలిచిన అభ్యర్థిని టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు తమ వెంట తీసుకుని వెళ్లారు. మూడో వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన అల్వాల మాధవి కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు రాగానే ఆమెను టీఆర్‌ఎస్ నేతలు కారులో ఎక్కించుకుని అజ్ఞాత ప్రాంతానికి తరలించారు.
అయితే ఆమెను బలవంతంగా తీసుకుపోయినట్టుగాని, లేదా కిడ్నాప్ చేసినట్లుగాని ఇప్పటివరకు పోలీసులు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. దీన్ని బట్టి చూస్తే ఆమె టీఆర్‌ఎస్‌లోకి ‘జంప్’ అయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. అదే జరిగితే ఇరు పార్టీలకు పదేసి వార్డుల చొప్పున వచ్చినట్లు అవుతుంది. ఇక ఇక్కడ ఎక్స్‌అఫీషియో ఓటు అత్యంత కీలకం. అంటే గజ్వేల్ అసెంబ్లీ నుంచి ఎవరు గెలిచి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తారో వారి ఓటే కీలకం కానుంది.
సంగారెడ్డిలో స్వతంత్రులే కీలకం..
సంగారెడ్డి మున్సిపాల్టీలో కాంగ్రెస్ పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ చైర్మన్ ఎంపికకు కావాల్సిన మెజార్టీ మాత్రం రాలేదు. ఇక్కడ 31 వార్డులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ 11, ఎంఐఎం 8, బీజేపీ 4, టీఆర్‌ఎస్ 2, సీపీఎం 1, స్వతంత్రులు 5 వార్డులు గెలుచుకున్నారు. చైర్మన్‌ను ఎన్నుకోవడానికి కనీసం 16 వార్డులు అవసరం. కాంగ్రెస్ 11 స్థానాలు మాత్రమే సాధించింది. సీపీఎం ఒక స్థానం గెలుచుకోగా ఆయన కాంగ్రెస్‌కే మద్దతు ఇస్తానని చెప్పడంతో ఆ పార్టీ వార్డుల సంఖ్య 12కు చేరింది.
గెలిచిన ఐదు మంది స్వతంత్రులలో ముగ్గురు కౌన్సిలర్లు జగ్గారెడ్డివైపే ఉన్నట్టు సమాచారం. ఈ లెక్కన కాంగ్రెస్ పార్టీకి 15 మంది సభ్యుల ఉన్నట్టే. ఇంకా కావాల్సింది కేవలం ఒకే ఒక్కరు కాబట్టి ఈ ఒక్క సభ్యుని ఎలాగైనా సంపాదించుకుంటామనే నమ్మకంతో ఉన్నారు. సదాశివపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కి పార్టీ స్పష్టమైన మెజార్టీ వచ్చింది. ఈ రెండు మున్సిపాలిటీలలో మాజీ విప్ జగ్గారెడ్డి ముద్ర ఉంటుంది.
‘బట్టి’ మంత్రాంగం!
మెదక్ మున్సిపాలిటీలో మొత్తం 27 వార్డులకు గాను టీఆర్‌ఎస్ 11, కాంగ్రెస్ 6, టీడీపీ 5, ఎంఐఎం 1, స్వతంత్రులు 2 వార్డుల చొప్పున గెలుచుకున్నారు. టీఆర్‌ఎస్ పెద్దపార్టీగా అవతరించినప్పటికీ చైర్మన్ పీఠం మాత్రం అంత సులువుగా అందేటట్టు లేదు. ఇక్కడ టీఆర్‌ఎస్‌యేతర పార్టీలు జెండాలు, ఎజెండాలను పక్కబెట్టి ఒకే వేదిక మీదకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. టీడీపీకి చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్ బట్టి జగపతి కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, స్వతంత్రులు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అదే జరిగితే టీఆర్‌ఎస్ ఇక్కడ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది.